ఆ దీవిని కడలి ఏటేటా మింగేస్తోంది. ఇంతకీ ఆ దీవి ఎక్కడ...
ప్రకృతి ప్రసాదించిన అందాలతో అలరారే సుందర ద్వీపం. బంధువులు అక్కడికి పోవాలంటే ఒక సముద్రం దాటి వెళ్లినట్లు భావిస్తారు. ఎంతో అహ్లాదకరమైన వాతావరణం. పచ్చని చెట్లు, మంచి రోడ్లు, చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అటువంటి దీవికి ఆపద సంభవించింది. ప్రతి ఏటా కొంత భూ భాగం సముద్రంలో కలిసి పోతోంది. ఇలాగే మరి కొన్ని ఏళ్లు గడిస్తే దీవి ఉండదు. అక్కడి ప్రజలు ఒక్కొక్కరుగా దీవిని వదిలి వెళ్లిపోవాలి. ఇంత సుందరమైన దీవిని ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతోంది. అక్కడి ప్రజలపై ప్రభుత్వానికి ఎందుకు ప్రేమ లేదు. కొంచెం ఆలోచిస్తే ఆ దీవిని బతికించొచ్చు. బయట నుంచి సముద్రంలో కలిసే డ్రైనేజీ కాలువలు పూడి పోవడంతో దీవికి ముప్పు ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ లోని చినగొల్లపాలెం ఎక్కడో లేదు. ఆ దీవిలోనే ఉంది. ఈ దీవిలో అక్కడి వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వరదలు వస్తున్నాయంటే భయం, సముద్రం పొంగుతోందంటే భయం, వాయుగుండం ఏర్పడిందంటే అక్కడి వారు వణికి పోతారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చినగొల్లపాలెం దీవికి బంగాళాఖాతం రూపంలో పెను ఆపద ముంచుకొస్తోంది. ఆరువేల ఎకరాల పైచిలుకు భూభాగం మూడు వైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం నాలుగు వైపులా నీటితో నిండి ఉన్న చినగొల్లపాలెం దీవి త్వరలో అంతం కాబోతుంది. అక్కడి వారికి బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండవు. బంధువులు కావాలనుకుంటే అక్కడికి వెళతారు. లేదంటే అంతే.. సుందరమైన సహజ సిద్ద అందాలకు కొదవలేని దీవి ఇప్పుడు ప్రమాదపు కోరల్లో చిక్కుకుని సాయం కోసం దీనంగా ఎదురు చూస్తోంది.
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దుగా ఉంటూ రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతూ భౌగోళికంగానే కాక జీవన విధానంలోనూ బిన్న సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం చినగొల్లపాలెం. 1962 కు ముందు వరకు దీవి మూడు వైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962లో కొల్లేరు పరివాహక ప్రాంత ముంపు నీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మద్య కాలువ (కొత్త కాలువ) తవ్వకం జరిగింది. దీంతో అప్పటి నుంచి ద్వీపకల్పం మానవ నిర్మిత దీవిగా మారిపోయింది. నాటి నుంచి దాదాపు అర్ధ శతాబ్ధం పాటు దీవికి బాహ్య ప్రపంచంతో రవాణా సంభందాలు పూర్తిగా తెగిపోయాయి. తరువాత కాలంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు గ్రామాల మద్య ఉన్న ఉప్పుటేరుపై వారది నిర్మించారు. దీని నిర్మాణంతో దీవి వాసులకు రవాణా సంభందాలు పునరుద్దరించ బడ్డాయి.
ప్రమాదం అంచున దీవి....
ఆరువేల పైచిలుకు విస్తీర్ణంతో పాటు పదివేల జనాభా కలిగిన దీవి వైపు సముద్రం శరవేగంగా దూసుకువస్తూ ముంచేందుకు సిద్దమయింది. ప్రస్తుతం దీవిని రెండు వైపుల నుంచి సముద్రం పెద్ద ఎత్తున కోతకు గురిచేయడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళలనలు నెలకొన్నాయి. గతంలో ఏటిమెండి వద్ద ఉన్న పాత కాలువ ముఖద్వారంతో పాటు ప్రస్తుతం కొత్త కాలువ ముఖద్వారం సైతం పూడుకు ఆటు పోటుల సమయంలో సముద్రపు నీరు దీవి మీదకు నేరుగా వస్తోంది. అదే కాలువల్లో పూడిక తీసి ఉంటే సముద్రపు నీరు దీవిపైకి కాకుండా కాలువల్లోకి వళ్లి తిరిగి సముద్రంలోకి లాక్కుంటుంది. కోత కారణంగా దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా సరుగు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసి పోయినట్లు స్దానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే త్వరలోనే దీవిని సముద్రం మింగేయడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు.
రక్షణ చర్యలకై విన్నపం....
జిల్లాలోనే ప్రసిద్ది గాంచిన పర్యాట కేంద్రంగా విలసిల్లే దీవి మనుగడ ప్రమాదంలో ఉంటే దీని నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని దీవి వాసులు విన్నవించుకుంటున్నారు. 1986లో ఏటిమెండి పాత కాలువ ముఖద్వారం వద్ద పూడిక తీయించారు. దీంతో కొంత కాలం పాటు సముద్రం కోతను నివారించ కలిగినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. తరువాత తిరిగి మరోసారి 2004–06 సంవత్సరాల మధ్య కాలంలోనూ ఇక్కడ పూడిక తీత పనులు చేయగా కొంత మేర కోత ఆగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు మరింత వేగంగా కోత కోస్తున్నట్లు స్దానికులు పేర్కొంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సైతం ఉన్నతాధికారులు, పాలకులు కోత ప్రాంతాన్ని క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలు తయారు చేశారు. త్వరలో దీవి కోత నివారణకు రక్షణ చర్యలు చేపడతామని హామీ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దీవి కోత నివారణకు సముద్ర ముఖద్వారాలు పూడిక తీయడంతో పాటు శాశ్వత పరిష్కారంగా కోత ప్రదేశంలో రాతి కట్టడం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామ మాజీ సర్పంచ్ కొక్కిలిగడ్డ బాపూజి, మాట్లాడుతూ సముద్రం వేగంగా దీవిని కోతకు గురిచేస్తుంది. దీనికి ప్రదాన కారణం దీవికి తూర్పు, పశ్చి మదిక్కున ఉన్న పాత, కొత్త కాలువలు పూడి పోవడమే. సముద్ర ముఖద్వారం వద్ద పూడికను తీయకపోతే దీవికి పెను ప్రమాదమే.
చినగొల్లపాలెంకు చెందిన కూనసాని సత్యన్నారాయణ మాట్లాడుతూ ఎంతో హాయిగా ఇక్కడ బతుకుతున్నాం. అయితే ఎపుడు సముద్ర పోటు అధికంగా వచ్చి గ్రామాన్ని సముద్రం కోతకు గురిచేస్తుందో అనే భయం మాత్రం నిత్యం మాలో ఉంది. ఈ భయాన్ని ప్రభుత్వం పోగొట్టాలంటే కాలువల్లో పూడికలు తీయించి సముద్రపు నీరు కాలువల్లోకి వచ్చి వెనక్కి తీసుకునే విధంగా తయారు చేయాలి. అప్పుడే మాకు శాంతి.