తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత..  ఎందుకో చెప్పిన అధికారులు..!
x

తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ఎందుకో చెప్పిన అధికారులు..!

వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ కూల్చివేయడాన్ని సదరు పార్టీ తప్పుబట్టింది. ఈ కూల్చివేత కోర్టు దిక్కారమే అవుతుందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు కాగా తాజాగా వైసీపీ పార్టీకి సంబంధించిన భవనాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడెపల్లి మండలం సీతానగరం బోట్ యార్డ్ కాంపౌండ్‌లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర సీఆర్‌డీఏ అధికారులు కూల్చవేశారు. కాంపౌండ్‌లోని ఆర్ఎస్ నెం.202-ఏ-1లోని 870.40 చదరపు మీటర్ల స్థలంలో సదరు భవనం అక్రమంగా నిర్మించబడుతోందని వివరిస్తూ వారు కూల్చివేతలను ప్రారంభించారు. బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్న అధికారులు పోలీసులు, ఇతర అధికారుల సమక్షంలో కూల్చివేత పనులను చేపట్టారు. అక్కడ సదరు భవన నిర్మాణం దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతుంది. అక్కడ నిర్మాణం ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాలు ఎలా కడతారని, ఇది అధికార దుర్వినియోగమే అని జనసేన గతంలో పలుమార్లు మండిపడింది.

ఆదేశాలు బేఖాతరు

ఈ కూల్చివేతపై వైసీపీ ఘాటుగా స్పందించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూల్చివేత చర్యలు చేపట్టారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘‘కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విషయాలను, ఉత్తర్వులను సీఆర్‌డీఏ కమిషనర్‌కు వైసీపీ తరపు న్యాయవాది తెలిపారు. అయినా అధికారులు కూల్చివేతను కొనసాగించారు. ఇది కోర్టు ధిక్కారామే అవుతుంది’’ అని వైసీపీ తెలిపింది. అయితే నిర్మాణానికి సంబంధించి వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌పై విచారణ పూర్తయ్యేవరకు ఎటువంటి కూల్చివేతలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వైసీపీ.. రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

కావాలనే కూల్చివేతలు

ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతల చర్యల వేనక కక్షసాధింపు ఉద్దేశమే ఉందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణం ఇప్పటికే గ్రౌండ్‌ ఫ్లోర్ స్లాబ్ పూర్తి చేసుకుని తొలి అంతస్తు స్లాబ్ పనులకు సిద్ధమవుతోందని, ఈ సమయంలో తమ పార్టీపై కక్షతో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఇలాంటి చర్యలకు పూనుకుందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయాలన్నింటినీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని వైసీపీ పేర్కొంది. కానీ అక్రమ నిర్మాణం కాబట్టే తాము కూల్చామని, సక్రమంగా కడితే కూల్చాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని సీఆర్‌డీఏ వర్గాలు అంటున్నాయి.

Read More
Next Story