
మొంథా తుపాను బీభత్సం: ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం
వ్యవసాయానికి రూ.829 కోట్లు, రోడ్లు–భవనాలకు రూ.2,079 కోట్లు నష్టం
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ కి భారీ నష్టాన్నే మిగుల్చింది. తుపాను ప్రభావంతో రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం రూ. 5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు చెప్పారు.
వ్యవసాయరంగానికి రూ. 829 కోట్లు, రోడ్లు, భవనాల విభాగానికి రూ. 2,079 కోట్ల మేర నష్టం కలిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 120 పశువులు మాత్రం చనిపోయాయి. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువగానే ఉంది.
ముఖ్యమంత్రి బుధవారం తుపాను నష్టాలపై సమీక్ష నిర్వహించారు. పలు శాఖల అధికారులు పరిస్థితులను, నష్ట వివరాలను వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. “మొంథా తుపాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసినందు వల్లే ప్రాణనష్టం లేకుండా పరిస్థితిని అదుపులో ఉంచగలిగాం” అని చెప్పారు.
“ప్రతి కుటుంబాన్ని, ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగాం. తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా వెంటనే నిర్ణయాలు తీసుకున్నాం,” అని సీఎం చంద్రబాబు వివరించారు.
“గతంలో విద్యుత్ సరఫరా ఆగితే తిరిగి పునరుద్ధరించడానికి కనీసం 10 గంటల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 3 గంటల్లోనే విద్యుత్‌ను తిరిగి అందించగలిగాం. వర్షం పడుతున్నా, కూలిన చెట్లను వెంటనే తొలగించారు. ఇది ప్రతి శాఖలోని సిబ్బంది నిబద్ధతకు ఇది నిదర్శనం” అన్నారు చంద్రబాబు నాయుడు. “ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు. కానీ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించవచ్చు,” అన్నారు.
“గతంలో చెట్లు కూలితే తొలగించడానికి వారం పట్టేది. ఇప్పుడు కొన్ని గంటల్లోనే చెట్లు తొలగించగలిగాం. రాష్ట్రం మొత్తం స్థాయిలో యంత్రాంగం అత్యంత సమర్థంగా పని చేసింది,” అని తెలిపారు. ప్రాణనష్టం లేకుండా విపత్తును ఎదుర్కొనడం ప్రభుత్వ సమన్వయం ఫలితమని చెప్పారు.
తుపాను ప్రభావం – జిల్లాల వారీ నష్టం
తుపాను ప్రభావం ప్రధానంగా తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా నమోదైంది. పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరి, అరటి, మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 15 జిల్లాల్లో సుమారు 1.12 లక్ష హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. రహదారులు, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయిన చోట్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంటనష్టాల అంచనా, పునరావాసం, మరియు రైతులకు పరిహార పథకాల రూపకల్పనపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి అన్ని శాఖలను త్వరితగతిన పూర్తి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయ నష్టాల అంచనాపై ప్రత్యేక బృందాలు జిల్లాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నాయి.
ప్రాణనష్టం లేకుండా తుపానును ఎదుర్కొన్నందుకు ప్రభుత్వం ఉపశమనం వ్యక్తం చేసినప్పటికీ, పంట నష్టం, మౌలిక వసతుల పునరుద్ధరణపై రాష్ట్రానికి ముందున్న సవాళ్లు తక్కువేమీ కావు.
ప్రకృతి విపత్తులు ఆర్థిక బరువుతో పాటు జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈసారి కూడా రైతుల నష్టాలను భర్తీ చేయడం, పునరావాసం వేగంగా పూర్తి చేయడం ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది.
Next Story

