రాజకీయాలకు అలీ స్వస్తి.. కారణం అదేనా!
x

రాజకీయాలకు అలీ స్వస్తి.. కారణం అదేనా!

వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన హాస్యనటుడు అలీ తాను రాజకీయాలకు స్వస్తి పలికినట్లు ప్రకటించారు. ఒక్కసారిగా ఆయన తీసుకున్న నిర్ణయం చర్చలకు తావిస్తోంది.


హాస్యనటుడు అలీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన అనంతరం తాను ఏ పార్టీకి సంబంధించిన మనిషి కాదని వివరిస్తూ ప్రత్యేక వీడియాను విడుదల చేశారు. ఒకపై తాను కూడా ఒక సాధారణ పౌరుడినే అని, ప్రతి ఐదేళ్లకు అందరి మాదిరిగానే వెళ్ళి ఓటు వేస్తానని చెప్పారు. ఇన్నాళ్లూ రాజకీయాల్లో కొనసాగి.. మూడు పార్టీలు మారిన అలీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అలీ ఇంత సడెన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై తీవ్ర స్థాయి ప్రచారాలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు అలీకి అనువిప్పు జరిగిందని అంటుంటే మరి కొందరు పాత్ర తలకెక్కి రాజకీయ మత్తు దిగిందని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన ఒక్కసారిగా రాజకీయాల నుంచి తప్పుకోవడం కీలకంగా మారింది.

‘ఏ పార్టీ మనిషిని కాదు’

తాను వైసీపీ నుంచే కాకుండా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అలీ ప్రకటించారు. ‘‘నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఏ పార్టీ సపోర్టర్‌ని కాదు. నేను ఒక సామాన్యుడిని మాత్రమే. అలానే ఉండి.. ఇకపై నా సినిమా, షూటింగ్‌లకు దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అందరి తరహాలోనే నేను కూడా ఓటు వేస్తాను. రాజకీయాలకు స్వస్తి.. గుడ్‌బై అంటూ’’ అని తన తాజాగా వీడియోలో చెప్పారు.

అందుకే వీడ్కోలు పలికారా!

రాజకీయాల్లో టీడీపీ, జనసేన పార్టీ తర్వాత వైసీపీ గూటికి చేరారు అలీ. ప్రతి పార్టీలో కూడా టికెట్ ఆశించి భగంపడిన నేతగానే అలీ నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా అలీ ఎక్కడా కనిపించలేదు. టికెట్ రాకపోవడంతో ఆయన వైసీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం పాటించారు. గతంలో ఏ పార్టీ కూడా తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రాజకీయాలకు దూరం పాటించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. వైసీపీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చినా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మాత్రం మొండిచెయి చూపించింది. దాంతో మనస్థాపానికి గురైన అలీ.. ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ ప్రచారంలో కూడా అలీ పాల్గొనలేదు. ఇప్పుడు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచింది.

పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించి జనసేన సరికొత్త చరిత్ర సృష్టించింది. 2023లో నగరిలో కొండచుట్టు ఉత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. వాటిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలీ.. పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తా అక్కడ ఆయన ప్రత్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ ఈ ఎన్నికల్లో అలీకి వైసీపీ ఎక్కడి నుంచి కూడా అవకాశం కల్పించలేదు. కానీ ఎవరితో అయితే అలీ ఛాలెంజ్ చేశారో ఆ నేత పవన్ కల్యాణ్ దాదాపు 73వేల ఓట్ల మెజార్టీతో పిఠాపుం ఎమ్మెల్యేగా నిలిచారు. ఇటు అలీని చూస్తే కనీసం టికెట్ కూడా దొరక్క భంగపడి నిరాశతో కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొని ఉంది. దాంతో లేని దాని కోసం ఆశపడి.. ఉన్న ఇండస్ట్రీ జీవితాన్ని పోగొట్టుకూడదని భావించే అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని అను సన్నిహితులు చెప్తున్నారు.

అంతేకాకుండా మరో వైపు పవన్‌తో ఛాలెంజ్ తర్వాత అలీకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయని, సినిమా అవకాశాలు కూడా రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఐదేళ్లు పవర్ లేకుండా రాజకీయాల్లో కొనసాగి ఉన్న అవకాశాలను, వస్తున్న ఛాన్స్‌లను వదులుకోవడం ఇష్టం లేక. ఇప్పటికైనా రాజకీయాలకు టాటా చెప్తే టీవీ షోలైనా చేసుకోవచ్చని ఆలోచించే అలీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

‘అందుకే రాజకీయాల్లోకి వచ్చా’

‘‘1999లో పెద్దాయన డి రామనాయుడు కోసం రాజకీయాల్లోకి వచచాను. చైల్డ్ ఆర్టిస్ట్‌ తర్వాత ప్రేమఖైదీ సినిమాతో నాకో గొప్ప అవకాశం ఇచ్చారు. నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పట్లో ఆయన బాపట్ల నుంచి టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆ సమయంలో ప్రచారానికి రావాలని కోరితే వెళ్లాను. నేను ఒకే పార్టీలో దాదాపు 20 ఏళ్లు కొనసాగాను. ఆ తర్వాత వైసీపీలోకి రావడం జరిగింది. నాకు మొదట అన్నం పెట్టింది తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షక దేవుళ్లు, నిర్మాతలు, దర్శకులు. నేను 45 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ స్థాయికి ఎదిగాను. ఆరు భాషల్లో దాదాపు 1200 సినిమాలు చేశాను. పది మందికి సహాయపడాలన్న ఉద్దేశంతోనే రాజకీయ ప్రవేవం చేశాను. అంతేతప్ప రాజకీయాలు చేయాలన్న ఆలోచన కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు.

‘వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదు’

‘‘నేను ఏ పార్టీలో ఉన్న మా ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎవరిపైనా నేను వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయలేదు. కేవలం మా పార్టీ అభ్యర్థి, అధినేత గురించి పొగిడాను. ఎప్పుడూ కూడా అవతలి వ్యక్తులను మాటలు అనడం గానీ, వాళ్లి జీవితం గురించి నేను మాట్లాడలేదు. ప్రస్తుతం నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇక నా సినిమాలు, షూటింగ్‌లపై ఫోకస్ పెడతాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను’’ అని వివరించారు.

Read More
Next Story