ప్రముఖ చెస్ క్రీడాకారిణి, తెలుగు తేజం కోనేరు హంపి మరో సారి మెరిసారు. చెస్ క్రీడలో అరుదైన ఘనత సాధించారు.
ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్2024గా నిలిచిన తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనేరు హంపిని అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమన్నారు. 2024వ సంవత్సరం ఇండియన్ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని, హంపి మరిన్ని విజయాలను సాధించాలని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని లోకేష్ ‘ఎక్స్’ వేదికగా ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కోనేరు హంపిని అభినందించారు. కోనేరు హంపి సాధించిన ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతో పాటు రాష్ట్రం, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. కోనేరు హంపి విజయం యువ ప్రతిభావంతులకు, మరి ముఖ్యంగా బాలికలకు స్పూర్తిదాయకమన్నారు. కోనేరు హంపి నింతర కృషి, నిబద్దతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచారని, భవిష్యత్‌లో మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.