అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
x

అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా

అనకాపల్లి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం ఫార్మా స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఉన్న ఎస్సైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది.


అనకాపల్లి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం ఫార్మా స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఉన్న ఎస్సైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్ లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా ప్రమాద మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందివ్వనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ప్రకటించారు. అదే విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా ఆర్థిక పరిహారం అందిస్తామని చెప్పారు. క్షతగాత్రులకు వారికి జరిగిన గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారాన్ని నిర్ణయిస్తామని వివరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

పెరుగుతున్న మరణాలు

సంఘటనలో ఇప్పటి వరకు 20 మంది పైనే మృతి చెందారు. అధికారికంగా ప్రభుత్వం 17 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. వైద్యశాలల్లో ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడే ఉన్న అధికారులు వైద్యులతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఈ కంపెనీలో మొత్తం 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మధ్యహ్నాం షిఫ్ట్‌ మారే సమయంలో ఈ సంఘటన జరిగింది. అప్పటి వరకు పనిచేసిన కార్మికులతో పాటు అప్పుడే డ్యూటీలోకి వచ్చిన వారు మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన సమయంలో మూడో ఫ్లోర్‌లో సుమారు 100 మంది పైన ఉన్నట్లు సమాచారం. కంపెనీ యాజమాన్యం మాత్రం ఎంత మంది ఆఫ్లోర్‌లో ఉన్నారనేది స్పష్టం చేయలేదు.

పేలింది రియాక్టర్ కాదు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర ప్రమాదం మానవ తప్పిదం. సాల్వెంట్‌ ఆయిల్‌ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్‌ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించి కార్మికుల మరణాలకు దారితీసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తయారు చేసిన ప్రథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇంకా బయటకు రాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాన్‌కు నివేదిక చేరినట్లు విశ్వసనీయ సమాచారం.

Read More
Next Story