‘అనంత’పై కాంగ్రెస్ పంజా!? మడకశిరలో త్రిముఖ పోటీ
x

‘అనంత’పై కాంగ్రెస్ పంజా!? మడకశిరలో త్రిముఖ పోటీ

రాజకీయ వనవాసం వీడిన కాంగ్రెస్ నాయకులు అస్త్రాలను సిద్ధం చేశారు. అనంతలో పాగా వేయాలని రంగంలోకి దిగారు. దీంతో మడకశిరలో త్రిముఖ పోటీ ఏర్పడింది.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఏపీసిసి అధ్యక్షురాలిగా వైఎస్. షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించాక జోష్ పెరిగింది. పదేళ్ల రాజకీయ వనవాసాన్ని వీడిన రాయలసీమ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యారు. పాతకోటల్లో పాగా వేయాలనే వారి లక్ష్యం కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కడప అర్బన్‌లో స్వల్పంగా, అనంతపురం జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు పాత అనుచరులను కూడగట్టిన నేపథ్యంలో

త్రిముఖ పోటీ ఏర్పడే స్థాయికి కాంగ్రెస్ పార్టీని తీసుకువచ్చారని భావిస్తున్నారు. ఒక స్థానంలో గెలిచిన ఆశ్చర్యం లేదనే వాతావరణం ఏర్పడినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థి మార్పు వల్ల టిడిపిలో వర్గపోరు కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఓటర్ల స్థితి..

మడకశిర అసెంబ్లీ స్థానంలో 1,04,534 మంది మహిళా ఓటర్లు, 1,06,948 పురుష ఓటర్లు ఉన్నారు. అర్బన్లో మహిళలు 8,657, పురుషులు 8,380 మంది, రూరల్ పరిధిలో ఓటర్లలో మహిళలు 23,171, పురుషులు 23,577 మంది ఉన్నారు. అమరాపురం మండలంలో మహిళలు 23, 361, పురుషులు 23,733 మంది, గుడిబండ మండలంలో మహిళా ఓటర్లు 21, 010, పురుషులు 21,628 మంది, రోళ్ళ మండలంలో 15,087 మంది మహిళలు, 16,003 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అగలి మండలంలో 13, 647 మహిళలు, 13,647 మహిళా ఓటర్లు ఉన్నారు.

వారిలో.. ఒక్కలిగలే కీలకం

మడకశిర నియోజకవర్గంలో ఎస్సీలు, బీసీ ఓటర్లే కీలకం. అందులో ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని కర్ణాటక ప్రభావం ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గం ఓటర్లు 48 వేల వరకు ఉన్నారు. దళితుల్లో మాదిగ సామాజిక వర్గం 35 వేలు, యాదవులు 23 వేలు, వాల్మీకి 25 వేలు, కురబలు 15వేలు, రెడ్డి సామాజికవర్గం రెండు వేలు, దొమ్మర్లు రెండు వేలు, ఎస్టీలు ఐదు వేలు, ముస్లిం మూడు వేల మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

వనవాసం నుంచి రణక్షేత్రానికి

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహిత సహచరుడైన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి రాజకీయ వనవాసం వీడినట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పాతరేశారు. కష్టకాలంలో కూడా పీసీసీ సారథ్య బాధ్యతలు రఘువీరారెడ్డి, ఆ తర్వాత సీనియర్ దళిత నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ నిర్వహించారు. ఏడాది కిందటి వరకు రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురంలో వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. "ఏఐసీసీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాహుల్ గాంధీ కోసం" అంటూ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. సాకే శైలజనాథ్ కూడా దాదాపు అదే పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులతో సంసిద్ధం కావడమే కాకుండా అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమిని ఢీకొట్టేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు.

మడకశిరలో ఢీ

అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దించారు. ఈయనకు దన్నుగా నిలిచిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి సర్వంతానేగా ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైనికుడిలా శ్రమిస్తున్నారు. అధికార వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా సర్పంచ్ అంతకుముందు ఉపాధికూలీ ఈర లక్కప్పను పోటీ చేయిస్తోంది. ఈయనకు రాష్ట్రస్థాయిలో కీలక పదవి నిర్వహిస్తున్న జెడ్పిటిసి మాజీ సభ్యుడు నర్సయ్య (ఎన్నికల టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త) అండగా ఉన్నారు. ప్రతిపక్ష టిడిపి కూటమి అభ్యర్థిని మార్చి ఎమ్మెస్ రాజును తెరమీదికి తీసుకురావడం ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఇక్కడి వర్గపోరు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీకి ఉపశమనం కలిగించే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు

2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఇందులో యాదవులు, దళితులు ప్రధానంగా అత్యధిక సంఖ్యలో ఉన్న కున్సెట్టీ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిన స్థితిలో రఘువీరారెడ్డి పోటీకి దిగలేదు. దీంతో ఆ ఓటు బ్యాంకు 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతికి లాభం కలిగించింది. ఈ ఎన్నికల ఏడాది ప్రారంభానికి ముందే రఘువీరారెడ్డి యాక్టివ్ అయ్యారు. సున్నిత మనస్కుడు నిష్కలంక చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను అభ్యర్థిగా తెరమీదకి తీసుకువచ్చారు.

ఆ గురువు చకువతో...

మడకశిర అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వుడు స్థానం కాకముందు మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అక్కడి ఓటర్లతో విడదీయలేని అనుబంధం ఏర్పరచుకున్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉంటుంది. మిగతా భాషలతోపాటు కన్నడలో కూడా రఘువీరారెడ్డి స్వచ్ఛంగా మాట్లాడగలరు. నియోజకవర్గంలో కీలకపాత్ర పోషించే కున్సెట్టీ ఒక్కలిగ సామాజిక వర్గం గురువు పత్నయక్ నల్లి నందావు దూత స్వామీజీ కర్ణాటక రాష్ట్రం సిర తాలూకాలో ఉంటారు. రఘువీరారెడ్డి కూడా ఆయన శిష్యుడే.

దీంతో రఘువీరారెడ్డికి తిరుగుండేది కాదని చెబుతారు. రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయిన రఘువీరారెడ్డి పాత సమీకరణలతో సర్వసన్నద్ధం అయినట్లు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ కోసం మళ్లీ వ్యూహాలకు పదును పెట్టారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం రాక

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులతో రఘువీరారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. వక్కలిగ ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను మడకశిర నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

టిడిపిలో చిచ్చు.. వైసీపీలో సామాన్యుడు

అసెంబ్లీ సెగ్మెంట్లో మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సునీల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన ప్రచారంలో ఉండగానే, ఆ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణలోని అజ్ఞాత నేత ప్రమేయంతో ఆయన స్థానంలో ఎమ్మెస్ రాజును తెరపై తీసుకొచ్చారు. దీంతో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదే పరిస్థితిలో అధికార వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేస్తున్న ఈర లకప్ప అత్యంత సామాన్యుడు. ఆ పార్టీ పెద్దల పైనే పూర్తిగా ఆయన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అది కూడా రఘువీరారెడ్డి లేకపోవడం వల్లనే సుమారు 20వేల మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలవడానికి ఆస్కారం ఏర్పడిందని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో రఘువీరుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తీసుకురావడం వల్ల వైఎస్ఆర్ సీపీ ఓట్లకు భారీ గండి పడే ప్రమాదం లేకపోలేదని పరిస్థితిలో సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొద్ది రోజుల్లో జరగనున్న పోలింగ్ ఎలాంటి ఫలితం అందిస్తుంది అనేది వేచి వేచి చూడాలి.

Read More
Next Story