విజయవాడ కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి ఆలయానికి భారీగానే ఆదాయం లభిస్తోంది. విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు.


శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ ఐదో రోజైన సోమవారం భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మ వారిని దర్శనం చేసుకోవచ్చు. హిందూ సంప్రదాయాల్లో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన అలంకారంగా భక్తులు భావిస్తారు. ఈ అలంకారంలో ఉన్న దుర్గాదేవి అనుగ్రహం పొందడం కోసం భక్తులు అమ్మ వారిని ఆరాధించడం అనేది ప్రధానంగా ఉంటుంది. శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదిగా చెబుతారు.

చండీదేవీ మహా శక్తి స్వరూపిణి. ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింప చేసే ప్రయత్నం చేస్తారు. దేవి పూజను ఏకాగ్రతతో భక్తితో చేస్తే అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పూజారి విశ్వాసంతో చేసే మహాచండీ అలంకార పూజ సాధకునిలో ఉన్న దుర వ్యవస్థలను తొలగించి, జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందనే నమ్మకం ఉందని భక్తులు విశ్వసిస్తారు.
దుర్గ సప్తశతి లేదా దేవి మహాత్మ్యా పౌరాణిక కథ అనుసరిస్తారు. ఈ కథ ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను, లోకాలను హింసిస్తూ ఉంటాడు. దేవతలు శక్తులను ఇవ్వాలని ఆరాధిస్తాడు. ప్రార్థనలకు స్పందనగా పరమ శక్తి రూపం అయిన ఆది శక్తి ప్రధాన దేవతలైన బ్రహ్మ, విష్ణు, శివ శక్తులను సమన్వయంతో చండీ రూపంలో అవతారం ఎత్తింది. చండీదేవి మహిషాసురినితో పాటు ఇతర రాక్షసులను సంహరించి లోకాల్లో ధర్మాన్ని, శాంతిని ప్రసాదించింది. ఈ కథలో ఆమె విజయం, శక్తి తత్వం అత్యంత శక్తివంతంగా ప్రతిఫలిస్తుంది. శక్తి స్వరూపిణి అయిన దేవిని పూజతో స్మరిస్తూ భక్తులను తమ లోపలి దుర వ్యసనాలను సంహరించే మహా చండీ రూపంలో అమ్మ వారిని అలంకారిస్తారు. మహాచండీ పూజలో అలంకారానికి విశేష ప్రాధాన్యత ఉంది. భక్తులు దేవి శక్తిని, ఆమె సౌందర్యవంతంగా కనిపించేందుకు వివిధ ఆభరణాలు, పుష్పాలు, వస్త్రాలతో అలంకరించడం ద్వారా ఈ పూజలో పాల్గొంటారు. అలంకారం ద్వారా భక్తి భావం మాత్రమే కాదు, శక్తి రూపాన్ని కూడా పొందుకునే అవకాశం ఉందని భక్తులు విశ్వసిస్తారు. మహాచండీ పూజలను నిశ్చలంగా ఏకాగ్రతతో చేస్తే ఆరోగ్యంతో పాటు, సంపద, శాంతి, కీర్తి పొందుతారని నానుడి.
ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులతో పోల్చితే ఆదివారం రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేకువ జామున 4 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయానికి దాదాపు 55వేల పైచిలుకు భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వేలాది సంఖ్యలో ఉన్న భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. గురువారం నుంచి ఆదివారం వరకు దాదాపు 2.80 లక్షల మంది భక్తులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.
దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ఆలయానికి ఆదాయం కూడా భారీగానే చేకూరింది. మొదటి రోజు రూ. 28 లక్షలు, రెండో రోజు రూ. 47 లక్షలు, మూడో రోజు రూ. 54లక్షలు, నాలుగో రోజు సాయంత్రం 5గంటల సమయానికి రూ. 70లక్షల ఆదాయం లభించింది. తొలి రోజు నుంచి నాలుగో రోజు సాయంత్రానికి రూ. 2 కోట్ల వరకు ఆదాయం లభించింది. ఇవి కాకుండా హుండీ కానుకలు, విలువైన నగలు కూడా దుర్గమ్మకి భక్తులు సమర్పించారు.
Next Story