తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు..
తిరుమల శ్రీవారి క్షేత్రం సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా టీటీడీ యంత్రాంగం సిద్ధం అవుతోంది. అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు మొదటిసారి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు నాల్గవ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సమాయత్తం అవుతోంది. బ్రహోత్సవాల్లో ప్రధానఘట్టం గరుడోత్సవం అక్టోబర్ ఎనిమిదో తేదీ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణ రోజు సీఎం ఎన్. చంద్రబాబునాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మత్సావాలు కావడం, అదే సమయంలో పెరటాసి (తమిళ) మాసం కూడా కావడంతో యాత్రికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. భక్తులకు వసతి సదుపాయాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జే. శ్యామలరావు మీడియాకు తెలిపారు. అంతకుముందు తిరుమలలోని అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మంతోపాటు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం సమీక్షించారు. అంతకుముందు ఈఓ శ్యామలరావు ఇంజినీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్‌డీపీపీ, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సీవీ అండ్ ఎస్వో శ్రీధర్, ఎఫ్ఏసీఓ బాలాజీ , సీఈ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వివిధ శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాయంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు రాక
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇందుకోసం తిరుమలలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయి. అదే రోజు సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గరుడోత్సవం రోజు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. కానీ, ఆ రోజు యాత్రికుల రద్దీ అనూహ్యంగా ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుడదనే ధ్వజారోహణం రోజు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఎనిమిదిన గరుడసేవ
శ్రీవారి బ్రహ్మత్సవాల్లో ప్రధానమైంది గరుడోత్సవం. అక్టోబరు 8న గరుడసేవ జరుగుతుంది. ఆ రోజు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేశారు. అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద ద్విచక్రవాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. జిల్లా, పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు చక్కటి సేవలందించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయని వివరించారు.
వాహన సేవలు
బ్రహ్మెత్సవాల్లో రోజూ శ్రీవారి ఉత్సవమూర్తులను తిరుమల మాడవీఢుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూడడానికి భక్తులతో గ్యాలరీలు కిక్కిరుస్తాయి. ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు, రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలకు వరకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు మాడవీధుల్లో విహరిస్తూ, భక్తులను అనుగ్రహిస్తారు. గరుడవాహన సేవ మాత్రం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది.
సేవలు రద్దు
"బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే అనేక సేవలను రద్దు చేశాం అని" టీటీడీ జేఈఓ జే. శ్యామలరావు తెలిపారు. ఇందులో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
"అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదు" అని ఈఓ స్పష్టం చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా అదనపు భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. "వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల, తిరుపతిలో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నాం" అని ఆయన వివరించారు. తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున, తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని సూచించారు.
యాత్రికులకు సేవలు
బ్రహ్మోత్సవాల వేళ యాత్రికులకు అన్ని రకాల సదుపాయాలు పగడ్బందీగా కల్పిస్తామన్నారు. "తిరుమలలో కల్యాణకట్ట, ఇతర మినీ కల్యాణకట్టలలో క్షురకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని ఈఓ శ్యామలరావు తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో అన్నప్రసాదం, పాలు, అల్పాహారం నిరంతరాయంగా ఉంటుందన్నారు. తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్య కేంద్రాలు, డిస్పెన్సరీ తోపాటు పలు ప్రథమ చికిత్స కేంద్రాలు, మొబైల్‌క్లినిక్, అంబులెన్సులు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులు, తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు. ఫొటో ఎగ్జిబిషన్, ఫలపుష్ప ప్రదర్శనశాల, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలు ఏర్పాటు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఇతర ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళాబృందాలతో వాహనసేవల్లో ప్రదర్శనలు.
Next Story