ఆంధ్రా ఎన్డీయే కూటమిలో పొత్తుల చిక్కులు
నేతలకు తలనొప్పిగా మారిన టీడీపీ, జనసేన, బిజెపీ పొత్తులు. విజయావకాశాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలా కేటాయిస్తారని రాజీనామాలు.
(జి. విజయ కుమార్)
కృష్ణా జిల్లా అవనిగడ్డలో పొత్తు రాజకీయాలు రచ్చకెక్కాయి. టీడీపీ, జనసేన, బిజెపీ పొత్తులు ఇంకా తేలకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలంలా మారారు. జనసేనకు కాదు తెలుగుదేశం పార్టీకే అవనిగడ్డ అసెంబ్లీ సీటును కేటాయించాలని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్డుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు తమకే అవనిగడ్డ స్థానాన్ని కేటాయించాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో అవనిగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీకి కేటాయిస్తే జనసేన శ్రేణులు ఎలా రియాక్టవుతాయో, జనసేనకు ఖరారు చేస్తే తెలుగు తమ్ముళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆ పార్టీల పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇరు పార్టీ కార్యకర్తల భావోద్వేగాలు ఉవ్వెత్తున లేస్తున్న తరుణంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అటు నేతలు, కార్యకర్తల్లోను ఇటు స్థానికుల్లోను తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మండలి బుద్దప్రసాద్‌కు కేటాయించాలని అల్టిమేటం
అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నిర్ణయానికి రావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అడనిగడ్డ తెలుగుదేశం పార్టీకి అడ్డా అని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకే ఈ స్థానం కేటాయించాలని పట్టుబట్టుతున్నారు. అవనిగడ్డ నియోజక వర్గం టీడీపీ ఇన్‌చార్జీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్‌కు ఈ సీటు
కేటాయించాలని స్థానిక నేతలు, బుద్దప్రసాద్ వర్గీయులు భీష్మించి కూర్చున్నారు. ఆ మేరకు మంగళవారం స్థానికంగా సమావేశం ఏర్పాటు చేశారు. బుద్దప్రసాద్‌కు సాయంత్రంలోపల సీటు కేటాయిస్తున్నట్లు పేరు ప్రకటించక పోతే తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ఆ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. అయితే చంద్రబాబు వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం, అవనిగడ్డ టీడీపీ అభ్యర్థిగా బుద్దప్రసాద్‌ను ప్రకటించక పోవడంతో రాజీనామాలకు తెగబడ్డారు. దాదాపు 50మందికిపైగా టీడీపీ నాయకులు తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను కొరియర్ ద్వారా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపుతున్నట్లు ఆ పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు చెప్పారు. అంతేకాకుండా తాము జనసేనకు వ్యతిరేకం కాదన్నారు. విజయవకాశాలను పరిగణలోకి తీసుకొని పొత్తుల్లో సీట్లను ఖరారు చేయాలని, దాని కోసం మరో సారి సర్వే చేయించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబును కోరారు.
జనసేనకు అవనిగడ్డ సీటు
పొత్తుల్లో అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారని చర్చ సాగుతోంది. ఈ సీటు కోసం ప్రముఖ కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. ఇటీవల జనసేనలో చేరిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపి బాలశౌరీ కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. మచిలీపట్నం ఎంపి సీటు కోసం పవన్ కల్యాణ్ అన్న నాగబాబు పట్టుబట్టుతుండటంతో బౌలశౌరీ అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు. ఇదే అవనిగడ్డ అసెంబ్లీ సీటు కోసం వంగవీటి రాధాకృష్ణ కూడా పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, వల్లభనేని బాలశౌరీలను ఇటీవల వంగవీటి రాధా కలవడంతో ఈ అంశం తెరపైకి వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇలా ఒక్క సీటు కోసం జనసేనలోనే నలుగురు నాయకులు పోటీ పడుతుండటంతో జనసేన రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. అయితే జనసేన పార్టీ పెద్దలు చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో విక్కుర్తి శ్రీనివాస్‌కే అనుకూలంగా రావడంతో ఆయనకే సీటు ఖరారు చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. మచిలీపట్నం ఎంపి సీటుపైన కూడా జనసేనలో తీవ్ర పోటీ నెలకొంది. ఒక వేళ మచిలీపట్నం ఎంపి నుంచి బాలశౌరీ పక్కకు తప్పుకుంటే గ్రీన్‌కో డైరెక్టర్ బండారు నరసింహారావు బరిలో నిలచే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తీవ్ర అసంతృప్తిలో మండలి బుద్ద ప్రసాద్
చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తన పేరు లేక పోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత మండలి బుద్దప్రసాద్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అవనిగడ్డ టీడీపీ టికెట్ తనకే వస్తుందని ఆశించిన ఆయన చంద్రబాబు ఖరారు చేయకపోడంతో తీవ్ర ఆవేదన చెందారు. పదవుల కోసం పుట్ట లేదని, రాజకీయాలు కళ్ల ముందే మారి పోయాయని, రాజకీయాలకు డబ్బు ప్రధానం అయిపోయిందని, డబ్బులున్న వాళ్లకే సీట్లు ఖరారు చేస్తున్నారని, ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్థులుగా అన్వేషిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. మూడు పర్యాయాలు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బుద్దప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగాను, విభజిత రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌గాను పని చేశారు. అవనిగడ్డలో మంచి పట్టున్న నేతల్లో బుద్దప్రసాద్ ఒకరని రాజకీయ నాయకులు చెబుతున్నారు.
Next Story