
ఏపీని ముంచెత్తనున్న వర్షాలు, వణికిస్తున్న తుపాన్లు
29 నుంచి భారీ వర్షాలు తప్పవా?
బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే.. మరొకటి ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అల్పపీడనాలూ వచ్చే రెండు మూడ్రోజుల్లో కలిసిపోయే అవకాశముంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా, గురువారంలోగా తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
29 తర్వాత భారీ వర్షాలు
కొమొరిన్ ప్రాంతంలో ఉపరితల అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం నైరుతి బంగాళాఖాతంలో కొమొరిన్, శ్రీలంక పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తర్వాత ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ తెలిపింది. 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, 30న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు గురువారం లోగా ఒడ్డుకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది.
మలక్కా జలసంధి సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story

