పాఠశాలలను ఐదు రకాలుగా మార్చనున్నారు. ఇకపై ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండవు. బేసిక్‌ ప్రైమరీలో ప్రీప్రైమరీ-1, 2 తో పాటు 1 నుంచి 5 వరకూ క్లాసులు ఉంటాయి.


విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు, కొత్తగా మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు, ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్‌, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లకు ప్రత్యామ్నాయాలు ఎలా ఉంటే బాగుంటుందనే అంశాలపై అన్వేషణ జరుగుతోంది. అందులో భాగంగానే 53 మండలాలలో ప్రైవేట్ జూనియర్ కళాశాల లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే హైస్కూల్ ప్లస్ లను మూసి వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పొచ్చు. ప్రాథమిక పాఠశాలలకు అంగన్‌వాడీలకు అనుసంధానం చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈ ప్రతిపాదనలు రూపొందించింది.

నూటికి 50 శాతం మంది విద్యార్థులకు ‘అక్షర’ చదవడం, రాయడం రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఐదో తరగతి పాసైన విద్యార్థికి తన పేరు తాను రాసుకునేందుకు రావడం లేదు. ఉదాహరణకు ప్రకాశం జిల్లా సి కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన గోరంట్ల వెంకట లక్ష్మీ శివ కు తన పేరు రాసుకోవడం చేతకావడం లేదు. ఈ విషయమై అక్కడి స్కూలు టీచర్ ను ప్రశ్నిస్తే వాడు స్కూలుకు రాడు సార్.. మిమ్మల్ని ఏమి చేయమంటారు. చదువు వచ్చినా రాకపోయినా పై క్లాస్ కు ప్రమోట్ చేయాల్సిందే. లేదంటే మాకు పనిష్ మెంట్ ఉంటుంది అన్నారు. రాష్ట్రంలోని విద్య పరిస్థితులపై‌ వాస్తవ కారణాలకు విద్యా శాఖ ఏం సమాధానం చెబుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలోని విద్యావేత్తలు, విద్యారంగంలో నిష్ణాతులు, విద్యార్థి తల్లిదండ్రులతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే సమంజసంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (నెం: 6/2022) రాష్ట్ర అధ్యక్షులు నరహరి మాట్లాడుతూ ప్రభుత్వాలకు ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంటుందని, అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి నుంచి కూడా కొన్ని సూచనలు, సలహాలు వస్తాయని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేందుకు వీలు ఏర్పడుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల పాఠశాలలు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా వ్యవస్థలో అవసరం లేని మార్పులు చేస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. విద్యార్థులకు చదువు రావాలి. ప్రభుత్వాలు మారగానే పాఠశాలల్లో మార్పులు చేసినంత మాత్రాన చదివే విధానంలో మార్పులు వస్తాయా.. అంటే అదేమీ లేదని ఈ మార్పులు చెబుతున్నాయి. ఒకరు ఒక విధానాన్ని రద్దు చేస్తే మరొకరు అదే విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఇందులో తప్పెవరిది, ఒప్పెవరిదనేది విద్యా వేత్తలు నిర్ణయించాలి.

ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగించింది. అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్‌ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ప్రతిపాదనల్లో వీటి గురించి పాఠశాల విద్యాశాఖ ప్రస్తావించలేదు.

ఇక కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ-1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు.

మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగతులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటారు.

హైస్కూల్‌ ప్లస్‌లకు ప్రత్యామ్నాయంగా బాలికలకు ఇంటర్‌ విద్య అందించే ఉద్దేశంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కాలేజీల విధానం తేవాలని భావిస్తున్నారు.

జీవో 117 గురించి తెలుసుకుందాం...

పాఠశాలల నిర్మాణం, టీచర్ల కేటాయింపుపై గత ప్రభుత్వం జీవో 117 తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది.

4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. ఫలితంగా 2,43,540 మంది విద్యార్థులు బడి మారిపోవాల్సి వచ్చింది. ఈ కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 12,247కు పెరిగింది. అనేక మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు మారిపోయారు. 2,073 ప్రాథమికోన్నత పాఠశాలలు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను కోల్పోయాయి.

ఆ తరగతుల విద్యార్థులు తిరిగి వెనక్కి...

గత ప్రభుత్వంలో విలీనం కారణంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేరిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో 1,43,410 మందిని తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తీసుకొస్తారు. ఫౌండేషనల్‌ స్కూల్‌లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ను, బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌లో ఒక ఎస్జీటీని కేటాయిస్తారు. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం ప్రకారం కేటాయింపులు చేస్తారు. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండే వాటిని మోడల్‌ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించి ప్రతి తరగతికి ఒక టీచర్‌ చొప్పున కనీసం ఐదుగురిని, విద్యార్థుల సంఖ్య 120 దాటితే ప్రధానోపాధ్యాడి పోస్టును కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న ప్రాంతాల్లో 45 నుంచి 50 మంది విద్యార్థులే ఉన్నా మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా పరిగణిస్తారు.

Next Story