ICA GLOBAL|భారతీయ సంస్కృతిలో సహకార ఉద్యమం భాగమన్న మోదీ
x
Bhutan PM Dasho Shering is lighting the lamp at ICA global conference at New Delhi on 25th November 2024. PM Narendra Modi and others also seen in the picture Photo Curtesy- AKBAR PASHA, EDITOR, SAHAKARABHOOMI

ICA GLOBAL|భారతీయ సంస్కృతిలో సహకార ఉద్యమం భాగమన్న మోదీ

భారత్ అంటే పాడి సమృద్ధే కాదు, విశ్వాసం కూడా. రాబోయే రోజుల్లో ప్రపంచ సహకార ఉద్యమానికి భారత్ మార్గదర్శి అన్నారు ప్రధాని మోదీ.


(న్యూ ఢిల్లీ నుంచి అక్బర్ పాషా)
భారతీయ ఆర్ధిక వ్యవస్థలో సహకార ఉద్యమం భాగమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారతీయ సంస్కృతితో మిళితమైన సహకార రంగాన్ని విశ్వవ్యాపం చేసేందుకు తమ ప్రభుత్వం నడుంకట్టిందని చెప్పారు. సర్కులర్ ఆర్థిక వ్యవస్థ సూత్రాలతో సహకార ఉద్యమాన్ని పటిష్టపరచడం, దాని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం తమ ప్రాధాన్యత అని మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ICA గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్- 2024లో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. భారతదేశంలో సహకార సంఘాలు సంస్కృతిలో బాగా లోతుగా పాతుకుపోయాయని, తమ జీవనవిధానంలోనే సహకారం ఉందని గత చరిత్రను ప్రస్తావించారు. తొలి భారతీయ సైనికుల తిరుగుబాటు మొదలు నిన్న మొన్నటి ఇఫ్కో, క్రిబ్కో, అమూల్ వరకు అనేక విజయాలను ప్రస్తావించారు.
భారతదేశ భవిష్యత్తు అభివృద్ధి పథంలో సహకార సంఘాల కీలక పాత్రను పోషిస్తున్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్దంలో సహకార పర్యావరణ వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి గణనీయమైన సంస్కరణలు అమలు చేసినట్టు వివరించారు.

"సహకార సంఘాలను బహుళార్ధ సాధకాలుగా చేయడమే మా ప్రయత్నం" అని మోదీ అన్నారు. ఈ దృక్పథానికి నిదర్శనంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడాన్ని ఆయన గుర్తుచేశారు.
హౌసింగ్, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో సహకార సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 2 లక్షల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయని, లక్ష్య సాధన దిశగా పని చేస్తున్నాయని చెప్పారు. సహకార రంగంలోనూ సంస్కరణలు చేపట్టి సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం సహకార బ్యాంకులు 12 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను కలిగి ఉన్నాయని వివరించారు.
“ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. అధిక GDP వృద్ధిని సాధించడం, దాని ప్రయోజనాలను పేదలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. మానవతా దృక్పదం నుంచి ప్రపంచం వృద్ధిని చూడటం అవసరం అన్నారు మోదీ.
వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు (circular economy) అనుసంధానం చేయడం ద్వారా సహకార సంఘాలను మరింత ప్రజానుకూల విధానంగా మార్చడానికి వ్యూహాలను రచిస్తున్నట్టు తెలిపారు.
సహకార రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి మార్గాలను అన్వేషించడాన్ని మోదీ ప్రశంసించారు. భవిష్యత్తులో ఇది కీలక వృద్ధి ప్రాంతంగా గుర్తించారు.
గ్రామాలలో అదనంగా 2 లక్షల మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలను స్థాపించే యోచనతో పాటు సహకార ఫ్రేమ్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి ప్రకటించారు.
సహకార ఉద్యమంలో మహిళల పాత్ర మరువలేనిదన్నారు. భారతదేశంలోని సహకార సభ్యులలో 60 శాతం మంది మహిళలు ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడంలో మహిళల పాత్ర మరువలేనిదని కొనియాడారు.
భారతదేశం పాడి ఉత్పత్తిరంగంలో గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ మా ఉత్పత్తి పాలు కాదు విశ్వాసం అన్నారు మోదీ. రైతు సహకార సంస్థలను, ఎఫ్.పీ.వో.లను ప్రోత్సహించి మార్కెట్లను క్రియేట్ చేయనున్నట్టు వివరించారు.

భారతదేశం ప్రపంచానికే సహకార మార్గదర్శి అని చెప్పారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో భారత్ నమూనాను సమగ్రాభివృద్ధికి సూచికగా అభివర్ణించారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లోని దేశాలకు భారత్ మార్గదర్శకత్వం వహిస్తుందన్నారు. "సహకారత్వం ప్రపంచ సహకారానికి కొత్త శక్తిని అందించగలదు. ప్రపంచ దేశాలకు అవసరమైన వృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది" అని మోదీ పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం సాధించాలంటే సహకార ఉద్యమమే ప్రధానం అన్నారు మోదీ.
మా బడే భాయ్ మోదీ- భూటాన్ ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భూటాన్ ప్రధానమంత్రి దాషో తమ బడే భాయ్ గా పలుమార్లు సంబోధించారు. ప్రసంగం ప్రారంభంలోనూ ఆ తర్వాత పలుమార్లు ప్రధాని మోదీని బడే భాయ్ గా పిలిచారు. దాంతో ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో భూటాన్ ప్రధానిని ఛోటేభాయ్ గా సంబోధించారు. దీంతో సభాప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది.
హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దేశంలో సహకార విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. సహకారుల్లో సహకారం తమ విధానమన్నారు.
సహకార ఉద్యమంపై పోస్టల్ స్టాంప్..
సహకార ఉద్యమానికి గుర్తింపుగా భారత్ తొలిసారి పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు.భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా ఈ పోస్టల్ స్టాంపును తీసుకువచ్చారు. ఈ స్టాంప్ కమలాన్ని పోలి ఉంది. శాంతి, బలం, స్థితిస్థాపకత, అభివృద్ధిని సూచిస్తుంది. తామరపువ్వులోని ఐదు రేకులు ప్రకృతిలోని ఐదు అంశాలను (పంచతత్వ) సూచిస్తాయి. పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థిరత్వం పట్ల సహకార సంఘాల నిబద్ధతను హైలైట్ చేస్తాయి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత పాత్రను సూచించే డ్రోన్‌తో వ్యవసాయం, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, వినియోగదారుల సహకార సంఘాలు, గృహనిర్మాణం వంటి రంగాలను కూడా డిజైన్‌లో పొందుపరిచారు.
అంతర్జాతీయ మహాసభ ప్రారంభ కార్యక్రమంలో భారత్ లోని ఐక్యరాజ్యసమితీ ప్రతినిధి షోంబీ షార్ప్, భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి మనోవా కమికామికా, అంతర్జాతీయ సహకార కూటమి అధ్యక్షుడు ఏరియల్ గార్కో, సుమారు వంద దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15వందల మంది ప్రతినిధులు ఈ 5 రోజుల సదస్సుకు హాజరయ్యారు.
Read More
Next Story