కమ్యూనిస్టులతో షర్మిల చర్చలు సక్సెస్

సీపీఐ, సీపీఎం పార్టీలతో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం చర్చలు సఫలం. అనంతపురం సభకు రానున్న కామ్రేడ్స్.


కమ్యూనిస్టులతో షర్మిల చర్చలు సక్సెస్
x
YS Sharmila, cpi Ramakrishna, cpm Srinivasarao

ఇండియా కూటమితోనే కమ్యూనిస్టులు

ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం
అనంతపురం సభకు కమ్యూనిస్టులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం సీపీఐ, సీపీఎం నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో సమావేశమయ్యారు. కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయంలో ఇంకా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోలేదు.
దేశంలో అధికార బీజేపీని, రాష్ట్రంలో బీజేపీకి సహకరిస్తున్న అధికార వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జనసేనలను ఓడించడమే లక్ష్యంగా చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితరులు, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర నాయకులు నాగేశ్వరావు, అక్కినేని వనజ, జల్లి విల్సన్, సీపీఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్, వెంకటేశ్వరావులు హాజరయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న కమ్యూనిస్టులు, షర్మిలతో కలిసి టిఫిన్‌ చేశారు. అనంతరం చర్చలు కొనసాగించారు.

కలిసి ఉద్యమాలు
ఇక నుంచి రాష్ట్రంలో జరిగే ఉద్యమాల్లో కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టులు కూడా పాలుపంచుకోనున్నారు. వైఎస్‌ షర్మిలతో కలిసి ఉద్యమాలు చేయాలనే నిర్ణయానికి కమ్యూనిస్టులు వచ్చారు. బలమైన శక్తిగా, నియంతగా మారిన వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనాలంటే కలసి ఉద్యమాలు చేయడం అవసరమని వారి చర్చల్లో ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడాన్ని మూడు పార్టీల వారు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరంపై చర్చ సాగింది. సాధారణ ప్రజలకు అప్పుల గురించి అవసరం లేదని, పాలకులు అప్పులు ఇష్టానుసారం చేస్తే వచ్చే పర్యావసానాలు ఆలోచించకుండా తిరిగి అప్పులు చేస్తూనే ఉండటం రాష్ట్రానికి ఎలాంటి ముప్పును తెస్తుందో ప్రజలకు వివరించాలనే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ వల్ల భారత రాజ్యాంగానికి ముప్పు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడంలో ముందుండాలనే అంశాన్ని కూడా చర్చల్లోకి తీసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం చేయాల్సిన ఉద్యమాలపై కూడా చర్చ సాగింది.
అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే సభకు సీపీఐ, సీపీఎం నాయకులను షర్మిల ఈ సందర్బంగా ఆహ్వానించారు.
త్వరలోనే పొత్తులపై క్లారిటీ
పొత్తులపై అన్ని అంశాలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల చెప్పారు. కలిసి పోరాడే అంశాలపై చర్చించినట్లు చెప్పారు. రామభక్తులమని చెప్పుకుంటే సరిపోదు, మోదీ తిరుపతిలో హోదాపై ఇచ్చిన హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నాకు దగ్గర మనిషి, ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఆయనపై ఉన్న వత్తిడి అంతా ఇంతా కాదు, అందుకే అటువైపు వెళ్లారని, ఒక మంచి పర్సన్‌ ఒక రాంగ్‌ప్లేస్‌లో ఉన్నారని షర్మిల అన్నారు.
రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేసిన కూటమి
వైసీపీ, టీడీపీ, బీజేపీ కూటమి రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేసింది. రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. బీజేపీపై దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లుదండాలు పెడుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటాం. బీజేపీ కూటమిని ఓడగొడతామని సీపీఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు చెప్పారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం బీజేపీ వద్ద వైసీపీ, టీడీపీ తాకట్టుపెట్టాయి. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. అప్పులపాలైంది. ప్రజలు బిక్షగాళ్లుగా మారారు. జగన్, బాబు మోదీకి దాసోహమంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు.
Next Story