గోలే లేని ఒంగోలులో రాజకీయ గోల జరుగుతోంది. ఒంగోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రకరకాలుగా మారుతున్నారు. ఎప్పుడు ఎవరు తెరపైకి వస్తారో అర్థం కావడం లేదు.


ఒంగోలు రాజకీయం రకరకాలుగా మారుతోంది. ఒంగోలు అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీకి ఒక గోల్‌ అంటూ లేకుండా పోయింది. నిన్నా మొన్నటి వరకు శిద్దా రాఘవరావును ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్‌ పిలిపించి మరీ చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు లేకుండా నేనెలా గెలుస్తానని అనుకున్న శిద్దా ఏమి చేయాలో ఆలోచించుకునే పనిలో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. అయినా బాలినేని నుంచి తగిన స్పందన కరువైంది. ఇంతలో మరొకరు తెరపైకి వచ్చారు.

ఒంగోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రవిశంకర్‌?
అనూహ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కంది రవిశంకర్‌ పేరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు రవిశంకర్‌ ముఖ్యమంత్రిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసారు. ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి రవిశంకర్‌కు సూచించారు. దీంతో రవిశంకర్‌ పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. ఈయన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు లక్ష్మణరావుకు సాక్షాత్తు వియ్యంకుడు. అలాగే పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య కుమార్తెను రవిశంకర్‌ పెద్ద కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూతురును కిలారు రోశయ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ నేపథ్యం ఉన్న వీరితో బంధుత్వం ఉండటం, అందులోనూ వీరంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారే కావడం విశేషం. రవిశంకర్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎలాగూ రాబట్టుకోవచ్చనే ఆలోచనలో సీఎం జగన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. రవిశంకర్‌కు చతుర్వాటిక విల్లాస్, ఒంగోలులో రవిప్రియమాల్‌ ఉన్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడని చెప్పొచ్చు. ఈయన ఒంగోలు నగర వాసి కావడం కూడా కలిసొచ్చే అంశం.
పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపికలోనూ ఊహించని ట్విస్ట్‌


ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపికలోనూ మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పార్లమెంట్‌ అభ్యర్థిగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోటీకి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో మాట్లాడిన సీఎం ఈ మేరకు నిర్ణయించారు. నువ్వు పోటీకి సిద్ధంగా ఉండు, మిగిలిన విషయాలు నేను చూసుకుంటానని సీఎం భరోసా ఇచ్చారని తెలిసింది.
దీంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రవిశంకర్‌లు బాలినేని శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం కలిసారు. అన్నా నేను ఒంగోలు ఎంపీగా, రవిశంకర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించాలన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బాలినేని ఒక్కసారిగా అసహనంతో వారివైపు చూశారు.
‘నీకో దండం.. నీ సీఎంకో దండం’
అయ్యా ‘నీకో దండం.. నీ సీఎంకో దండం, నేను మాగుంటను తప్ప మరొకరిని ఎంపీ అభ్యర్థిగా ఒప్పుకునేది లేదు’ అని బాలినేని లె గేసి చెప్పి మీరు ఇక వెళ్లొచ్చంటూ రెండు చేతులు జోడించారు. దీంతో దిక్కుతోచని చెవిరెడ్డి నిస్సహాయంగా వెనక్కి తిరిగారు. నిజానికి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాజకీయాల నుంచి విరమించుకోవాలని తన కుమారుడు మోహిత్‌రెడ్డికి చంద్రగిరి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇప్పించుకున్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం, బాలినేని సీఎం జగన్‌కే కొన్ని షరతులు విధించిన నేపథ్యంలో చెవిరెడ్డిని సీఎం రంగంలోకి దించారు. కాగా హైదరాద్‌లో వీరు మాట్లాడి వెనుదిరిగిన తరువాత బాలినేని రాత్రికి పాప్‌కార్న్‌ తింటూ ‘గుంటూరు కారం’ సినిమా చూడటం విశేషం. శనివారం విజయసాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.
పట్టు వీడని సీఎం
ముఖ్యమంత్రి ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పట్టుదలతో ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బెట్టు చేసినా పట్టించుకోలేదు. తన రూటే సపరేటంటూ ముందుకు వెళుతున్నారు. మొదట ఎమ్మెల్యే అభ్యర్థిగా శిద్దా రాఘవరావును పోటీలో ఉండాల్సిందిగా సూచించారు. ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో రవిశంకర్‌ను రంగంలోకి దించారు. రవిశంకర్‌ ఒంగోలు వాసి, బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం కలిసొచ్చాయి. మొదటి నుంచీ బాలినేని శ్రీనివాసరెడ్డి తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అందుకు రూ. 170కోట్లు ప్రభుత్వం రిలీజ్‌ చేయాలని పట్టు బట్టారు. ముందుగా సీఎం డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ణ్యా పట్టించుకోలేదు. పేదలకు పట్టాలు ఇవ్వకుండా నేను పోటీ చేసేది లేదని, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లోనూ నేను తిరిగి ప్రచారం చేయలేనని బాలినేని సీఎంకు స్పష్టం చేశారు. నా విషయం పక్కన బెట్టినా ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని ప్రకటించాలని సీఎంను కోరారు. మాగుంటకు టిక్కెట్‌ ఇచ్చే ప్రశ్నే లేదని, ఆవిషయం మరిచిపోవాలని బాలినేనితో జగన్‌ చెప్పారు. దీంతో ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్‌ల విషయంలో సందిగ్ధత కొనసాగుతుండగా ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా రవిశంకర్‌లను ఎంపిక చేయడంతో ఒంగోలు రాజకీయం రసవత్తరంగా మారింది.
ఒంగోలు రాజకీయాల నుంచి బాలినేని తప్పుకుంటారా? లేక రంగంలోకి వస్తారా? అనే విషయం జిల్లా ప్రజల్లో చర్చకు దారి తీసింది.
Next Story