ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక అభినవ కృష్ణదేవరాయలు!
x

ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక అభినవ కృష్ణదేవరాయలు!

కర్ణాటక ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రం పవన్ కల్యాణ్ ను ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదాంకితుడుగా ప్రకటించింది


ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇకపై అభినవ కృష్ణ దేవరాయ.. ఇదేదో ఆషామాషీ సంస్థో, మరేదైనా పేరు కోసం పాకులాడే పనో కాదు. సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రం ఇచ్చిన బిరుదు. పవన్ కల్యాణ్ ను ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదాంకితుడుగా ప్రకటించింది.

కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ ఆదివారం సాయంత్రం దర్శించారు. పర్యాయ పుట్టిగె శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ (Sugunendra Teertha Swamiji) ఆశీర్వచనం ఇచ్చారు.

‘బృహత్‌ గీతోత్సవ’ కార్యక్రమంలో పర్యాయ పుట్టిగె శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ పవన్‌కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ (Abhinava KrishnaDevaraya) అనే బిరుదుని ప్రదానం చేశారు. పవన్‌ కల్యాణ్‌ సేవలను, ధర్మ నిబద్థతను గుర్తించి ఆయనకు ఈ బిరుదు అంకితం చేశారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...
ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ హిందూ ధర్మం, సనాతనధర్మం, భగవద్గీత ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ‘సనాతన ధర్మం ఎప్పటికీ మూఢ నమ్మకానికి ప్రతీక కాదు. అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి. ఇతరులు మన ధర్మం మీద దాడి చేస్తున్నారనే కంటే ముందు మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని, ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలి. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. పుట్టిగె మఠం చేస్తోంది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు. అది సంస్కృతిక, నాగరికత బాధ్యత. ‘ధర్మో రక్షతి రక్షితః’మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది’ అని పవన్ అన్నారు.

సనాతన ధర్మాన్ని తప్పుగా చూపి, అవమానిస్తున్న సమయంలో మౌనం సరైంది కాదన్నారు పవన్‌ కల్యాణ్‌. ఈ ధర్మ వాతావరణంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన ఆలోచనాపరులు, భక్తులను కలవడం వసుదైక కుటుంబం’ అనే భారత ఆత్మను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ మేరకు భారత రాజ్యాంగం లిఖిత ప్రతిలో ఆదేశిక సూత్రాలు ఉన్న పేజీపై శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్న దృశ్యాన్ని చిత్రించడాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.
‘ఇది కేవలం అలంకరణ కోసమో, యాదృచ్ఛికంగానో వేయలేదని, సామాజిక న్యాయం, బాధ్యత, సమానత్వం, సంక్షేమం, ధర్మ పాలన ఇవన్నీ రాజ్యాంగం తెలిపే విలువలు అని అని బోఽధించేందుకే గీతాసారం ఉపదేశించే చిత్రాన్ని అక్కడ ఉంచారని తెలిపారు. ధర్మం నైతిక దిక్సూచి అయితే, రాజ్యాంగం న్యాయ దిక్సూచి అని, రెండింటి లక్ష్యం న్యాయం, శాంతి, కరుణతో కూడిన సమాజమే అని పవన్‌ అన్నారు.
మంత్రిగా తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తానని, ఓట్లు వస్తాయా, రావా అన్నది రెండో విషయమని చెప్పారు. ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే సత్యం పక్షానే నిలబడాలని గీత చెప్పిందన్నారు. వ్యక్తిగత లాభం కంటే రాష్ట్ర ప్రయోజనం ప్రధానం అని భావించి 21 సీట్లకు మాత్రమే పోటీ చేశానన్నారు పవన్ కల్యాణ్.
Read More
Next Story