పులుల్ని మింగిన గొర్రెలున్నాయట... ఎక్కడో తెలుసా...?
x

పులుల్ని మింగిన గొర్రెలున్నాయట... ఎక్కడో తెలుసా...?

శ్రీకాకుళం సాయుధ పోరాటం...భూస్వామ్య వ్యతిరేక పోరాటమా...? ఆదివాసీ, దళిత చైతన్య పోరాటమా...? శ్రీకాకుళం సాయుధ పోరాటం ద్వారా ఉద్యమకారులు ఏం సాధించారు..?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఆ విప్లవాగ్ని ఎక్కడిదని అడగగా... ఎర్రబారిన తూర్పు కొండల వైపు చూడమన్నాడో విప్లవ కవి… ఆరున్నర దశాబ్దాల క్రితం అవే విప్లవ జ్వాలలు పశ్చిమ బెంగాల్‌లోని ఓ కుగ్రామం నక్సల్బరీ పేరును ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. అదే సమయంలో సమాంతరంగా సాగిన విప్లవోద్యమమే శ్రీకాకుళ సాయుధ పోరాటం. ఈ ఉద్యమం 1958లో ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, పాలకొండ ఏజెన్సీ ప్రాంతాల్లో భూస్వాముల దోపిడిని చూసి చలించిన పల్లె రాములు గిరిజనులను చైతన్యపరిచి ఉద్యమం వైపు మళ్లించడంతో శ్రీకాకుళ సాయుధ పోరాటానికి తొలి అడుగులు పడ్డాయి. అప్పటికే పాలకొండ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న హయగ్రీవరావు, పత్తిరాజుతో కలిసి రాములు ఊరూరా తిరుగుతూ గిరిజన సంఘాలు ఏర్పాటు చేశారు.

గ్రామాల్లో ప్రజలను 'నీళ్ల ధార' ప్రమాణం చేయించి సంఘంలో సభ్యత్వం చేయించేవారు. క్రమేపీ ఈ గిరిజన సంఘాలు గ్రామ గ్రామాన విస్తరించాయి. 1960 నాటికి ఎర్ర సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఎర్ర జెండాలు పచ్చని పంట పొలాల్లో వెలిశాయి.సుందరయ్య డైరెక్షన్, నండూరి ప్రసాదరావు ప్రత్యక్ష సహకారంతో ఉద్యమం నడుస్తూ వస్తుంది. 1961లో మొట్టమొదటి గిరిజన సంఘం మహాసభను మొందెంఖల్లులో అత్యంత జయప్రదంగా నిర్వహించారు.

ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమం....

శ్రీకాకుళ రైతాంగ పోరాటం ఆదివాసి సమస్యలతో ప్రారంభమై తాడిత పీడిత ప్రజా పోరాటంగా ఉద్భవించింది. ఈ క్రమంలోనే ఉద్యమ నేతలు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, సుబ్బారావు పాణిగ్రాహీలు రాత్రి సమయాల్లో గ్రామాల్లో వయో విద్య నేర్పిస్తూ ప్రజలను ఉద్యమం వైపు మరల్చారు. ప్రజా తిరుగుబాటుతో పాటు భూస్వాముల దోపిడిని అరికట్టేందుకు ఆదివాసి, రైతాంగ వ్యవస్థలను సంసిద్ధం చేశారు. ఈ క్రమంలోనే 1967 అక్టోబర్ 31న మొండెంఖల్లు గ్రామంలో గిరిజన ప్రజలతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు పుచ్చలపల్లి సుందరయ్య, కప్పగంతుల సుబ్బారావు తదితర నాయకులు హాజరవుతున్నారు.

వందలు, వేలాదిగా గిరిజన ప్రజలు ఈ సభకు తరలివస్తున్నారు. ఆ సమయంలో గుమ్మ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భూస్వాములు ఈ సభను భగ్నం చేయడానికి పిలేవిడి గ్రామం వద్ద దారికాచి గిరిజనులను అడ్డుకున్నారు. వీరి మధ్య ఏర్పడిన ఘర్షణతో భూస్వాములు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోరన్న, మంగన్న అనే ఇద్దరు గిరిజనులు చనిపోయారు. ఈ సంఘటనతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.'శ్రీకాకుళం ఆదివాసి, రైతాంగ పోరాటం. నక్సల్బరీ ఉద్యమం... తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రజలకు ప్రేరణగా నిలిచాయి. ఈ ఉద్యమాల ఫలితంగానే భూస్వాముల దౌర్జన్యాల నుంచి రైతులు, షావుకారుల దోపిడీ నుంచి గిరిజనులు, వడ్డీ వ్యాపారుల మోసాల నుంచి అమాయక ప్రజలు రక్షించబడ్డారు. గిరిజన సంక్షేమం, రైతాంగ సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టే విధంగా ఈ ఉద్యమాలు సాగాయి' అని ప్రముఖ పాత్రికేయులు, కాలమిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య.. ది ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు.

