
అలకలు-బుజ్జగింపులు ,తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి
ఆశావహులు అలిగారు..మంత్రివర్గ విస్తరణ చిచ్చు
హమ్మయ్య రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అయిపోయింది. అందరినీ సంతృప్తి పరిచామని తాపీగా వుండే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లో కనిపించడం లేదు. ఇంతకాలం మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూసిన కొందరు సీనియర్లు, అటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే అలకపాన్పు ఎక్కారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు. కాంగ్రెస్ అథిష్టానం పెద్దలకూ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వారి ఇండ్లకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉరుకులు పరుగులు పెట్టారు.మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. ఎన్నో నెలలుగా ఊరిస్తూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తి చేశామన్నట్లుగా ముగ్గురితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించింది. సోషల్ ఇంజనీరింగ్ కు పెద్దపీట వేశామని, మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంది. విస్తరణలో కొత్త మంత్రులుగా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మాదిగ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని అయిపోయిపోయిందనిపించారు.
అలకబూనిన సీనియర్ నేతలు
తెలంగాణ మంత్రివర్గ వస్తరణ జరుగుతుందన్న వార్తలు వెలువడిన రోజు నుంచే కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. మంత్రివర్గంలో వున్న ఆరు ఖాళీలకు గాను అధిక సంఖ్యలో ఆశావహులు తయారయ్యారు. అన్ని సామాజిక వర్గాల నుంచి పలువురు పోటీ పడినా, రెడ్డి సామాజిక వర్గ నేతల వత్తిడి ,పైరవీలు పార్టీ అధిష్టానానికి మొదటినుంచి పెద్ద తలనొప్పిగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌లు కూడా తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదట్నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ వీరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వారికి మొండి చేయి చూపింది. మహిళా కోటాలో మంత్రిపదవి కోసం ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ప్రయత్నించారు. దీంతో వీరంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.
మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ వెళ్ళి, ఆయనతో సంప్రదింపులు జరిపారు. సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డి సేవలను కాంగ్రెస్ పార్టీ తప్పక వినియోగించుకుంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. భవిష్యత్ లో మంచి అవకాశం ఇస్తామని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. అయితే తనకు ముందు నుంచి హామీ ఇచ్చి అథిష్టానం మోసం చేసిందంటున్న సుదర్శన్ రెడ్డి తనను కలవడానికి ఎవరూ రావొద్దని చెప్పారు.
అనంతరం ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని సంప్రదించడానికీ పీసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఆయన సోదరుడు, ప్రస్తుత మంత్రి వెంకట్‌రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమవుతుందని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడంతో రాజగోపాల్ రెడ్డి కి అవకాశం లేకుండా పోయింది.
మరోపక్క గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రంగారెడ్డి జిల్లా కు ప్రాతినిధ్యం కల్పించాలని అథిష్టానం కు గతంలో లేఖ రాయడం కూడా కలకలం రేపింది. దాంతో మంత్రి పదవి ఆశించి భంగపడిన మల్ రెడ్డి రంగారెడ్డి మీడియా సమావేశం పెట్టి తన అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సిద్దమయ్యారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు మల్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత సభాపతి ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇచ్చే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తోంది.
సామాజిక వర్గాలవారీగా మంత్రుల సంఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలుపుకుని మంత్రివర్గంలో నలుగురు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఒకరు కమ్మ , మరొకరు బ్రాహ్మణ ,మరొకరు వెలమ సామాజిక వర్గం. మొత్తం మీద ఓసీ నుంచి 7గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క, దామోదర రాజ నరసింహ ఉన్నారు. వీరికితోడు ఇప్పుడు వివేక్, అడ్లూరి లక్ష్మణ్ చేరికతో వీరి సంఖ్య 4కు చేరింది. వీరిలో ఇద్దరు ఎస్సీ మాల, మరో ఇద్దరు మాదిగ సామాజికవర్గానికి చెందినవారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు బీసీ ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం పాత వాళ్లు ఇద్దరు , కొత్తగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు దక్కడంతో బీసీ మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. ఆదివాసీల సామాజిక వర్గానికి చెందిన సీతక్క ఒక్కరే ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. లంబాడీలకు అవకాశం కల్పించకపోవడంతో.. వారిని సంతృప్తి పరిచే విధంగా రామచంద్రునాయక్ కు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికి మంత్రివర్గంలో 15 మంది వుండగా మరో ముగ్గురిని తీసుకునే అవకాశం వుంది. మరి రెండో దఫా విస్తరణ ఎప్పుడో, ఈ అసమ్మతి తీరేది ఎన్నడో చూడాలి