DSC

డిఎస్సీ నోటిఫికేషన్‌ వివాదాల్లో చిక్కుకుంది. నిరుద్యోగులు కోర్టుకు ఎక్కాల్సిన దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. తప్పులు సరిదిద్దుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.


జి. విజయ కుమార్

నిరుద్యోగులను నాలుగేళ్లుగా ఊరిస్తూ ఐదో ఏట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేసిన డిఎస్సీ 2024ను వివాదాలు చుట్టుముట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనాలోచితంగా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.
కోర్టుకెక్కిన నిరుద్యోగులు
సిఎం జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌లో నిబంధనలు విరుద్ధంగా ఉండటంతో మూడు అంశాలపై అభ్యర్థులు కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి నెలకొంది. ఈ మూడు అంశాలు సహేతుకంగా ఉండటంతో పిటీషనర్లుకు అనుకూలంగా కోర్టు తీర్పులు వెలువరించింది. బిఇడి అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు అనుమతులిచ్చారు. దీనిపై హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్‌ దాఖలు చేశారు.∙విచారణ చేపటిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఎస్‌జీటీ పోస్టులకు బిఇడి అభ్యర్థులు అర్హులు కాదని తేల్చింది. గిరిజన గురుకుల పాఠశాలల్లో పోస్టులకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు. 517 పోస్టులు జనరల్‌ కేటగిరీ కింద కాకుండా గిరిజనులకే కేటాయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెట్, ఉపాధ్యాయుల నియామక పరీక్షకు మధ్య తగిన సమయం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌సై స్పందించిన కోర్టు నాలుగు వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరీక్షలు వాయిదా.. కొత్త షెడ్యూల్‌
హైకోర్టు మొటికాయలు వేయడంతో పరీక్షలు వాయిదా వేయక తప్ప లేదు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉపాధ్యాయుల నియామకాల పరీక్షలు నిర్వహించే విధంగా రీషెడ్యూల్‌ చేశారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి)పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్‌ ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకు స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజీటి, ఫిజికల్‌ డైరెక్టర్, ప్రిన్సిపాల్‌ పరీక్షలు ఉంటాయి. పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు సెంటర్లు ఎంచుకునేందుకు మార్చి 20న వెబ్‌ ఆప్షన్‌ ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ మేరకు మార్చిన కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం శనివారం రాత్రి ప్రకటించింది.
కుంటి సాకులు
టెట్‌కు ఉపాధ్యాయ నియామక పరీక్షలకు కనీసం నాలుగు వారాలు సమయం ఉండే విధంగా పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిని ఖచ్చితంగా ప్రభుత్వం పాటించి తీరాలి. అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ మార్చాలి. కానీ ప్రభుత్వం విద్యార్థులకు సాధారణ పరీక్షల సెంటర్లు పేరుతో కుంటి సాకులు చెబుతోంది. ఏప్రిల్‌ మాసంలో ఐఐటి, జేఈఈ వంటి పరీక్షలు ఉండటం వల్ల డిఎస్సీ పరీక్షల నిర్వహణకు పరీక్ష కేంద్రాల సమస్య తలెత్తే అవకాశం ఉందని, దీంతో మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉపాధ్యాయ నియామక డిఎస్సీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రభుత్వం తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 15 నుంచి ఉపాధ్యాయ నియామక డిఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
Next Story