నిర్బంధంలో సిక్కోలు....

1969...శ్రీకాకుళం సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజులవి... ఓ వైపు పోలీసు నిర్బంధం మరోవైపు భూస్వాములకు తాడిత పీడిత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మావోయిస్టులకు మధ్య హోరాహోరీ పోరు. అప్పటికే ఉద్యమకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ...గ్రామాల్లో పోలీసుల దాడి... ముమ్మర తనిఖీలు.. పోలీసు పికెట్ల ఏర్పాటు... స్కూలు పిల్లలను కూడా వదలకుండా ప్రత్యేక పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండేవి. అజ్ఞాతంలోకి వెళ్లిన ఉద్యమ నేతల సమాచారం కోసం నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పోలీసు శిబిరం కోసం పదేళ్లపాటు ఓ హై స్కూల్ నే మూసివేశారు. అయినా ఉద్యమకారులకు ప్రజల నుండి సహకారం అందుతూనే ఉంది.

పోలీసుల కళ్లు కప్పి తమ పక్షాన నిలిచి పోరాటం చేస్తున్న శ్రీకాకుళ సాయుధ పోరాట యోధులకు భోజనాలు ఇతర సామాగ్రి ప్రజలు అందిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన పైలా కృష్ణ ప్రసాద్ తన అనుభవాలను ది ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధులతో పంచుకున్నారు.' నేను అప్పుడు ఐదో తరగతి చదువుతున్నాను. మా గ్రామాల్లో ఎటు చూసినా పోలీసులే... చివరకు మా స్కూల్ బ్యాగులు కూడా వదలకుండా మమ్మల్ని తనిఖీ చేసేవారు. అనుమానం వచ్చిన పెద్ద వారిని తీసుకెళ్లి స్టేషన్లలో పడేసేవారు. పోలీసుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న ఉద్యమ నేతలు అప్పుడప్పుడు మా వాళ్లకు వచ్చేవారు. రహస్యంగా మా పెద్దలు వారిని కలిసేవారు. వారికి విడిది, భోజనంతో పాటు గ్రామం దాటే వరకు సహకరించేవారు' అని తన అనుభవాలను చెప్పుకొచ్చారు. శ్రీకాకుళ సాయుధ పోరాటం వల్ల గిరిజన ప్రాంతాలు మెరుగుపడడం ఆనందంగా ఉందంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

త్యాగాల దారిలో... ఉద్యమాల వీరుడు...

భుజాన కావడి బద్ద, నెత్తిమీద ఆదివాసీ బుట్ట, ఆదివాసీలు పెట్టుకునే సాంప్రదాయక గోచీ ధరించి మారువేషంలో తిరిగేవారు... చెల్లాచెదురైన సాయుధ దళాలను సమీకరించడానికి తన శక్తి యుక్తులన్నీ ఒడ్డారు. తీవ్రమైన నిర్భంధం ఉన్నప్పటికీ... ఆయన కోసం పోలీసు వేట కొనసాగుతున్నప్పటికీ... ఆయన ప్రయత్నం ఆపలేదు. చివరకు సాయుధ దళాలను సమీకరించి ఉద్యమానికి ఊపిరి పోశారు. అది 1976వ సంవత్సరం... మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి రామ్ నర్సింగ్‌ను పోలీసులు కాల్చి చంపారు. ఇంతటితో శ్రీకాకుళ సాయుధ పోరాటం ఆగిపోయింది అనుకున్నారు. అదే సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన పైలా. వాసుదేవరావు శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు. మారువేషంలో తిరుగుతూ చెల్లాచెదురైన సేనలను సమీకరించారు.

