
టీటీడీ ఇవో అనిల్ కుమార్ సింఘాల్
హలో ఈవో గారు, ఛలో తిరుపతి!
అంగ ప్రదక్షిణ టోకెన్లకు కొత్త విధానం, డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
హలో ఈవో గారా..
అవునండీ..
అంగ ప్రదక్షిణ టోకెన్లు ఎప్పుడిస్తారు సర్..
ఇప్పుడున్న డిప్ సిస్టమ్ మార్చాం, త్వరలో కొత్త విధానం తెస్తున్నాం.. ముందు వచ్చిన వారికి ముందు అవకాశం (First Come, First Serve) పద్ధతిలో ఇస్తాం..
శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన “డయల్ యువర్ ఈవో” కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కి ఓ భక్తుని మధ్య జరిగిన సంభాషణ అది.
ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తొలిసారి “డయల్ యువర్ ఈవో” కార్యక్రమం నిర్వహించారు. అసంఖ్యాకంగా భక్తులు ఫోన్ చేసి తమ అనుమానాలు తీర్చుకున్నారు. మరికొందరు సూచనలు, ఇంకొందరు ఫిర్యాదులు చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.
భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల సూచనల మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో పెద్ద మార్పునకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న డిప్ (Draw of Lots) విధానాన్ని రద్దు చేసి, “ముందు వచ్చిన వారికి ముందు అవకాశం” (First Come, First Serve) పద్ధతిలో మార్చనున్నాం.
ఈ నిర్ణయం 2026 ఫిబ్రవరి నెల నుంచి అమల్లోకి వస్తుంది. అంగ ప్రదక్షిణ టోకెన్లకు ఆన్‌లైన్ కోటా ఉంటుంది.
“అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్‌లైన్ కోటా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి విడుదల చేస్తాం.
భక్తులు ముందుగా బుక్ చేసుకునే విధంగా కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నాం.
ఏ సమయంలోనైనా టోకెన్ బుకింగ్‌కు పారదర్శక అవకాశం లభిస్తుంది,” అని అనిల్ చెప్పారు.
ప్రస్తుతం అంగ ప్రదక్షిణ టోకెన్లు డిప్ విధానంలో లాటరీ తరహాలో ఇస్తున్నారు. భక్తుల మధ్య ఇది అసంతృప్తిని కలిగిస్తున్న నేపథ్యంలో మార్పులు చేశారు.
తిరుచానూరులో కార్తిక బ్రహ్మోత్సవాలు..
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు)లో నవంబర్ 17 నుంచి 25 వరకు కార్తిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
దీని కోసం తిరుచానూరులో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భక్తులకు వసతి, తాగునీరు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం
శ్రీవాణి, దర్శన టోకెన్లపై కమిటీ
శ్రీవాణి దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శనం, సర్వదర్శనం టోకెన్లు వంటి అంశాలపై పునరాలోచన చేయడానికి ప్రత్యేక కమిటీని టీటీడీ బోర్డు ఏర్పాటు చేసింది
కమిటీ నివేదిక వచ్చిన తర్వాత విధానంలో మార్పులు చేస్తాం.
వైకుంఠ ద్వార దర్శనం షెడ్యూల్..
డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ విధివిధానాలు త్వరలో ప్రకటిస్తాం.
తిరుమలలో ప్రతి సంవత్సరం జరిగే ఈ పర్వదిన దర్శనం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు.
శ్రీవాణి ట్రస్టు నూతన కార్యక్రమాలు..
రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో రూ.750 కోట్ల వ్యయంతో 5 వేల భజన మందిరాలు నిర్మించబోతున్నాం.
ఇది భక్తి, సాంస్కృతిక చైతన్యాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్తుంది.
తిరుమల అటవీ ప్రాంత సంరక్షణ
టీటీడీ బోర్డు రానున్న 10 ఏళ్ల కోసం ‘గ్రీన్ తిరుమల’ ప్రణాళికను కూడా ఆమోదించింది.
దీని కింద జీవవైవిధ్య సంరక్షణ, వన్యప్రాణి రక్షణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు అమలుకానున్నాయి.
అన్నప్రసాదం, భక్తుల సదుపాయాలు..
భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం పంపిణీ వ్యవస్థలో కూడా సంస్కరణలు తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.
అన్నమయ్య భవనం, శ్రీవారి మేడ, ఇతర భోజనశాలల్లో భక్తుల ప్రవాహాన్ని అనుసరించి వేర్వేరు లైన్లు, సర్వీస్ సమయాలు ఏర్పాటు చేస్తాం.
వేంకటపాలెం ఆలయం అభివృద్ధి
అమరావతి సమీపంలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం వంటి అభివృద్ధి పనులు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభిస్తాం.
తిరుమల దేవస్థానం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, పారదర్శకతకు కూడా దోహదపడతాయి.
ఫిబ్రవరి నుంచి అంగ ప్రదక్షిణ టోకెన్ల ఆన్‌లైన్ బుకింగ్, వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు, కొత్త భజన మందిరాలు వంటివన్నీ రానున్నాయని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Next Story

