ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో గురువారం వరకు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. నేడు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాన్ హెచ్చరికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్ లను అలర్ట్ చేసింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యాకారులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మత్స్యాకరులు సాధారణంగా సముద్రం గురించి మాకు తెలుసు నంటూ చేపల వేటకు వెళుతుంటారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అందువల్ల మత్స్యాకారులు ఎవ్వరూ సముద్రంలోకి వెళ్లవద్దని కలెక్టర్ లు హెచ్చరించారు.