నలభై రెండేళ్ళ సుదీర్ఘకాలం ప్రభుత్వానికి చిక్కక, లొంగక రహస్య ఉద్యమ జీవితం గడిపిన పైలా వాసుదేవరావు తన సర్వస్వాన్నీ ప్రజల కోసం దార పోశారు.78 సంవత్సరాల జీవితంలో, విద్యార్థి దశ మినహాయిస్తే మిగతా 57 సంవత్సరాలు కమ్యూనిస్టుగా జీవించారు. కార్యకర్తగా రాక ముందు యువకుడిగా ఉన్న కాలంలో ఉన్న పట్టుదల, మొండితనం, ధైర్యం, సాహసం, ఆదర్శాలు, అలవాట్లు చివరిదాకా అనుసరించిన స్ఫూర్తిదాయక నాయకత్వం ఆయనది. పైలా వాసుదేవరావు 1932 ఆగస్టు 11న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, రిట్టపాడు గ్రామంలో జన్మించారు.

అమ్మణ్ణమ్మ, అప్పోజి నాయుడులకు నాల్గవ సంతానంగా జన్మించిన పైలా వాసుదేవరావు 1952లో పలాసలో ఎస్ఎస్ఎల్‌సీ పూర్తి చేశారు. చదువు ముగియగానే, సర్వేయర్ ఉద్యోగం సంపాదించారు. 1953లోనే ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1959లో ఉపాధ్యాయుడి గా చేరి కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. 1968 నవంబర్ 22న ప్రారంభమైన శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటంలో పైలా చూపిన చొరవ, త్యాగం, ధైర్యం, పట్టుదల మరపు రానివి.

భార్య చంద్రమ్మ దళంలోనే...

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైలా వాసుదేవరావు 1970లో సహ ఉద్యమ నేత చంద్రక్కను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కొన్నాళ్లు శ్రీకాకుళం సాయుధ పోరాటాన్ని సాగించారు. అనుకోకుండా ఓ సంఘటనలో పైలా వాసుదేవరావు కళ్ళముందే చంద్రమ్మ పోలీసులకు చిక్కిపోయారు. తర్వాత 13 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. 'నాన్న నిస్వార్ధ, నిష్పక్షపాత, నికార్సైన విప్లవకారుడు. నేను ఒకసారి నాన్న ఉంటున్న శిబిరానికి వెళ్లాను... అక్కడ శుభ్రమైన ఓ ప్లాస్టిక్ బకెట్ కూడా లేదు. పగిలిపోయిన బకెట్ను ఇనుప సువ్వతో చుట్టి వాడుకుంటున్నారు. 78 ఏళ్ల వ్యక్తిగత జీవితంలో తనకంటూ ఏమి మిగిల్చుకొని ఓ పోరాట యోధుడు' అంటూ తండ్రి వాసుదేవరావు గురించి ఆయన కుమార్తె అరుణ.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధితో చెప్పారు.

'నా చిన్నతనంలో అమ్మను ఓసారి నాన్నను ఓసారి కలిశాను. అమ్మ విశాఖపట్నం జైల్లో ఉంది. నాకు అప్పుడు ఐదేళ్లు.. నన్ను పెంచిన నాన్న అత్తులూరి శేషయ్య.. అమ్మ దగ్గరికి తీసుకువెళ్లారు. నన్ను ఆమెను అమ్మ అని పిలవమన్నారు. అమ్మ ఇంటి దగ్గర ఉంది కదా అన్నాను. అంతే అమ్మ బోరుమని ఏడ్చేసింది. ఓసారి నాన్న అరటి తోటలో విప్లవ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడికి నన్ను తీసుకువెళ్లారు. కొద్దిసేపు మాత్రమే నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని... వెంటనే అక్కడ నుంచి పంపించేశారు' అంటూ అరుణ అమ్మానాన్నలతో ఉన్న అనుబంధాన్ని.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో పంచుకున్నారు.

'పైలా'కు నివాళి...

సుదీర్ఘ కాలం పాటు శ్రీకాకుళ సాయుధ పోరాటంతో ఆదివాసి, రైతాంగ తాడిత పీడిత ప్రజల తరఫున ఉద్యమాలు సాగించిన పైలా వాసుదేవరావు చివరి వరకు అజ్ఞాతంలోనే బతికారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో 2010 ఏప్రిల్ 11న తుది శ్వాస విడిచారు. అప్పట్నుంచి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘనంగా చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 14న పలాసలో పైలా వర్ధంతి సభ నిర్వహించనున్నారు.

Read More
Next Story