చిరుద్యోగుల మీద మీ ప్రతాపం ఏంటయ్యా?
x
విలేకరుల సమావేశం ప్రసంగిస్తున్న తిరుపతి సిఐటియు నేత కందారపు మురళి

చిరుద్యోగుల మీద మీ ప్రతాపం ఏంటయ్యా?

చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానండి అని తెలుగుదేశం పార్టీ నేతలకు సిఐటియు సలహా...


తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో అంగన్వాడీ, ఆశా, సంఘమిత్ర, మధ్యాహ్నభోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి స్కీం వర్కర్లపై తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న రాజకీయ వేధింపులు మానుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాటి ఉదయం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సిఐటియు నేతలతో కలిసి ప్రసంగించారు.

రాష్ట్రంలో రాజకీయ వేధింపులు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే, పదే ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉండటం ఆందోళన కల్గిస్తున్నదని కందారపు మురళి వ్యాఖ్యానించారు.

శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో పి. ఈశ్వర్ రెడ్డి అనే టిడిపి నాయకుడు అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచరు పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, అంగన్వాడీ సెంటర్లో రికార్డులు ఎత్తుకు పోవటం, లబ్ధిదారులను బెదిరించి తెల్లకాగితాలలో సంతకాలు తీసుకోవటం, ఉద్యోగానికి రాజీనామా చేయమని దాడి చేయటం వంటి ఘటనలు జరిగాయని పోలీసులు, సిడిపిఓకు ఫిర్యాదు చేస్తే నిందితులను సమర్ధిస్తూ బాధితురాలిపైనే కేసు నమోదు చేయటం చూస్తే వేధింపులు ఎంతటి పరాకాష్టకు చేరుకున్నాయో అర్థమవుతున్నదని కందారపు మురళి అన్నారు.

శ్రీకాళహస్తి మండలంలో 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వైసిపి నేతలతో బంధుత్వముందని ఇతర కారణాలు సాకుగా చూపి ఉద్యోగాల నుంచి తొలగించారని, వెంకటగిరి మండలం లోని ఓ గ్రామంలో కస్తూరి కృష్ణవేణి అనే ఆశా వర్కర్ ను స్థానిక టిడిపి నేతలు బలవంతంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తీస్తున్నారని ఆరోపించారు.

క్యాన్సర్ తో ఉన్న ఇద్దరు పిల్లలు వారిలో ఒకరు మూడు నెలల కిందట మరణించడం, మరో ఇరువురు పిల్లలను సంరక్షిస్తూ చాలీచాలని వేతనంతో అల్లాడిపోతున్న కృష్ణవేణి పూర్తిగా ఆ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నదని తెలిపారు.


మరిన్ని కక్ష సాధింపు చర్యలు


వెంకటగిరి: కస్తూరి క్రిష్ణవేణి అనే దళిత మహిళ గత 19 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా సుబ్రమణ్యం అనే ఊరిలో పని చేస్తున్నది. ఆమెను తీసి వేయాలని గ్రామ పెత్తందారులు వేధిస్తున్నారు.

శ్రీకాళహస్తి: గాయత్రీ అనే అంగన్వాడీని తొలగించాలని తెలుగుదేశం నాయకులు వేధిస్తున్నారు. పి.సాజన్య అనే అంగన్వాడీ టీచర్ ను తొలగించాలని పి.ఈశ్వర్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు వేధిస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఉద్యోగానికి మానుకోకపోనందున లైంగిక అత్యాచారానికి పూనుకున్నాడు.

పుత్తూరు: పి.లీలావతి అనే అంగన్వాడీ టీచర్ భవాని నగర్ సెంటర్లో పని చేస్తున్నారు. ఆమెను తీసేయాలని వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ వేధిస్తున్నారు.

నారాయణవనం: మండలంలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు తంగరాజు, కుమ్మర కుప్పయ్యలను ఆపేశారు.

సత్యవేడు: ఇద్దరు మిడ్డేమీల్స్ వర్కర్లు లీలావతి, వసంతమ్మలను ఆగిపొమ్మని అంటున్నారు ఆశ, అంగన్వాడి, విఓఏ, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయాలని టిడిపి నాయకులు వత్తిడి చేస్తున్నారు.

వెంకటగిరి -

:అర్బన్ పిహెచ్ సి లో పని చేస్తున్న ఆశా వర్కర్ సాయిలక్ష్మిని తీసివేస్తామని ఎఎన్ఎం సత్యవేణి వేధిస్తున్నారు. ఆమె వెనుక తెలుగుదేశం నాయకులు ఉన్నారు.

శ్రీకాళహస్తి మండలం లో 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు.

తొట్టంబేడు(మం) :

11 మందిని తొలగిస్తామని బెదిరిస్తున్నారు. సత్యవేడు: కెవిబి పురం 25 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను నిలిచిపోవాలని బెదిరిస్తున్నారు.

సత్యవేడు: గురుకులంలో బి.లీలా, పి.మల్లేశ్వరిలను ఆపేశారు.


మహిళలపై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం అమానుషమని అన్నారు . జిల్లాలోని పలు నియోజక వర్గాలలో నెలకొన్న పరిస్థితిని అనుబంధ పేజీలో ఘటనల వారీగా వివరించామని తెలిపారు.ఈ వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తూ పోతే సిఐటియు అనుబంధ సంఘాలు చూస్తూ ఊరుకోవని, జిల్లా, రాష్ట్రవ్యాపిత ఉద్యమాలు కొనసాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసిపి, టిడిపి పాలనకు తేడా లేని రీతిలో ప్రస్తుత పరిస్థితి తయారయిందని ఆరోపించారు. ప్రజలు వైసిపీని ఓడించి టిడిపికి అధికారం కట్టబెట్టింది పారదర్శక పాలన అందిస్తారని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని రాజకీయ వేధింపులకు ముగింపు పలకాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు బాధితులకు అండగా నిలవాలని సిఐటియు తిరుపతి జిల్లా కమిటి తరపున ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. జయచంద్ర, జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Read More
Next Story