
సీపీఐ అగ్రనేత సురవరం హైదరాబాదులో కన్నుమూత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) శుక్రవారం రాత్రి కనుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో
శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. సిపిఐ నాయకులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి 1974లో డాక్టర్ విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు.వారికి ఇద్దరు కుమారులు. ఆయన కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ల్బీ పట్టాపొందారు.
ఏపీ సిపిఐ ఏపీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం కానున్న వేళ సురవరం సుధాకరరెడ్డి కన్నుమూయడం కమ్యూనిస్టులను విషాదంలోకి నెట్టివేసింది. విద్యార్థి, యువజన సంఘాల ద్వారా సిపిఐ ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
సిపిఐ లో ప్రస్థానం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలకు ఊపిర్లు ఊదిన సురవరం సుధాకర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ (aisf) ఉద్యమాల నుంచి ఆయన ఎర్రజెండా పట్టుకున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లెలో 1942 మార్చి 25వ తేదీన ఆయన జన్మించారు. సిపిఐ విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా విశేష సేవలు అందించారు. వామపక్ష ఉద్యమాలను సురవరం సుధాకర్ రెడ్డి ఉర్రూతలూగించారు.
మహబూబ్ నగర్ జిల్లా వాసి అయినా నల్లగొండ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి 1998, 2004 ఎన్నికల్లో సిపిఐ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.. 2012 నుంచి 2019 వరకు కామ్రేడ్ సురవరం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
తండ్రికి తగ్గ తనయుడు
ఉద్యమాలలో సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు సాధించాడు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి కూడా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. పోరాటాలలో పాల్గొన్న ఖ్యాతి సంపాదించుకున్నారు. సురవరం తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు.
షాకింగ్ కు గురి చేసింది
"సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరెడ్డి ఈరోజు సాయంత్రం 9 గంటలకు మరణించారని తెలిసి షాకింగ్ గురయ్యాను" అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టాలిన్ బాబు నన్ను cpi వైపు ఆకర్షిస్తే సుధాకరెడ్డి పార్టీలో నా ఎదుగుదలకు ప్రతిసందర్భంలోనూ ప్రోత్సహించారని డాక్టర్ నారాయణ గతాన్ని గుర్తుకు చేసుకున్నారు. మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని సురవరంతో ఉన్న అనుంధాన్ని గుర్తుకు చేసుకున్న నారాయణ ఆవేవన వ్యక్తం చేశారు. సురవరం మరణం సిపిఐ, వామపక్ష ఉద్యమానికి , ప్రజాస్వామ్య ఉద్యమానికి ముఖ్యంగా నాకు, మాకుటుంబానికి తీరని లోటు అని నివాళులర్పించారు.
ప్రముఖుల సంతాపం
సీపీఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారి మృతి పట్ల తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం మరణించారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ,వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక కొండ్రవుపల్లి అనే మారుమూల పల్లెలో జన్మించి సీపీఐ పార్టీలో జాతీయ స్థాయి నేత గా ఎదిగారని, వారు ఎన్నో ప్రజా పోరాటాలు , ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని స్మరించుకున్నారు.
హరీష్ రావు నివాళి
సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బి ఆర్ ఎస్ మాజీమంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ప్రజా ఉద్యమాలు ప్రధానంగా వామపక్ష ఉద్యమాలలో సురవరం సుధాకర్ రెడ్డి అనుసరించిన పంధా స్ఫూర్తిదాయకమని హరీష్ రావు సంతాపం తెలిపారు.
Next Story