వధువు తల్లి గుండె పోటుకు గురయ్యారు. వరుని నివాసం ముందు ఆందోళనలకు దిగారు. రాత్రంతా పెద్దలు చర్చలు జరిపారు. పీటల మీదే పెటాకులు కాకుండా పెళ్లి జరిపించారు.


రాజకీయ పట్టింపులు పంతాలు స్నేహితులు, కుటుంబాల మధ్య వివాదాలు రేపుతాయన్నది అందరికీ తెలుసు. అయితే అవి చివరికి పీటల మీద పెళ్లి కూడా ఆపేస్తాయని దానికి తాజాగా జరిగిన ఓ ఘటన నిదర్శనం. వియ్యంలో కయ్యం పెట్టిన ఆ కాంగ్రెస్‌ జెండా కథ ఏంటో.. ఓ సారి ఇది చదివితే మీకే అర్థం అవుతుంది.

గుంటూరు నగరానికి చెందిన ఓ యువ ఐపీఎస్‌ అధికారి ప్రస్తుతం గుజరాత్‌ కేడర్‌లో పని చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. మంగళవారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు స్కూల్‌ వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఈ వేడుకకు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేడర్‌ భారీగానే తరలి వచ్చింది. వారంతా పెళ్లి కుమారు ఇంటి నుంచి కాంగ్రెస్‌ జెండాలతో భారీ ఊరేగింపుగా కళ్యాణమండపం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వివాహ వేడుకలో పార్టీ జెండాలు వద్దంటూ వరుడి తపున బంధువులు వారించారు. పార్టీ జెండాలతో వెళ్లాల్సిందే అంటూ వధువు తరపున బందువులు ససేమిరా అన్నారు. దీంతో వరుడు ఐపీఎస్‌ అధికారి కావడంతో వివాహ వేడుకలో రాజకీయ పార్టీల జెండాలు సరికాదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వధువు తరపున బందువులు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అన్నారు.
దీంతో యువ ఐపీఎస్‌ అధికారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన మాట వినక పోవడంతో అసలు పెళ్లే చేసుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. దీంతో ఒక్క సారిగా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆ మాట విన్న పెళ్లి కుమార్తె తల్లికి తీవ్ర ఆందోళన పెరిగి చివరకు గుండె పోటుకు గురైంది. దీంతో తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ కేడర్‌ గుంటూరులోని యువ ఐపీఎస్‌ అధికారి నివాసం ముందు ఆందోళనకు దిగారు. పెళ్లి చేసుకోవలసిందే అని పట్టు బట్టారు. ఈ గందరగోళ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. వారితో పాటు వివాహానికి వచ్చిన సంఘ పెద్దలు, చర్చి పాస్టర్లు మంగళవారం రాత్రి 12 గంటల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు చర్చలు జరిపారు. ఏడు అడుగుల బంధం కోసం ఏడు గంటల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలతో ఉభయులు శాంతించి ఒక అంగీకారానికి రావడంతో కయ్యం కాస్తా.. వియ్యంగా సాగేందుకు మార్గం సుగమమైంది. మంగళవారం వద్దనుకున్న పెళ్లి బుధవారం అదే ముహూర్తానికి అదే వేదిక వద్ద జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. దీంతో యువ ఐపీఎస్‌ పెళ్లి కథ సుఖాంతం అయ్యింది. కాంగ్రెస్‌ జెండా పెట్టిన కయ్యం కాస్తా ఫన్నీగానే అనిపించినా.. ఆ దంపతులు ఆదర్శ జీవనం గడిపాలని మనమంతా ఆశీర్వదిద్దాం.
Next Story