అనంత కాంగ్రెస్ సభలో.. తిరుపతి రాజధాని నినాదం..
x

అనంత కాంగ్రెస్ సభలో.. తిరుపతి రాజధాని నినాదం..

త్యాగాలకు ఇక సిద్ధంగా లేము, తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేయాల్సిందేనని చిత్తూరు అనంతపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు సభలో డిమాండ్ చేశారు. అందరిని విస్మయపరిచారు



(ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్, తిరుపతి నుంచి)


"తిరుపతి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలి" అనే నినాదం ప్రతిధ్వనించింది. ఈ నినాదం కోస్తా ఉత్తర తెలంగాణ ప్రాంత నాయకులను దిమ్మెర పోయేలా చేసింది. నిధులు. నీళ్లు, నియామకాలు ప్రధాన అంశంగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా అందిపుచ్చుకున్నారా?

అనంతపురం పట్టణంలో లో సోమవారం సాయంత్రం "న్యాయ సాధన సభ" పేరుతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తొలి ప్రచార సభ నిర్వహించింది. ఇక్కడ రాజధాని మాట ప్రతిధ్వనించడం విశేషం. తిరుపతి రాజధాని నినాదం ప్రతిధ్వనించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభావంతోనే ఉంది. దీనిని ఎపుడూ వివాదం చేసినట్లు లేదు. అదే విధంగా కోర్టులు కూడా అమరావతినే రాజధానిగా గుర్తించాయి. కాకపోతే, ఈ రాజధానిని ఏదో విధంగా అమరావతిని విశాఖకు తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటపుడు డా.చింతా మోహన్ తిరుపతి రాజధాని కావాలి అనే వాదన తీసుకువచ్చారు.గత కొద్ది రోజులు ఆయన ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో చెబుతూ వస్తున్నారు. అయితే, ఇపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే సమక్షంలో ఆయన ప్రస్తావన తీసుకురావడం గమనించాలి.

ఇందిరమ్మ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉందా

ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ. ఆమె ఫోటో కటౌట్ లేకుండా అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించడం ఏంటి డాక్టర్ చింతా మోహన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారికి తన చిన్న విన్నపం అంటూ ప్రారంభించిన ఆయన ఇందిరా గాంధీ ఫోటో లేకపోవడంపై మండిపడ్డారు. దీంతో వేదికపై ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నివ్వెరపోయారు. రాళ్లూరప్పలతో నిండిన రాయలసీమను ఆదుకోవడానికి తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. పీసీసీ కూడా ఈ విషయం గురించి ఆలోచన చేయాలని ఆయన సూచన చేశారు. సర్కారు ప్రాంతానికి రాజధాని వెళ్లేందుకు ఏ మాత్రం అంగీకరించబోమని ఆయన తెగేసి చెప్పారు.

నీలం సంజీవరెడ్డితో నష్టం..

"తిరుపతిని రాజధానిగా చేయాలనే ఒక నాటి కాంగ్రెస్ నేత ఎన్జీ రంగా సూచించారు. కాని మరొక సీనియర్ నేత నీలం సంజీవరెడ్డి హైజాక్ చేశారని" అని అనంతపురం గడ్డపైనే నినదించారు. ఇక రాయలసీమకు అన్యాయం జరగడం ఎంత మాత్రం సహించమని ఆయన స్పష్టం చేశారు. అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ను ఏమార్చి నీలం సంజీవరెడ్డి కర్నూలుకు రాజధాని తీసుకుపోయారని, అక్కడినుంచి హైదరాబాద్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతికి తరలించి రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని అన్నారు.

సీఎం వైయస్ జగన్ తోనూ...

చివరికి రాయలసీమ నుంచి సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మళ్లీ మోసం చేసేందుకు తెగబడ్డారని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. వేదిక పైనే ఉన్న పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, కే. రాజు పల్లంరాజు వంటి నాయకులు అందరూ ఈ మాటకు దిక్కులు చూస్తూ ఉండిపోయారు.

ఇది ఆలోచన చేయాల్సిన అంశమే..

మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ లేవనెత్తిన అంశాలంపై "ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది" అని పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ కూడా వంత పాడారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా హాజరైన అశేష ప్రజానీకం హర్షధ్వానాల మధ్య ఆయన మాటలను స్వాగతిస్తుంటే వేదికపై ఉన్న పీసీసీ నాయకులు, రాష్ట్ర, కేంద్ర మాజీ మంత్రులు నివ్వెర పోయారు.

" రాష్ట్ర ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. నీళ్లు వదులుకున్నాం" రాష్ట్ర అభ్యున్నతిని కాంక్షిస్తూ రాజధాని కోల్పోయాం" ఈ పరిస్థితుల్లో తాము త్యాగాలకు ఏమాత్రం సిద్ధంగా లేమని ఈ కార్యక్రమానికి మెంటార్ గా వ్యవహరించిన సాకే శైలజానాథ్ తెగేసి చెప్పారు.

" రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిలిచిన సిపిఐ నుంచి ప్రాథమిక వహించిన కే రామకృష్ణ, తటస్థంగా వ్యవహరించిన సిపిఎం పార్టీ ప్రతినిధిగా వై శ్రీనివాసరావు కూడా ఇదే వేదికపై ఉన్నారు. రాయలసీమ ప్రత్యేక అంశంపై వారు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

డాక్టర్ చింతా మోహన్ లెవనెత్తని తిరుపతి రాజధాని ఒక ఆటవిడుపుగా ముగుస్తుందా లేక వివాదమవుతుందో వేచి చూడాలి.


Read More
Next Story