ధర్మవరం.. గరం, గరం!  పరిటాల శ్రీరామ్ వర్సెస్ వరదాపురం సూరి
x
paritala v/s varadapuram suri

ధర్మవరం.. గరం, గరం! పరిటాల శ్రీరామ్ వర్సెస్ వరదాపురం సూరి

పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ కి చెమటలు పట్టిస్తున్నారు వరదాపురం సూరి. చంద్రబాబు నిర్ణయం కోసం శ్రీరామ్ ఎదురుచూస్తుంటే పార్టీ ఏదైనా టికెట్ నాదే అంటున్నారు సూరి..


ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సీటు ఎవరికొస్తుందో తెలియక కొందరు తికమకపడుతుంటే ఎవురొచ్చినా సీటు గెలుపు నాదే అంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. 2.5 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంపై ఒకప్పపుడు టీడీపీకి ఉన్న పట్టు ప్రస్తుతం సడలింది. 1951లో ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ గెలిచింది. ఒకసారి కమ్యూనిస్టులు, ఇప్పుడు వైసీపీ గెలిచింది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం మధ్యలో దూరిన బీజేపీ క్యాండిటేట్ నేనే చక్రం తిప్పుతానంటున్నారు.

ఇంతకీ కథేంట్రాంటే...

పార్టీ ఏదైనా సరే పోటీ చేసేది నేనే అంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. లీడర్ ఉండగా క్యాడర్‌ ది ఏముందంటున్నారు. టికెట్‌ తెచ్చుకునే ట్రిక్‌ తనకు తెలుసంటూ అందర్నీ తికమక పెడుతున్నారు. ఆయన పేరే గోనుగుంట్ల సూర్యనారాయణ ఎలియాస్ వరదాపురం సూరి. బీజేపీలో ఉంటూ టీడీపీ టికెట్ కోసం వేటాడుతున్నారు. పరిటాల రవికి చెమటలు పట్టిస్తున్నారు. రాయలసీమలో పొలిటికల్‌ హీట్‌పుట్టిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోని తాజా రాజకీయం ఆసక్తికరంగా మారింది.

గుడ్మార్నింగ్ ధర్మవరం...

రాయలసీమలోని కీలక నియోజకవర్గం. గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం అంటూ అక్కడి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన కార్యక్రమం సూపర్‌ హిట్‌ అయింది. దీంతో ధర్మవరానికి మరింత గుర్తింపు వచ్చింది. ఐతే ధర్మవరం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 9 ఎన్నికల్లో 7 సార్లు పసుపు జెండా రెపరెపలాడింది. టీడీపీ ఓడిన రెండుసార్లు ఇక్కడ గెలిచింది ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రమే.. 2009 నుంచి ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. 2009, 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి గెలిస్తే.. మధ్యలో 2014లో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గెలిచారు. గత మూడు దఫాలుగా ఈ ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతోంది.

వైసీపీ టికెట్ కేతిరెడ్డికే..

వచ్చే ఎన్నికల్లోనూ ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేతిరెడ్డిని ఢీకొట్టాలంటే.. నియోజకవర్గంలో పునాదిబలం గట్టిగా ఉన్న టీడీపీకే సాధ్యం అన్నది ఓపెన్‌ సీక్రెట్‌.. కేతిరెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమవగా, ఆయన ప్రత్యర్థి ఎవరన్నదే సస్పెన్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల మళ్లీ పోటీకి సై అంటున్నా.. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిన గోనుగుంట్ల సూర్యనారాయణ.. కొద్దిరోజుల నుంచి టీడీపీ తరఫున పోటీకి రెడీ అంటున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.. చంద్రబాబు అరెస్టు నుంచి ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఐతే గత ఎన్నికల్లో ఓడిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోకుండా వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే తీరును స్థానిక క్యాడర్‌ నిరసిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ టికెట్‌ ప్రస్తుత ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా తమకు అన్నివిధాల అండదండలు అందించిన శ్రీరామ్‌ను వదులుకునే పరిస్థితి లేదంటున్నారు కార్యకర్తలు.

బీజేపీ కాకుంటే టీడీపీ...

కార్యకర్తలు వద్దని ముక్తకంఠంతో వాదిస్తున్నా... టీడీపీ కాకపోతే బీజేపీ ఉందంటూ కొత్తపల్లవి అందుకున్నారు గోనుగుంట్ల.. ఇరుపార్టీల మధ్య పొత్తు చిగురిస్తుండటంతో నా సీటు సేఫ్‌ అంటూ గోనుగుంట్ల ప్రచారం చేసుకుంటుండటంతో ధర్మవరం టీడీపీలో వేడిపుట్టిస్తోంది. కుదిరితే టీడీపీ.. లేదంటే బీజేపీ.. ఏదైనా నా దారి రహదారి.. నా రూటు సెపరేట్‌ అంటూ గోనుగుంట్ల రాజకీయం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ కార్యకర్తలు.. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే పొత్తుల్లో భాగంగా ధర్మవరం టికెట్‌ తమకు కేటాయించాలని జనసేన కోరుతుందనే టాక్‌ కాకరేపుతోంది.

పక్కలో బల్లెంలా జనసేన...

పక్కలో బల్లెంలా ఒకవైపు బీజేపీ.. మరోవైపు జనసేన నేతలు తయారవడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యే కేతిరెడ్డిని దీటుగా ఎదుర్కొన్న టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. టీడీపీలోకి వస్తామంటున్న బీజేపీ నేత గోనుగుంట్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన శ్రీరామ్‌.. ఇప్పుడు పొత్తు రూపంలో తన సీటుకు ఎర్త్‌ పడేలా కనిపిస్తుండటంతో టెన్షన్‌ పడుతున్నారు. ఇదేసమయంలో పరిటాల కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడంపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ఇన్నాళ్లు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా తయారైందని మదనపడుతున్నారు పరిటాల అభిమానులు. మొత్తానికి ధర్మవరం టీడీపీ రాజకీయం గరంగరంగా మారింది. గోనుగుంట్ల సూర్యనారాయణ వర్సెస్‌ పరిటాల శ్రీరామ్‌లా మారిన రాజకీయం ఎటు తిరుగుతుందో? అనే ఉత్కంఠ కనిపిస్తోంది. చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఒకే కుటుంబంలో రెండు సీట్లు ఇస్తారా అనేదీ చర్చనీయాంశమైంది.

Read More
Next Story