Uttar Pradesh| యూపీలో శ్రీవారి ఆలయం
ఉత్తరాది భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం లభించనుంది. ఆ రాష్ట్రంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయనున్నారు.
శ్రీవారి దర్శనానికి యాత్రికులు తిరుమలకు వస్తుంటారు. నూతన సంవత్సరం 2025 జనవరిలో ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనే స్వామి వారి ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు టీటీడీ అధికారులు శనివారం అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. హిందూ ధర్మప్రచారం కోసం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి టీటీడీ అధికారులు పరిశీలించారు. టీటీడీ జేఈఓ గౌతమి అక్కడి అధికారులతో కలిసి, స్థలం పరిశీలించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కుంభమేళా జరగనుంది. దీంతో ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో టీటీడీ జేఈఓ (ఆరోగ్యం, విద్య) గౌతమి ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా అధికారి, ఐఏఎస్ విజయకిరణ్ ఆనంద్ తో ఆమె చర్చించారు. ప్రయాగరాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి ఆరో సెక్టార్ లో 2.50 ఎకరాలు కేటాయించారు.
కుంభమేళా కోసం తాత్కాలిక ఆలయం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ జేఈఓ గౌతమి తెలిపారు. "ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగం కానున్నది" అని ఆమె వెల్లడించారు.