‘మా ఫార్ములా అదే’.. వైసీపీపై పవన్ ప్రశ్నల వర్షం
x
Source: Twitter

‘మా ఫార్ములా అదే’.. వైసీపీపై పవన్ ప్రశ్నల వర్షం

తాను ప్రజాగళం సభకు చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.


‘‘నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’’ఇది రాసింది మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ అని జనసేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అలాంటి మరెందరో మహానుభావులు పుట్టిన ఈ నేల వైసీపీ హయాంలో అవినీతి మయమైపోయిందని తణుకు ప్రజాగళం సభలో పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడున్న పౌరసరఫరాల శాఖ మంత్రి.. ఓ రైతు తన ధాన్యం తడిసిపోయిందని అడిగితే ఛీత్కారంగా మాట్లాడారని, అలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పవన్ కోరారు. పార్టీలు కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకుంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ఇదే అంశాన్ని తాము 2014 నుంచి చెప్పున్నామని గుర్తు చేశారు.
ప్రశ్నిస్తే మంత్రి డ్యాన్సులు
‘‘పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిందా అని అడిగితే నీటిపారుదల శాఖ మంత్రి డ్యాన్సులు చేస్తున్నారు. పోలవరం పునరావాసం గురించి ప్రశ్నిస్తే.. అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ మరో పాట అందుకుంటారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే బూతులు తిట్టేవాళ్లు, డ్యాన్సులు చేసే వాళ్లు, దాడులు చేసేవాళ్లు వైసీపీ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉంటున్నారు. ఇక రాష్ట్రం ఏం బాగుపడుతుంది. దీన్ని మార్చే సత్తా మీ చేతుల్లోనే ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో మీరేంటో నిరూపించుకోండి’’అని పవన్ పిలుపునిచ్చారు.
చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు
‘‘మేము తణుకుకు మీరు కొట్టే చప్పట్లు కోసం రాలేదు. మీకు మేము ఉన్నాం అన్న భరోసా కల్పించడానికి వచ్చాం. మీకు మేలు జరగాలని ఆలోచించి మేము ఎంతో తగ్గాం. మీకోసం జనసేన ఎంతో త్యాగం చేసింది. తణుకులో మా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితులకు అనుగుణంగా సీటును మార్చుకున్నాం. ఓట్లు చీలకూడదన్నదే మా ప్రధాన ఉద్దేశం. మా అన్న నాగబాబు తాను పోటీ చేయాల్సిన అనకాపల్లి సీటును కూడా వదులుకున్నారు. ఇప్పుడు మా చేతుల్లో ఉన్నది కొంతే.. మీ చేతుల్లో ఉన్నది అద్భుత ఆయుధం. దాన్ని సరైన విధంగా వినియోగించండి’’అని అన్నారు పవన్ కల్యాణ్.
మా ఫార్ములా అదే
‘‘వైసీపీ పాలనలో జరిగిన తప్పులకు వ్యతిరేకంగా జనసేన రోడ్లపైకి వచ్చి పోరాడింది. అందరూ పేదలు, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడతారు. కానీ ఎవరూ మధ్యతరగతి గురించి పట్టించుకోరు. అందుకే ఈ సభాముఖంగా మధ్యతరగతిని గుర్తించాలని చంద్రబాబును కోరుతున్నాను. ఏపీలో 10 పాయింట్ల ఫార్ములాతో ప్రజల్లోకి వస్తున్నాం. చిట్టచివరి పొలానికి కూడా నీరందాలి. అందరికీ న్యాయం జరగాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇవే మా లక్ష్యాలు. అసెంబ్లీకి వచ్చిన వెంటనే క్లిష్టమైన అంశమైనా సీపీఎస్‌పై మాట్లాడతా. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీపీఎస్‌ను పరిష్కరించాలని కూటమిని కోరుతున్నా’’అని పవన్ వెల్లడించారు.
పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులు
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘం.. పవన్‌కు నోటీసులు జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం.. పవన్ కల్యాణ్‌కు ఈ నోటీసులు పంపింది. తమ నోటీసులకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని ఈసీ కోరింది.
Read More
Next Story