ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందే, మునిసిపల్ ఎన్నికలే నిదర్శనమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.


రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడంలో టీడీపీ కూటమి, వైఎస్‌ఆర్‌సీపీలు దొందూ దొందే అని, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ నర్రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు నిధులు, విధులు, అధికారాలు బదిలీ చేయకుండా నిర్వీర్యం చేశాయని ద్వజమెత్తారు. అవి ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి.

అటువంటి వాటిల్లో పదవులను కైవసం చేసుకునేందుకు 2021లో వైఎస్‌ఆర్‌సీపీ అప్రజాస్వామికంగా, అనైతికంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడి 95 శాతంకు పైగా కైవసం చేసుకుంది. ఆనాడు కాంగ్రెస్, వామ పక్ష పార్టీలతో పాటు టీడీపీ కూటమి పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య ప్రియులందరూ వైఎస్‌ఆర్‌సీపీ చర్యలను ఖండించాని పేర్కొన్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు.. కూటమి ప్రభుత్వం అధికార దుర్వియోగం చేసి మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నించడం శోచనీయమని పేర్కొన్నారు.

నెల్లూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 54 మంది కార్పొరేటర్లకు గాను ఒక్క కార్పొరేటర్‌ కూడా టీడీపీకి లేనప్పటికీ, డిప్యూటీ మేయర్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకుందన్నారు. తిరుపతి కార్పొరేషన్‌లో 49 కార్పొరేటర్లకు గాను టీడీపీకి వుండేది ఒక్క కార్పొరేటర్‌ మాత్రమే. అక్కడ కూడా పోటీ పెట్టి కైవసం చేసుకోవాలని టీడీపీ కూటమి ప్రయత్నం చేయడం గర్హనీయమన్నారు.
ఇలాంటి గెలుపు బలం కాదు. వాపు మాత్రమే అని వైఎస్‌ఆర్‌సీపీ విషయంలో తేలిపోయింది. స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం తో 95 శాతం పైగా గెలిచినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడం జరిగిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి కూడా అదే గతి పడుతుందన్నారు. అప్రజాస్వామిక పార్టీలైన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ కూటమి పార్టీలను రాష్ట్ర పొలిమేరల నుండి తరిమి కొడితే తప్ప రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించ లేదన్నారు.
Next Story