జనసేన ఎమ్మెల్యేలు విజయవాడలోని మినర్వ గ్రాండ్ లో రహస్య భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ లను మనపై ఉసిగొలుపుతోందనే ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వంలో ‘కీ’ రోల్ పోషిస్తున్న పార్టీ జనసేన. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎంపీలు ఉన్నారు. అయినా ఎమ్మెల్యేలు, ఎంపీల మాట అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ విషయాలు చర్చించింది ఎవరో కాదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలే. అసెంబ్లీ ముగిసిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ డిన్నర్ ఇచ్చారు. ఏ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు వరకు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం ఇచ్చిన విందులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా వేరు వేరుగా కూర్చుని అక్కడ సరదాగా మాట్లాడుకున్నారు.
జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు?
కూటమి ప్రభుత్వంపై జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకు కూటమి ప్రభుత్వమే తప్ప హవా అంతా తెలుగుదేశం పార్టీనే నడుపుతోందని జనసేన వారిలో చర్చ జరిగింది. తమ నియోజకవర్గాల్లో అధికారులు సరిగా తమను పట్టించుకోవడం లేదని, టీడీపీ ఇన్చార్జ్ లకు ఇచ్చే విలువ కూడా ఇవ్వడం లేదనే అసంతృప్తి వారిలో ఉంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాటకు తప్ప తమకు అసలు విలువ లేకుండా పోయిందనే ఆవేదనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల అధికారులు ఆయన చెప్పిన పనులను చేస్తున్నారని, అది కూడా అప్పుడప్పుడు తానంటే ఏంటో నిరూపించుకుంటూ వస్తున్నందున పార్టీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు తలవంచక తప్పటం లేదనే చర్చ కూడా ఎమ్మెల్యేల్లో జరిగింది.
తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రాజకీయంగా అనుభవం ఉన్న వారు కావడం, గతంలో శాసన సభ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల అధికారులు కాస్త చెప్పింది చేస్తున్నారు. అలాగని ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వేలు పెట్టకుండా ఉందా? అంటే అదేమీ లేదు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారు తమ పనులు చాలా స్వేచ్ఛగా చేయించుకో గలుగుతున్నారు. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గంలో ఇబ్బందులు పడక తప్పటం లేదనే చర్చ కూడా నడిచింది. లక్షల టన్నుల్లో సివిల్ సప్లైస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఈ రవాణా వ్యవహారంలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వారే ఉన్నందున వారిని ఏమీ చేయలేని పరిస్థితులు మనోహర్ కు ఏర్పడ్డాయి. సాధారణ కేసులు పెట్టడం, ఫైన్ లు కట్టించుకుని వదిలేయడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మంత్రికి ఎంతటి విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సినిమా టోగ్రఫీ కూడా ఉంది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నుంచి ఎన్నికైన దుర్గేష్ పై ఆ నియోజకవర్గం వారే కాకుండా పార్టీలోని చాలా మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ పనులు దుర్గేష్ ద్వారా ఈజీగా చేయించుకోవచ్చని, ప్రతి విషయంలోనూ పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం ఉండదని, ఇక మనకు దుర్గేష్ మాత్రమే దిక్కని చాలా మంది జనసేన నాయకులు భావించారు. అయితే దుర్గేష్ పరిస్థితి కూడా అంత ఆశా జనకంగా ఏమీ లేదు. ఆయన నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు హవా కొనసాగుతోంది. శేషారావు మాజీ శాసన సభ్యులు కావడం, పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగిందని చెప్పొచ్చు. కందుల దుర్గేష్ మంచి వాడైనప్పటికీ తెలుగుదేశం పార్టీని కాదని అడుగులు ముందుకు వేసే పరిస్థితులు లేవని జనసేనలో చర్చ జరుగుతోంది.
టీడీపీ ఇన్ చార్జ్ లదే హవా
మిగిలిన 18 నియోజకవర్గాల్లో గెలిచిన జనసేన ఎమ్మెల్యేల కంటే తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న నియోజకవర్గ ఇన్ చార్జ్ లకే విలువ ఎక్కవ ఉందని జనసేన వారు పేర్కొంటున్నారు. తమను కూటమిలో నాయకులుగానే చూస్తున్నారని, ప్రభుత్వంలో భాగస్వాములుగా చూడటం లేదనే అసంతృప్తి జనసేన ఎమ్మెల్యేల్లో ఉంది. లోకేష్ ద్వారా చెప్పించుకుని తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ చార్జ్ లు తమను పక్కకు నెడుతున్నారని జనసేన ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
అసెంబ్లీ ముగియడానికి ముందు రోజు ఎమ్మెల్యేల సమావేశం
అసెంబ్లీ జరిగిన రోజుల్లో ఎమ్మెల్యేలు జిల్లాల వారీగా మంత్రులతో ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో కలిసి మాట్లాడుతూ వచ్చారు. అన్ని పార్టీల్లోనూ ఇదే జరుగుతూ వచ్చింది. అలాగే జనసేన పార్టీలోనూ మంత్రుల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లి మాట్లాడి వస్తూ వచ్చారు. అసెంబ్లీ ఈనెల 20వరకు జరిగి ఆ తరువాత వాయిదా పడింది. ముందు రోజు అంటే 19వ తేదీన విజయవాడ బందర్ రోడ్డులోని హోటల్ మినర్వ గ్రాండ్ లో ప్రత్యేకించి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. పార్టీ పనితీరు, ప్రభుత్వంలో పార్టీకి ఉన్న విలువ. ప్రజలకు చేరువ కావాలంటే అధికారుల సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పెద్దగా పట్టుబట్టి సాధించేది ఏదీ ఉండదని, అలాగని పట్టీ పట్టనట్లు ఉంటే రానున్న రోజుల్లో ప్రజలకు, అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులకు అలుసయి పోతామనే భావన చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు.
ప్రతి విషయంలోనూ లోకేష్ అడ్డుపడుతున్నారా?
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు అధికారులు ఇచ్చే విలువ అక్కడి ఎమ్మెల్యేలకు ఇవ్వటం లేదని, అందుకు మంత్రి లోకేష్ పధాన కారణమని చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. లోకేష్ జోక్యం చేసుకోవడం వల్లే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా మనకు గుర్తింపు తగ్గుతోందని, అదే సమయంలో టీడీపీ ఇన్ చార్జ్ విలువ పెరుగుతోందనే ఆవేదన పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ దృష్టికి మనం ముఖ్యమైన అంశాలు తీసుకుపోలేకపోతే పార్టీ రానున్న రోజుల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చారు.