ధవళేశ్వరంలో డేంజర్ బెల్స్.. వాతావరణ శాఖ హెచ్చరికలు
x

ధవళేశ్వరంలో డేంజర్ బెల్స్.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం అధికంగా ఉందని, ఇప్పటికే రెండు డేంజర్ మార్క్‌లను దాటిందని రాష్ట్ర విపత్తలు సంస్థ ఎండీ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం డేంజర్ మార్క్‌ను దాటిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటిమట్టం ఇప్పటికే ఒకటో డేంజర్ మార్క్‌ను దాటిన క్రమంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక మార్క్‌ను దాటిందని, నీటి మట్టం 49.4 అడుగులకు చేరిందని ఆయన వివరించారు. ధవళేశ్వరం దగ్గర ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 12.05 లక్షల క్యూసెక్కులు ఉందని, రాత్రికి రెండో హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని కూర్మనాథ్ వెల్లడించారు.

హెచ్చరిక జారీ చేయనున్న క్రమంలో ఇప్పటికే ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేసే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రజలకు ఖాళీ చేయించే దిశగా కూడా అధికారులను కూడా అప్రమత్తం చేశామని, వారికి పరిస్థితులను వివరించామని కూర్మనాథ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోందని, సంబంధిత జిల్లాల యంత్రాంగానికి కూడా తగిన సూచనలు జారీ చేస్తోందని కూర్మనాథ్ పేర్కొన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన సంభవిస్తే అత్యవసర సహాయక చర్యల కోసం 4 ఎన్‌డీఆర్ఎఫ్, 6 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పారు.

ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో వరద హెచ్చరిక సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల ఫోన్లకు సందేశాల రూపంలో పంపుతున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూర్మనాథ్. అత్యవసర సహాయం కోసం ప్రజలు స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070,112, 1800 425 0101 సంప్రదించాలన్నారు. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని వివరించారు.

Read More
Next Story