
Sagging platform | ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం..
ప్రమాణ స్వీకారోత్సవ వేదిక కుప్పకూలింది. ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తప్పింది.
పదవి దక్కిందని ఆనందంతో నిర్వహిస్తున్న సభలో అపశృతిచోటుచేసుకుంది. పరిమితికి మించి సభా వేదికపైకి నాయకులు భారీగా చేరుకున్నారు. ఈ బరువుకు తాళలేని వేదిక కుప్ప కూలింది. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల భారీ నష్టం తప్పినట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. కాకినాడలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. "కూడా" (Kakinada urban development authority) చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు "kuda" చైర్మన్గా నియమితులయ్యారు. తన పదవీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా ఏర్పాటు చేశారు. ఇందుకోసం కూడా కార్యాలయం వద్ద తక్కువ ఎత్తులో వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం నుంచి భారీగా జనసేన, టిడిపి, బిజెపి కూటమి నాయకులు సభ్యులు తరలివచ్చారు.
కూడా కార్యాలయం వద్ద అప్పటికే టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, టిడిపి ఎమ్మెల్యేలు చినరాజప్ప, నానాజీ తో పాటు మూడు పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు.
కూడా చైర్మన్ గా నియమితులైన తుమ్మల బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు.
యనమల మాట్లాడుతూ ఉండగా
మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఎవరికి తోచిన తీరుగా వారు వేదిక పైకి చేరుకున్నారు. బహిరంగ సభ కోలహలంగా ఉంది. ఆనందోత్సవాలు మిన్నంటుతున్న వేళ.. సభలో టిడిపి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతుండగా, వేదిక ఒకసారి కుప్ప కూలింది. దీంతో పదుల సంఖ్యలో నాయకులు ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో జరిగిన తోపులాటలో స్వల్పంగా కొందరు గాయపడ్డారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలకు గాయాలు
అధిక బరువు కారణంగా వేదిక కుప్పకూలిన ఈ ఘటనలతో నాయకులు ఆందోళన చెందారు. వేదికపై ఉన్న టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తో పాటు, ఎమ్మెల్యేలు చినరాజప్ప, నానాజీ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం అందింది. వేదిక తక్కువ ఎత్తులో ఉండడం వల్ల భారీ ప్రమాదమే తప్పినట్లు భావిస్తున్నారు. కింద పడిపోయిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని సమీపంలోని కార్యకర్తలు భుజాలపై మోసుకుంటూ పక్కకు తీసుకువచ్చారు.. మరో ఎమ్మెల్యే నానాజీకి తలకు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. మిగతా నాయకులందరినీ సమీపంలో ఉన్న కార్యకర్తలు సురక్షితంగా పక్కకు తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా, పరిస్థితి సద్దుమడిగిన తర్వాత కూడా చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించినట్లు తెలుస్తోంది.
Next Story