శ్రీ వారికి నైవేద్యం.. భక్తులకు మహా ప్రసాదం..
x

శ్రీ వారికి నైవేద్యం.. భక్తులకు మహా ప్రసాదం..

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? ఇవన్నీ చూస్తే.. ఆశ్చర్యపోతారు.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: చారిత్రక నేపథ్యం.. ఎన్నో ప్రత్యేకతలు.. కలియుగ వైకుంఠం తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం సొంతం. ఆ పరంపరలో శ్రీవారి ప్రసాదాలకు ప్రపంచవ్యాప్తంగా మక్కువ ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారనేది వింటే మాత్రం ఆశ్చర్యపోతారు.

తిరుమల వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. భోగలాలసుడు. ప్రసాదాలు కూడా ప్రీతిపాత్రం. స్వామివారికి నివేదించిన ప్రసాదాలను స్వీకరించడాన్ని భక్తులు వరంగా భావిస్తారు. అంతేకాదు ఇది తమకు లభించిన మహా భాగ్యంగా ఆనందిస్తారు.

మనకు తెలిసినవి కొన్నే..

తిరుమల ప్రసాదం అంటే మనకు తెలిసింది కొన్ని మాత్రమే. అందులో లడ్డు, వడ, జిలేబి, ఇంకొన్ని పేర్లు విని ఉంటాం. సాధారణ భక్తులకు తెలియని ప్రసాదాలు ఎన్నో టీటీడీ తయారు చేస్తుంది. ఉదయం శ్రీవారిని మేలుకొలుపు నుంచి రాత్రి పవళింపు సేవ వరకు, సమయానుసారం టీటీడీ అర్చకులు స్వామి వారికి నివేదన సమర్పిస్తారు.

ఆగమ శాస్త్రానికి అనుగుణంగా..

ఈ నివేదనలు అన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి అనుగుణంగా... వందల వేల సంవత్సరాల నుంచి కట్టుబాటు తప్పకుండా అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోవలోనే తిరుమల శ్రీవారికి ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి ఆగమ శాస్త్రం ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసాదాలు నివేదించడానికి ఒక టైం టేబుల్ ఉంటుంది. స్వామి వారికి నిత్యం ఎన్నిసార్లు నైవేద్యం సమర్పించాలి. ఎన్ని రకాల ప్రసాదాలు ఉండాలి. దానిపై ఆగమ శాస్త్రంలో ప్రస్తావించిన విధంగానే అర్చకులు నిర్దిష్ట సమయాల్లో నివేదిస్తుంటారు. స్వామివారికి సమర్పించడంతో పాటు, వాటిని భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. స్వామి వారిని దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చే భక్తులకు రకరకాల ప్రసాదాలు ఆలయ ఆవరణలోనే పంపిణీ చేస్తూ ఉంటారు.

రామానుజాచార్యుల వారి నిర్దేశం

దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీరామానుజాచార్యులు నిర్దేశించిన ప్రకారం తిరుమల శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలను నివేదిస్తుంటారు. సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు ఈ ప్రసాదాల నివేదన ఉంటుంది. అలాగే ఒక రోజు నిత్యసేవలు, విరామ సమయంలో కూడా అనేక రకాలైన నివేదనలు స్వామివారికి నిర్వహించడం ఆనవాయితీ.

సుప్రభాత సమయంలో వెన్న, ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాల సేవ పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల్ల నువ్వులు, బెల్లం, సొంటి సమర్పిస్తారు. సహస్ర నామార్చన తర్వాత జరిగే మొదటి గంటలో మీగడ, వెన్న, పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని స్వామి వారికి నివేదిస్తారు. రోజువారీ చిత్రాన్నం, దద్దోజనం క్షీరాణం, కదంబం, పాయసాన్నం కూడా నివేదిస్తారు.

మధ్యాహ్నం ఆరాధనల్లో నాదూకం, లడ్డు, దోసె, వడ, అప్పం సమర్పిస్తారు. సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తర్వాత సద్దన్నం, సీరా.. స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి వేళ నైవేద్యసమయంలో తోమాల తరువాత మరీచాన్నం, ఉడాన్నంను నైవేద్యంగా సమర్పించడం ఆచారం. రాత్రి పవళింపు సేవకు ముందు ఆరాధన చేసే సమయంలో పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఎన్ని రకాల నైవేద్యాల సమర్పణతో శ్రీవారి సేవలు టీటీడీ యంత్రాంగం, అర్చక స్వాములు తరిస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రసాదాలు కాదు స్వీకరించే భక్తులు తమకు లభించిన వరప్రసాదంగా భావిస్తారు.

Read More
Next Story