అన్నపై చెల్లెళ్లు మాటల బాకులు వదులుతున్నారు. హంతకుడికి కడప పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి జగన్ అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.


ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డిపై చెల్లెళ్లు మాటల బాకులు వదులుతున్నారు. కడపలో అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యమంటున్నారు. హంతకుడికి సీటు ఇచ్చి నేడు కడపలో పోటీ చేయిస్తున్నారు. మా అన్న హంతకుడితో చేతులు కలిపారు. ఇంతకంటే దారుణం ఉంటుందా. వివేకా హత్య విషయంలో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. అవినాష్ రెడ్డిని నిందితునిగా ఇప్పటికే తేల్చింది. అటువంటి హంతకుడికి ఎందుకు జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారు. నా పోరాటం హంతకుడైన అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాగుతుంది. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలి అంటూ ఉద్వేగ భరితమైన ప్రసంగాలు చేస్తున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియాలో కుక్కలను ఉసిగొలిపి నా భర్త కులం గురించి, ఇంటిపేరు గురించి వాగుతున్నారు. నాకు పెళ్లి చేసేటప్పుడు నా పెళ్లి గురించి మీకు తెలియదా? నా బిడ్డకు తాత రాజారెడ్డి పేరు పెట్టింది ఎవరో తెలియదా? ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటూ అన్న వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.

చిన్నాన్నను గొడ్డలితో నరికి చంపారు. ఇళ్లంతా రక్తంతో నిండిపోయింది. అయినా గుండెపోటుతో చనిపోయినట్లు సాక్షిలో ఎందుకు రాయించారు. జగన్ కు తెలియదా? ఎవరు హంతకులో తెలుసు కాబట్టే దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారు. ఇంత దారుణంగా చంపిన హంతకులు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎలా వస్తారు. ఎలా రానిస్తాం. వివేకానందరెడ్డిని ఓడించేందుకు బంధువులు ప్రయత్నించినా ఆయన దానిని పెద్దగా పట్టించుకోలేదు. గెలుపు కోసం ప్రజల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నించారు తప్ప రివేంజ్ తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇంతగా ఆయనను కడప ప్రజలు అభిమానించారు. అటువంటి వ్యక్తిని కుటుంబానికి దూరం చేసి దారుణంగా హత్య చేసిన వ్యక్తులకు వత్తాసు పలుకుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలి. ఈయనా వైఎస్సార్ ఆశయాలు నెరవేర్చేది. ఒక్కటైనా చెప్పింది సక్రమంగా చేశాడా అని నేను ప్రశ్నిస్తున్నా అంటూ షర్మిల వైఎస్ జగన్ పై బల్లెపు లాంటి మాటల బాకులు వదులుతున్నారు.

బంధువులే నాన్నను పొట్టనపెట్టుకుంటారని ఎవరనుకుంటారు. సీబీఐ విచారించి నిగ్గుతేల్చే వరకు మాకు కూడా అవినాష్ రెడ్డి హత్య చేయించాడని తెలియదు. ఇప్పుడు మా అన్న ఆ హంతకుడికి పార్లమెంట్ సీటు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నాడు. అతను గెలిస్తే న్యాయం సచ్చిపోతుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ అవినాష్ గెలవకూడదు. నేను సాగించేది న్యాయపోరాటం అని వివేకానందరెడ్డి కుమార్తె సునీత అంటున్నారు. రెండు రోజులుగా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రచారంలో కడప కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా షర్మిల అన్నపై వదులుతున్న బాణాలు పక్కలో బల్లేల్లా గుచ్చుకుంటున్నాయి. ఆమెతో పాటు చిన్నాన్న కుమార్తె సునీత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు.

ప్రచారమంతా పూర్తిగా వివేకానందరెడ్డి హత్య చుట్టూ తిరుగుతోంది. వివేకానందరెడ్డి అన్న రాజశేఖర్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారని, ఎలాగైనా ఇద్దరినీ దూరం చేసి కుటుంబాలను విడగొట్టి పదవులు చేపట్టి పెత్తనం చెలాయించాలనే కుట్రలో భాగంగానే అవినాష్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వైస్ జగన్ ప్రభుత్వం చిన్నాన్న హత్యను ఏమాత్రం పట్టించుకోలేదని, అవినాష్ ను రక్షించేందుకే పట్టీపట్టనట్లు వ్యవహరించారని చెల్లెళ్లు జగన్ పై ధ్వజమెత్తారు. నావెనుక ఏ పార్టీలేదు. నేను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎవరు నరికి చంపుతారో తెలియదు. దయచేసి మీడియా వారు హంతకులకు శిక్ష పడాలని కోరుకోవాలన్నారు.

అసెంబ్లీలో అవినాష్ కు జగన్ క్లీన్ చిట్ ఇచ్చాడు. సీబిఐ నిందితుడని చెబుతోంది. నా ఇంట్లో వాళ్లే హత్యకు పాల్పడతారని నేను నమ్మలేదు. అదే నాపొరపాటు అంటున్నారు సునీత. వివేకాకు మంత్రిపదవి ఇవ్వడాన్ని జగన్ వ్యతిరేకించారు. ఆ తరువాత వివేకా వైఎస్సార్సీపీలో చేరారు. 2014 లో షర్మిల కడప నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. అవినాష్ రెడ్డికి జగన్ అన్న టిక్కెట్ ఇచ్చారు. నాపోరాటంలో ఎవరినైనా కలుస్తా, ఏ పార్టీ సహకారమైనా తీసుకుంటానని సునీత మీడియాకు చెప్పడం విశేషం.

Next Story