వివేకా హత్యలో జగన్ హస్తం ఉందా!
వివేకానందరెడ్డి హత్యలో సీఎం జగన్ హస్తం కూడా ఉందంటూ ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇప్పుడు తనను చంపడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రేవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యాడు. జై భీం కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పులివెందులలో సీఎం జగన్ ప్రత్యర్థిగా పోటీ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులుగా ఆయన సంచలన విషయాలు బహిర్గతం చేస్తున్నారు. వివేకా హత్యలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటు సీఎం వైఎస్ జగన్, ఆయన భార్య భారతి హస్తం కూడా ఉందని, ఈ విషయం వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు బాగా తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రమంతా ప్రకంపనలు సృష్టించాయి. కేసు విచారణ ముందుకు సాగకపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆరోపించారు.
జగన్ గెలిస్తే లక్షల హత్యలు
అనంతరం తన ప్రాణాలకు ఏ ప్రమాదం జరిగినా దానికి జగనే బాధ్యుడని వెల్లడించారు దస్తగిరి. ‘‘నేను చేసింది తప్పు. అందుకే పశ్చాత్తాపంతో అప్రూవర్‌గా మారాను. ఇప్పుడు మరోసారి జగన్ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా హత్యలు జరుగుతాయి. వాటి సంఖ్య లక్షల్లో ఉంటుంది. కాబట్టి తమ ఓటును ప్రతి ఓటర్ కూడా బాగా ఆలోచించుకుని వేయాలి. నేను, చంద్రబాబు, షర్మిల, సునీత రెడ్డి కలిసి పోరాటానికి దిగామని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని ప్రొద్దుటూరులో జగన్ వ్యాఖ్యానించడం నవ్వు తెప్పిస్తోంది. నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉంది. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడాను, ఏం మాట్లాడాను అన్న విషయాలు తెలుసుకోవచ్చు. నాలో నీతి, నిజాయతీ ఉన్నాయి కాబట్టే పారిపోలేదు’’ అని దస్తగిరి వివరించారు. అంతేకాకుండా తాను పోలీసులకు అందించిన సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశారని, రానున్న రోజుల్లో వివేకా హత్య కేసులో మరెన్నో నిజాలు తేటతెల్లమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
నాకేమైనా జగనే బాధ్యుడు
వివేకానందరెడ్డి కేసులో హంతకులు మీరా నేనా అన్న విషయాలను కోర్టు నిర్ణయిస్తుందని, అది నిర్ణయించడానికి మనమెవరిమి అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి దస్తగికి వ్యాఖ్యానించారు. సునీతతో నాకు ఒప్పందం ఉందని అవినాష్ నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం. నిరూపించలేకపోతే జైలుకు వెళ్లడానికి అవినాష్ రెడ్డి సిద్ధమా. నా ఛాలెంజ్ స్వీకరించడానికి అవినాష్ రెడీనా’’ అంటూ మండిపడ్డారు దస్తగిరి. అనంతరం తన ప్రాణాలకు సీఎం జగన్‌తో ప్రమాదం ఉందని, తనకు ఏమైనా అందుకు జగనే బాధ్యులని ఆరోపించారు. ‘‘పులివెందులలో జై భీం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా. కానీ పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు.పైగా ఈనెల 25 నామినేషన్ వేయడానికి రెడీ అవుతుండగా అదే రోజున సీఎం జగన్ కూడా నామినేషన్ వేస్తున్నారని, కాబట్టి నేను వేయడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం’’అని ప్రశ్నించారు. అంతేకాకుండా సీఎం జగన్ ఇంటికి తన ఇల్లు దగ్గరగా ఉంటుందని, అందువల్ల తాను జై భీమ్ పార్టీ పోస్టర్లు పెడితే వాటిని వెంటనే తొలగించేస్తున్నారని ఆరోపించారు.
నన్ను చంపడానికి ప్లాన్
అప్రూవర్‌గా మారి తాను అన్ని నిజాలు చెప్పేస్తున్నానని తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దస్తగిరి. ‘‘నన్ను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి. అందుకే నాపై దాడికి కూడా ప్రయత్నాలు జరిగాయి. రాళ్ల దాడి చేయడానికి కూడా యత్నించారు కొందరు. అందులో భాగంగానే నామినేషన్ వేయడానికి వెళ్లే క్రమంలో ర్యాలీలోకి చొరబడి దాడి చేయాలని వైసీపీ కార్యకర్తలు కుట్రలు చేస్తున్నారు’’అని కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజులుగా దస్తగిరి వార్తల్లో తెగ నిలుస్తున్నారు. తన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్రమంతా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారడం వల్ల ఆ కేసుపై దస్తగిరి చేస్తున్న వ్యాఖ్యలు అధికంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అతడికి పోలీసులు భద్రత కల్పించారు. అతి త్వరలోనే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయనున్న క్రమంలో అతనికి అందిస్తున్న భద్రతను మరింత అధికం చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా దస్తగిరికి ఫోర్ ప్లస్ ఫోర్, టెన్ ప్లస్ టెన్ భద్రత కల్పిస్తున్నారు పోలీసులు.
దస్తిగిరి వ్యాఖ్యల్లో నిజమెంత
వివవేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు సీఎం జగన్, ఆయన భార్య భారతి హస్తం కూడా ఉందన్న దస్తగిరి వ్యాఖ్యల్లో నిజమెంతా అంటే నిపుణులు పెదవి విరుస్తున్నారు. అప్రూవర్ అయినంత మాత్రాన దస్తగిరి చెప్పిన ప్రతి విషయం కీలకంగా మారదని, కాకపోతే వాటిని పోలీసులు పరిగణనలోకి తీసుకుంటారే తప్ప సాక్ష్యాలు భావించరని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తూ జగన్‌పై పోటీకి సిద్ధమవుతున్నా క్రమంలో దస్తగిరి వ్యాఖ్యలను కేవలం రాజకీయ మైలేజీ కోసమే చేసిన వ్యాఖ్యలుగా కూడా చూడొచ్చని, ఏది ఏమైనా ఇప్పటికే షర్మిల, సునీత రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు దస్తగిరి చేసిన వ్యాఖ్యలు కాస్తంత తోడ్పాటును కల్పించే అవకాశాలు ఉన్నాయని, జగన్‌పై వ్యతిరేకతలు పెంచడానికి కూడా అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పోలీసులు ముందుగా దస్తగిరి మాటల్లో నిజం ఎంత వరకు ఉందన్న అంశాన్ని పరిశీలించాని వారు అభిప్రాయపడ్డారు.
దస్తిగిరి చెప్తే పరిపోతుందా
వివేకా హత్యలో జగన్ హస్తం ఉదంటూ దస్తగిరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే హత్య చేసినట్లు ఒప్పుకున్న హంతకుడు చెప్పిన మాటలను నమ్మే అంతటి పిచ్చి వాళ్లు కాదు ఆంధ్ర ప్రజలు’’ అని వారు వ్యాఖ్యానించారు. అయినా వివేకా కేసులో జగన్ హస్తం ఉందని చెప్పాల్సింది పోలీసులు, న్యాయస్థానం అని దస్తగిరి కాదని వారు మండిపడుతున్నారు. వివేకా హత్యకు జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని వారు పునరుద్ఘాటిస్తున్నారు.