గురువారం అర్థరాత్రి ఆయనను అరెస్టు చేసి విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించారు.


వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ గొండు మురళి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. ఏక కాలంలో పలు ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. శ్రీకాకుళం, విశాఖలోని ఆరు ప్రాంతాల్లో ఒకే సారి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక రోజు పాటు ఏసీపీ అధికారులు చేపట్టిన సోదాల్లో మురళీ భారీగానే ఆస్తులను కూడబెట్టుకున్నారని గుర్తించారు. 20 ఎకరాలకుపైగా భూములు, విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లో అనేక స్థలాలు, ప్లాట్లు ఉన్నాయని గుర్తించిన ఏసీపీ అధికారులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కిలో బంగార ఆభరణాలు, 11.36కేజీల వెండి వస్తువులను కూడా ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ. 70 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిగా ఉన్న గొండు మురళి ధర్మాన కృష్ణదాస్‌కు సన్నిహితుడు. 2019 నుంచి 2022 వరకు నాడు ఏపీ డిప్యూటీ సీఎంగా ధర్మాన కృష్ణదాస్‌ పని చేసిన సమయంలో ఆయన వద్ద ప్రభుత్వ పీఏగా ఈ గొండు మురళి విధులు నిర్వహించారు. ధర్మాన కృష్ణదాస్‌ వద్ద పీఏగా పని చేసిన సమయంలోనే గొండు మురళి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూటబెట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఎస్‌ భాస్కరరావుతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల ఏసీపీ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు.

Next Story