ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరు సరిగా లేదని స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం గందరగోళ పరస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీరే దీనికి నిదర్శనమంటూ వారిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ఎలా ప్రశ్న వేస్తారని నిలదీశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శాసన సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు, వేరే శాఖలకు వెళ్లాయి. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవిన్యూ శాఖకు వెళ్లింది. దీనిపై అంసెబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలా ఎలా వెళ్తాయని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఉభయ సభల్లో మంత్రికి ఒకే ప్రశ్న రావడంపై స్పీకర్ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల పనుల అంశానికి సంబంధించిన ప్రశ్న ఇగిరేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుకి శాసనసభలో ఎదురైంది. ఇదే సమయంలో గాలేరు, నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఇలా ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్నలు రావడం చోటు చేసుకుంది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని స్పీకర్ అధికారులపై మండిపడ్డారు. ప్రశ్నలపైన అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.