చంద్రబాబు మోదీకి దోస్త్... మోదీకి అదానీ దోస్త్... గత ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు రద్దు చేస్తారా.. విచారణ పేరుతో సాగదీస్తారా...


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి. ఏకంగా రూ. 1,750 కోట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లంచాల రూపంలో అదానీ ద్వారా తీసుకున్నారనేది ఆరోపణ. సౌర విద్యుత్ ఒప్పందాల్లో ఈ లంచావతారాలు తారాస్థాయికి చేరినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ తేల్చింది. అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్బిఐ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న సౌర విద్యుత్ ఒప్పందంలో లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది. దీనిపై పౌర సంస్థలు, కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల తన సోదరుడైన వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల సంపదను ఒక వ్యక్తికి దోచి పెట్టడమే కాకుండా అతని వద్ద నుంచి వేల కోట్లు లంచాలు తీసుకున్నందుకు ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అగ్రరాజ్యం బయట పెట్టేదాకా అదానీ జగన్ లంచాల గురించి తెలియలేదు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ శాఖలు ఏమి చేస్తున్నట్లు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ అవినీతి గురించి చర్చ జరుగుతోంది. ఇది దేశానికి అవమానం. అదానీ దేశం పరువు తీస్తే... జగన్ రాష్ట్రం పరువు తీశారని షర్మిల అన్నారు. ఏపీలో అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటిపై విచారణ జరగాలి. అదానీ గ్రూప్ ను ఏపీలో బ్లాక్ లిస్ట్ లో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఒప్పందం ఏమిటి?

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 7వేల మెగా వాట్ల సౌర విద్యుత్ ను తీసుకోవడం కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకి) తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సెకీ యూనిట్ విద్యుత్ ధర రూ. 2.49 లుగా ఉంది. అయితే ఇతర రాష్ట్రాలలోని ప్లాంట్ల నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల యూనిట్ కు రూ. 3.24లు అదనంగా ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండూ కలిపితే రూ. 5.73లు యూనిట్ కొనుగోలు ఖర్చు అవుతుంది. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం వల్ల ఏపీ ప్రజలపై విద్యుత్ భారం పెరుగుతుంది. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమవుతుంది. ఇటువంటి పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా పర్సెంటేజీలకు కక్కుర్తి పడి రాష్ట్ర సంపదను అదానీకి తాకట్టు పెట్టినట్లు పౌర సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు అక్కడి కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో సెకి ఒప్పందం వెనుక ముడుపుల బాగోతం ఉందని బయట పెట్టింది. ఏపీ ప్రభుత్వంతో సెకి 30 ఏళ్లపాటు విద్యుత్ అందించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ముసుగులో జరిగిన అవినీతి వ్యవహారాన్ని బయట పెట్టేందుకు ఏపీలో అధికార పక్ష కూటమి కిమ్మనటం లేదు. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బిజెపి నాయకులు కానీ మాట్లాడటం లేదు. జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో అవినీతిలో కూరుకు పోయిందని ఒక్కో విభాగంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని నిత్యం చెబుతున్న సర్కార్ అదానీ ముడుపుల బాగోతంపై మాట్లాడటం లేదు. కూటమి ప్రభుత్వం జగన్ అవినీతిని బయట పెట్టేలోపు అమెరికా దర్యాప్తు సంస్థ వేల కోట్లు లంచం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిపై వెంటనే స్పందించాల్సిన కూటమి ప్రభుత్వం కిమ్మనక పోవడానికి వెనుక ఏమి జరిగిందనేది చర్చగా మారింది.

అదానీ ఎలా ఎంటర్ అయ్యారు?

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కానీ, విద్యుత్ అమ్మేందుకు ఒప్పందాలు చేసుకునే విషయంలో కానీ అదానీ నేరుగా ప్రభుత్వంతో సంబంధాలు పెట్టకోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన అదాని ఆయన సహకారంతోనే జగన్ వద్దకు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అదానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వ్యాపారాల్లోకి రావడం 2014లోనే మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ తరువాత అదే వరవడిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ అదానీ కొనసాగించారు. మోదీ అండతో పలు రాష్ట్రాల్లో వివిధ రకాల వ్యాపార లావాదేవీలు అదానీ ప్రారంభించారు. అందులో భాగంగానే ఏపీలో కూడా చేశారని, ప్రధాని మోదీతో జగన్ కు ఉన్న సన్నిహిత సంబంధం కూడా విద్యుత్ వ్యాపార విస్తరణకు ఉపయోగపడి ఉంటుందనేది పలువురి మాట. కేంద్ర పెద్దల సహకారంతోనే ఏపీలో అదానీ వ్యాపారాలు ప్రారంభించారని, అంతకు ముందు కూడా దేశంలోని చాలా మంది బడా వ్యాపారులతో జగన్ కు సంబంధాలు ఉన్నాయని, అవికూడా అదానీ ఏపీలో వ్యాపారాలు చేసేందుకు అనుకూలించి ఉండొచ్చనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం...

ప్రస్తుతం విద్యుత్ ఒప్పందంలో జరిగిన లావాదేవీల కారణంగానే రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం ఎక్కువైందని ప్రజలు భావిస్తున్నారు. ముడుపుల కోసం ఎక్కువ డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికార కూటమి ఈ ముడుపుల వ్యవహారంపై నోరు మెదపకపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీస్తే రాజకీయ ప్రయజనాలేనని తేలింది. జగన్ ను బదనాం చేయాలని మాట్లాడితే ఇప్పటికే బదనాం అయిన అదానీ మరింత బదనాం అవుతారు. దాని వల్ల మోదీతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే భావనలో ఏపీలోని కూటమి పెద్దలు ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలను జగన్ ముడుపుల వ్యవహారంపై మాట్లాడించేందుకు ఫెడరల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదాని మోదీకి బాగా దోస్త్ కాబట్టి అదానీ వ్యవహారంపై నోరు విప్పుతారా లేదా.. అనే చర్చ మొదలైంది. రాజకీయ నాయకులంతా ఒకటేనని ప్రజలకు అనుమానం రాకుండా ఉండాలంటే అదానీ వ్యవహారం వదిలేసి జగన్ అవినీతి పరుడని నిరూపించే యత్నం సీఎం చేస్తారా.. లేక దర్యాప్తు పేరుతో కాలం గడుపుతారా? అనే చర్చ కూడా మొదలైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్ వ్యవహారంపై నోరు విప్పుతారా.. లేక మోదీ భయంతో ఈ విషయాన్ని దాట వేస్తారా? అనే చర్చ కూడా రాష్ట్రంలో జరుగుతోంది.

ఒక ఫంక్షన్ లో కొందరు టీడీపీ నేతల ముచ్చట్లు...

ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ విజయకుమార్ నియమితులయ్యారు. ఈయన నెల్లూరు జిల్లాకు చెందిన వారు. శుక్రవారం మద్యాహ్నం రెయిన్ ట్రీ పార్కులోని బయోడైవర్సిటీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ సీనియర్ నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డిలు భోజనం చేస్తూ సరదాగా జగన్ ముడుపుల వ్యవహారంపై మాట్లాడుకున్నారు. మరీ ఇంత దారుణమా... బాగ జరిగింది. మనం బయట పెట్టకముందే బయటి వారు వీడి బాగోతాన్ని బయట పెట్టారు. ఇక దీని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చంటూ పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం విశేషం. వారి మాటలను భోజనం చేస్తూ పలువురు ఆశ్చర్యంగా విన్నారు.

Next Story