ఆంధ్రా వరద బాధితులకు చంద్రబాబు ఇచ్చింది భారీ ప్యాకేజేనా!
x

ఆంధ్రా వరద బాధితులకు చంద్రబాబు ఇచ్చింది భారీ ప్యాకేజేనా!

ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10వేల కోట్ల రూపాయల మేర ఈ ప్యాకేజీని ప్రకటించింది. వరదల్లో అతలాకుతలమైన వారికి ఈ సాయాన్ని అందిస్తారు


ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయాన్నే ప్రకటించింది. దాదాపు 10వేల కోట్ల రూపాయల మేర ఈ ప్యాకేజీ ఉంది. భారీ వర్షాలు, వరదల్లో అతలాకుతలమైన రైతులు, జాలర్లు సహా వివిధ వర్గాల వారికి ఈ సాయాన్ని అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వరద బాధితుల సహాయ, పునరావాస ప్యాకేజీ సహాయాన్ని ప్రకటిస్తూ.. తమది ప్రజా ప్రభుత్వమని, అందర్నీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అదే స్థాయిలో నష్టపరిహారాన్నీ ప్రకటించింది. "సహేతుకమైన నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారం పెద్ద విషయం కాదు, అది ప్రతి బాధితునికీ అందేలా చూడాలన్నదే తమ ప్రాధాన్యత, డబ్బు ప్రధానం కాదు" అన్నారు చంద్రబాబు. ఈ నష్టపరిహారాన్ని ఒకట్రెండు రోజుల్లో బాధితులకు అందించడం మొదలవుతుంది. అసలు ప్యాకేజీ ఎంత అనేది కూడా అప్పుడు కచ్చితంగా తేలుతుంది.

"మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. వరద బాధితులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం" అన్నారు చంద్రబాబు. ఈ వ్యాఖ్య వెనుక ఉన్న ఉద్దేశం ఏమైనప్పటికీ బాధితులకు వరద వచ్చిన పది రోజుల్లోపే సహాయాన్ని ప్రకటించడం ముదావహం అంటున్నారు ఆయన సహచర మంత్రులు.
ప్యాకేజీ ఇలా ఉంది...
విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని 179 గ్రామ సచివాలయాల పరిథిలో గ్రౌండ్ ఫ్లోర్స్ మునిగాయి. ఆ ఇళ్లన్నింటికీ ఒక్కోదానికి రూ.25వేల చొప్పున సాయం అందిస్తారు. మొదటి, ఆపై అంతస్తుల్లో ఇళ్లు మునిగిన వారికి రూ.10వేలు ఇస్తారు. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తారు. చిరు వ్యాపారులు, టీబంకులు, ఇతర చిన్న చిన్న వ్యాపారులకు రూ.25వేల సాయం అందుతుంది.
సెరికల్చర్‌కు ఎకరాకు రూ.6వేలు, చెరకు రైతులకు ఎకరాకు రూ.25వేలు, వరి పంటకు ఎకరాకు రూ.10వేలు పరిహారం చెల్లిస్తారు. నష్టపోయిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, మూడు చక్రాల (ఆటో) యజమానులకు రూ.10వేలు పరిహారం ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. పడవలకు, చేపలు పట్టే వలలు పూర్తిగా దెబ్బతింటే రూ. 20వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ. 9వేలు ఇస్తారు.
నేత కార్మికులకు రూ.15వేల సాయం అందుతుంది. రూ.40 లక్షల నుంచి ఒక కోటీ 50 లక్షల రూపాయల మధ్య టర్నోవర్ ఉండే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 1 లక్ష రూపాయల పరిహారం చెల్లిస్తారు. కోటిన్నరకు మించి టర్నోవర్ ఉంటే రూ.1.5 లక్షలు చెల్లిస్తారు.
బ్యాంకులకు ప్రత్యేక వినతి..
వినియోగ రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి బ్యాంకులను కోరారు. గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ల కోసం 36 నెలల రీపేమెంట్ వ్యవధితో మూడు నెలల మారటోరియంతో రూ. 50 వేల రుణం అందించాలని విజ్ఞప్తి చేశారు. 179 సచివాలయాల పరిధిలో మొదటి అంతస్తు, ఆపై అంతస్తుల్లోని ఇళ్లకు 36 నెలల రీపేమెంట్ వ్యవధి, 3 నెలల మారటోరియంతో రూ.25వేల లోన్ ఇవ్వాలని కోరారు.
దుకాణాలు, వాణిజ్య సంస్థలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 12 నెలల పాటు చెల్లింపులను రీషెడ్యూల్ చేయడానికి బ్యాంకులు అంగీకరించాయి. “ప్రభుత్వం 24 నెలల రీషెడ్యూల్‌ని కోరింది. ప్రభుత్వం అదనపు పూచీకత్తు లేకుండా అదనపు వర్కింగ్ క్యాపిటల్‌ను కూడా సమకూర్చాలని కోరాం” అని చంద్రబాబు చెప్పారు.
వ్యవసాయ స్వల్పకాలిక పంట రుణాలు 12 నెలల మారటోరియంతో ఐదేళ్లపాటు రీషెడ్యూల్ చేయనున్నారు. వ్యవసాయ టర్మ్ రుణాల వాయిదాలను కూడా రీషెడ్యూల్ చేయాలని, రైతుల అవసరాలకు అనుగుణంగా తాజా పంట రుణాలను జారీ చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆ విషయాన్ని కూడా బ్యాంకుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చంద్రబాబు చెప్పారు.
ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు..
ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తారు. సులభవాయిదాలో అప్పుల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ధ్వంసమైన హేచరీలు, కోళ్ల ఫారాలను ఆదుకుంటారు. చనిపోయిన ప్రతి కోడికి రూ.100 పరిహారం ఇస్తారు. వరదల్లో చనిపోయిన ప్రతి పశువుకీ రూ.50వేలు, దూడలకి రూ.25వేలు, గొర్రెలు ఒక్కోదానికి రూ.7,500 ఇస్తారు. ఎద్దుల బండ్లు కోల్పోయిన వారికి కొత్త బండ్లు ప్రభుత్వమే అందిస్తుంది. హెక్టారుకు పత్తికి, వేరుశనగకి నష్టపరిహారంగా రూ.25వేలు, మేట వేసిన పొలాలను బాగుచేసుకునేందుకు హెక్టార్ కి రూ.15వేలు ఇస్తారు. పసుపు, అరటి తోటల యజమానులు ఒక్కొక్కరికి రూ. 35వేలు అందుతాయి. మొక్కజొన్న, మినుము, పిల్లిపెసర రైతులకు హెక్టార్ కి రూ. 15వేల సాయం అందుతుంది.
ఓపక్క సాయం ప్రకటిస్తూనే చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలనూ విస్మరించలేదు. పనిలో పనిగా గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బుడమేరు సమీపంలోని భూములను వైసీపీ ప్రభత్వంలోని పెద్దలు ఆక్రమించడం వల్లే వరదల తాకిడి పెరిగిందన్నారు. ఈ మొత్తం విధ్వంసానికి సగం కారణం జగన్ ప్రభుత్వమేనని విమర్శించడం గమనార్హం.


Read More
Next Story