చెప్పిన సమయానికే డీజీపీ కార్యాలయానికి వెళ్లాం. కాసేపటి తర్వాత వెళ్లి పోయారని చెప్పారు. ఇదెక్కడ ప్రజాస్వామ్యమని మాజీ మంత్రి అంబటి అన్నారు.


మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను కలిసేందుకు వెళ్లారు. అంతకు ముందే డీజీపీ పీఏకి ఫోన్‌ చేసి డీజీపీ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. వారిచ్చిన సమయంలోపలే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. కానీ ఆ సమయానికి డీజీపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలను కలవలేదు. వినతి పత్రాన్ని తీసుకోవాలని కార్యాలయం సిబ్బందిని కోరారు. కానీ వారు నిరాకరించారు. వినతి పత్రాన్ని తీసుకోలేదు. అక్కడ గోడకైనా అంటిద్దామని ప్రయత్నం చేశారు. కానీ కుదరదని పోలీసులు వారించారు. దీంతో వినతి పత్రం ఇవ్వకుండానే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వెనుదిరిగారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.

అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కుట్రపూరితంగానే కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని ధ్వజమెత్తారు. వంశీని ఎందుకు అరెస్టు చేశారో కారణం పోలీసులు చెప్పడం లేదని, తప్పుడు కేసులు పెట్టి వంశీని ఇరికించే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
వంశీ అక్రమ అరెస్టు మీద డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను కలిసేందుకు ముందుగానే అపాయింట్‌మెంట్‌ తీసుకున్నామని, వారు చెప్పిన సమయానికే డీజీపీ కార్యాలయానికి వెళ్లామన్నారు. కానీ ఆ సమయానికి డీజీపీ కార్యాలయంలోనే ఉన్నారని.. కాసేపటి తర్వాత డీజీపీ వెళ్లిపోయారని అక్కడ సిబ్బంది చెప్పారని తెలిపారు. అంతేకాకుండా తమ వినతి పత్రాన్ని అక్కడ ఎవరు తీసుకోలేదన్నారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పాలనేంటో అర్థం కావడం లేదన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపైన ఉంది. తమ వినతి ప్రతాన్ని తీసుకోవడానికి ఎవరినైనా పంపుతారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలో చెప్పాలని మీడియా ముఖంగా అంబటి రాంబాబు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చి కలవకుండా, కనీసం వినతి పత్రం కూడా తీసుకోకుండా నిరాకరించడం ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా అని ప్రశ్నించారు. వంశీ అరెస్టు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
గురువారం ఉదయం ఆరు గంటలకు వంశీని అరెస్టు చేశారు. గురువారం రాత్రి లోగా వంశీని కోర్టులో హజరు పరచాలి. అలా హాజరు పరచకపోతే అది చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందకు వస్తుంది. వంశీ మీద ఫాల్స్‌ కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు చెప్పినట్లు పోలీసులు ప్రవర్తించడం సరైంది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేస్తున్న వాటిని నోట్‌ చేసుకుంటారు. దీనికి బదులు ఉంటుంది. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని. ఇప్పటికైన పోలీసు యంత్రాంగం తీరు మార్చుకోవాలి. ఆ విధంగా డీజీపీ చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు.
Next Story