వైసీపీ, టీడీపీ ఉండగా ఆంధ్రప్రదేశ్ బాగుపడదా?
x
Tulasi reddy, congress

వైసీపీ, టీడీపీ ఉండగా ఆంధ్రప్రదేశ్ బాగుపడదా?

విరుచుకుపడ్డ కాంగ్రెస్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి


ఆంధ్రప్రదేశ్ కి పట్టిన శని టీడీపీ, వైసీపీలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.తులసి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ, టిడిపి కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులని ,దొందు దొందే యని ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప, అరాచక, మద్య, డ్రగ్, గంజాయి, బూతుల ఆంధ్ర ప్రదేశ్ గా తయారుచేసి అధికారం కోల్పోయింది అన్నారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైందన్నారు. పేనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు అయిందన్నారు. కేవలం 16 నెలల కాలంలో 1.53 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ చేసింది అన్నారు.
విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని విద్యుత్ వినియోగదారుల మీద మోపి బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నారు.
మండలానికి నాలుగు మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అన్నట్లు మద్యం పాలసీ తయారైందని విరుచుకు పడ్డారు. మూడు జోకర్లు ,ఆరు కళావర్లు అన్నట్లు జూదం విచ్చలవిడిగా సాగుతుందన్నారు. హైస్కూళ్లల్లోనూ డ్రగ్స్, గంజాయి ప్రవేశించాయన్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి ,ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఈ హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు అన్నారు.
"రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అరటి , చీని,మామిడి, టమోటో, ఉల్లి, మిర్చి, పొగాకు ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. యూరియా కొరత రైతులను వెంటాడుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ప్రతిభావంతులకు ,పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కింద 6400 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. టిడిపి నాయకులు రెడ్ బుక్ అంటూ, YCP నాయకులు డిజిటల్ బుక్ అంటూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు" అన్నారు తులసిరెడ్డి. ఈ నేపథ్యంలో రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.
Read More
Next Story