కామ్రేడ్ సీతారాం ఏచూరి ఇకలేరు..
x

కామ్రేడ్ సీతారాం ఏచూరి ఇకలేరు..

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. కొంతకాలంగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం చనిపోయినట్టు ఆస్పత్రి డాక్టర్లు ప్రకటించారు.


సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. కొంతకాలంగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం చనిపోయినట్టు ఆస్పత్రి డాక్టర్లు ప్రకటించారు. ఆయన వయసు 72 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో పుట్టిన సీతారాం ఏచూరి విద్యాభ్యాసం మద్రాసు (చెన్నైలో) లో సాగింది. ఆయన తన మేనమామ, ఐఏఎస్ అధికారి మోహన్ కందా ఇంట పెరిగారు. ఆయన ప్రభావం సీతారాం ఏచూరిపై చాలా ఉందంటారు. చిన్నప్పటి నుంచే వామపక్ష ఉద్యమాలలో ఎక్కువగా పాల్గొన్న సీతారాం ఏచూరి సీపీఎంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన భార్య సీమా చిస్తీ.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ మాజీ ఎడిటర్‌గా ఉన్నారు. ఆయన కుమారుల్లో ఒకరు కరోనా సమయంలో చనిపోయారు. గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్న సీతారాం ఏచూరి నాలుగు రోజుల కిందట ఢిల్లీలో ఏయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈవేళ చనిపోయారు.

ఆంధ్ర టు ఢిల్లీ

1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.

అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి నిందిస్తారు. పశ్చియాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడుపోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే నిదర్శనమంటారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవటానికే, పెత్తనం కోసం అర్రులు చాస్తోందని విమర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా, వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు. ఇదే కారణంలోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కుకుండా సైన్యం జోక్యం చేసుకుంటోదన్నది ఏచూరి ఆరోపణ.

Live Updates

  • 12 Sept 2024 4:34 PM IST

    సీతారాం.. ఓ మంది మిత్రుడు


    సీతారాం ఏచూరి మరణంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధిస్తుందని అన్నారు. ‘‘సీతారాం నాకో మంచి స్నేహితుడు. ‘దేశానికి సంబంధించి లోతైన అవగాహన ఉన్నారు. ఇండియా అన్న ఆలోచనకు రక్షకులు. గతంలో మా మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలను నేను మిస్ అవుతాను. ఇటువంటి విషాధ సమయంలో ఆయన కుటుంబీకులు, స్నేహితులు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ తన ఎక్స్(ట్విట్టర్)లో రాసుకొచ్చారు.


Read More
Next Story