ఎన్నికల వేళ బొత్స  కొడుకుపై  భూకబ్జా విచారణ
x

ఎన్నికల వేళ బొత్స కొడుకుపై భూకబ్జా విచారణ

ఎన్నికల ముందు బొత్స సత్యనారాయణ కుటుంబానికి భారీ ఝలక్ తగిలింది. ప్రత్యర్థలకు నీతులు చెప్పే బొత్సకు ఇది భారీ ఎదురుదెబ్బ కానుంది.


(శివరామ్)

బొత్స దంపతులకు కొత్త కష్టాలు వచ్చాయి. ప్రతిరోజూ మీడియా ముందుకు వచ్చి నీతి సూత్రాలు వల్లించే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, అవినీతికి అమడ దూరమంటూ ఎన్నికల సభల్లో చెబుతున్న బొత్స ఝాన్సీకి కుమారుడి రూపంలో సన్ స్ట్రోక్ తగిలింది. బొత్స కుమారుడైన సందీప్ 31 ఎకరాల భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణకు అదేశించడం పోలింగ్‌కు పది రోజుల ముందు బొత్స కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి ఏకంగా నలుగురు పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో వచ్చిన భారీ ఫోర్జరీ, కబ్జా ఆరోపణలు ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో అన్న అందోళన బొత్స శిబిరంలో ప్రారంభమైంది.

రంగారెడ్డి జిల్లాలో భూ కుంభకోణం

బొత్స సత్యనారాయరణ కుమారుడు బొత్స సందీప్ కొందరు వ్యక్తులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ఫోర్జరీ చేసి షాబాద్ మండలంలోని మంచనపల్లి గ్రామ సర్వే నెంబర్. 422లోని 31 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ తెలంగాణ హైకోర్టులో బొప్పి మహేందర్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి.. జూన్ ఐదవ తేదీలోగా వివరాలు తెలియజేయాల్సిందిగా తెలంగాణ పోలీసులను అదేశించారు. 2018-19 సంవత్సరాల్లో రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేసి భూమి కాజేసిన సందీప్ ఆయన అనుచరులపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోవడంలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. భూమిపై కుటుంబంలో ఉన్న వివాదాలను ఆసరగా చేసుకుని బొత్స తనయుడు సందీప్ ఫోర్జరీ పాల్పడినట్లు ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని పేర్కొన్నారు.

ప్రత్యర్థుల చేతుల్లో ప్రచారాస్త్రం

ఇప్పుడు విశాఖ , విజయనగరం జిల్లాలలో బొత్స సందీప్ వార్త ప్రత్యర్థి పార్టీల చేతులలో అస్త్రంగా మారింది. అప్పట్లో మంత్రి వోక్స్ వాగన్ కుంభకోణానికి పాల్పడి ‘సొమ్ములు పోనాయ్, ..నేనేటీ సేత్తా’ అంటూ అమాయకంగా ప్రశ్నించిన బొత్స కుటుంబం ఇప్పటికీ మారలేదని, అవినీతి, అక్రమాలలో మునిగితేలుతుందంటూ ప్రత్యర్ది అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి, భార్య బొత్స ఝాన్సీ విశాఖ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం అసెంబ్లీ నుంచి, బంధువు బడికొండ అప్పలనాయుడు నెల్లిమర్ల అసెంబ్లీ నుంచీ బరిలో ఉన్నారు. తెలంగాణలో ఇంత కాలం ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలమైన కేసీఆర్ ప్రభుత్వం ఉండడం వల్లే బొత్స సందీప్‌పై చర్యలు తీసుకోలేదనే అరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ ప్రతిపక్షాలకు నీతులు చెప్పే బొత్స ఇప్పుడు పెద్ద కుంభకోణంలో ఇరుక్కోవడం, అందులోనూ కోర్టు అదేశంలో విచారణ జరుగుతుండడం ఇరకాటంలో పడేసింది.

Read More
Next Story