నెల్లూరు నేతలకు దడ పుట్టిస్తున్న ఈ లేడీడాన్ ఎవరు?
x

నెల్లూరు నేతలకు దడ పుట్టిస్తున్న ఈ లేడీడాన్ ఎవరు?

అద్దంకి టోల్ గేట్ వద్ద ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు?


నెల్లూరు 'లేడీ డాన్' గా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను (Aruna)ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్‌లో ఇది మరో కీలక పరిణామం. శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీడాన్‌గా పేరుగడించిన నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్ ప్లాజా దగ్గర మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తనను అరెస్టు చేస్తారనే విషయాన్ని గమనించిన అరుణ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు దార్లోనే అరెస్టు చేశారు. తనపై ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. తనపై గంజాయి కేసు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, కోవూరులో ప్లాట్ యాజమానిని బెదిరించిన కేసులో అరుణను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 20 అంటే ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇదిలా ఉంటే, నాలుగు రోజుల క్రితం సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారని ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు మరో వదంతి కూడా ప్రచారంలో ఉంది.
గత ప్రభుత్వంలో రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు, సెటిల్‌మెంట్లు చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చారు. శ్రీకాంత్‌తో ఆమె సాన్నిహిత్యంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అరుణ పూర్తి వ్యవహారంపై పోలీసులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.
తన అరెస్ట్‌కు ముందు.. ఆమె కారు డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీసి అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. తనను మీడియానే కాపాడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్‌కు ప్రభుత్వం ఇటీవల పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకి పొక్కడంతో పెరోల్ రద్దు చేశారు. అయితే, శ్రీకాంత్‌ పెరోల్ మంజూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోం శాఖ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు.
అరుణ సంచలన వ్యాఖ్యలు..
అంతకుముందు నిడిగుంట అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అని తెలిపారు.
జీవిత ఖైదీ శ్రీకాంత్‌తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ..‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్‌ బాధపడుతుంటే శ్రీకాంత్‌ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్‌ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్‌ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్‌ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్‌ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
ఇంతకీ ఎవరీ లేడీ డాన్ అరుణ...
నిడిగుంట అరుణ స్వస్థలం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. వయసు 31 ఏళ్లు. తండ్రి నిడిగుంట నరసింహులు. కొవ్వూరు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను నడిపినట్టు రికార్డులు ఉన్నాయి. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం ఈమె చీరలు, నగల వ్యాపారం చేసినట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈమెకు చదవు లేదు. నిరక్షరాస్యురాలు. ఆమె జీవితభాగస్వామి దినసరి కూలీ అని అందులో ఉంది. ఆమెపై రెండు పెటీ కేసులు కూడా ఉన్నాయి.
జీవిత ఖైదీ శ్రీకాంత్ కి ఈమె ప్రేమికురాలు. ఆమెకు 2002 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. అది జైళ్లలోని ఖైదీల కోసం పని చేస్తుంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్, అరుణ మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు. ఈమె గత ఎన్నికల్లో సూళ్లూరుపేట నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్‌లకు అనుబంధంగా ఉన్న కౌన్సిలింగ్‌ కమిటీలో ఈమె సభ్యురాలు. ఆనాటి ఎస్పీ సిఫార్సుతో ఆమెను సభ్యురాలిగా నియమించారు. ఆ ఎస్పీ ఉన్నంతకాలం అరుణ హవా కూడా బాగానే సాగింది. పోలీసు యంత్రాంగమంతా ఆమె కనుసన్నల్లో ఉండేది. దాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిందని, వలపు వలతో పలువురు అధికారులను ఆమె తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఇప్పుడు ఈమె పలుకుబడి, డబ్బు ఉపయోగించి తన భర్త అని చెబుతున్న శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించినట్టు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 12 లక్షల రూపాయల డబ్బును ఖర్చు చేసినట్టు ఆమె స్వయంగా చెప్పారు.
Read More
Next Story