ఒంగోలులో ఢీ అంటే ఢీ
ఒకరిది మద్యం వ్యాపారం. ఇంకొకరిది రియల్ ఎస్టేట్ బిజినెస్. డబ్బులో ఎవ్వరు తీసిపోరు. ఇద్దరు అపర కుభేరులే. ఖర్చుకు వెనకడుగు వేసే చాన్సే లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద రాజకీయ చర్చకు తెర దించింది. రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఆఖరు జాబితాలో చంద్రబాబు నాయుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఖరారు చేస్తూ ఉత్కంఠకు తెరదించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఒంగోలు ఎంపిగా ఎన్నికయ్యారు. తిరిగి తనకు టికెట్ దక్కుతుందని ఆశించినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఆయనకు 2024 ఎన్నికల్లో సీటు ఇవ్వ లేదు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. విధిలేని పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు హామీ మేరకు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికి నాలుగు సార్లు ఎంపీగా మాగుంట గెలిచారు. ఒక సారి ఎమ్మెల్సీ అయ్యారు. తిరిగి ఎంపీగా పోటీలోకి దిగారు.
కాంగ్రెస్‌పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2014లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు వైఎఆర్ కాంగ్రెస్ తరఫున వైవిసుబ్బారెడ్డి ఎంపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ పోరులో వైవి సుబ్బారెడ్డి గెలుపొందగా మాగుంట ఓటమి చవి చూశారు. కొద్ది రోజుల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఒంగోలు పార్లమెంటుకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రంగంలోకి దిగారు. సీఎం వైఎస్ జగన్ కావాలనే చెవిరెడ్డిని ఒంగోలు నుంచి రంగంలోకి దింపారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా మాగుంట కుటుంబానికి అండగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ ఓటర్లను ఒక్క సారైనా తన వైపు ప్రత్యేకంగా చూసేలా చేసుకోవాలని రచించిన వ్యూహంలో భాగంగానే చెవిరెడ్డికి ఒంగోలు ఎంపి సీటిచ్చి పోటీలోకి దింపారని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. పైగా తన బంధువైయ్యుండి కూడా తాను చెప్పింది సక్రమంగా వినకుండా మాగుంటకే ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాసుల రెడ్డి పట్టుబట్టి చిరాకు తెప్పించారని, నేను ఎవరినీ పోటీలో దింపినా వారు గెలుస్తారనే ధీమాతో సీఎం జగన్ చెవిరెడ్డిని రంగంలోకి దింపినట్లు చెవిరెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం. సీఎం జగన్ సూచనల మేరకే చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీకి దిగారని అది ఆయన నిర్ణయం కాదని వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
మాగుంట బలమేంటి?
ఒంగోలు కేంద్రంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం. వ్యాపారాలను కూడా ఒంగోలు కేంద్రంగానే మానిటరింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం.
దేశంలో ఎక్కడ పర్యటించినా నెలలో కనీసం రెండు సార్లు ఒంగోలులో బస చేయడం. ఆయన ఉన్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన సౌకర్యం కలుగజేయడం.
ప్రత్యేకించి ఎంపీ తీసుకునే చర్యలను పర్యవేక్షించడానికి ఒక కార్యాలయం, సిబ్బందిని ఏర్పాటు చేయడం. ఎంపీ ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఒంగోలు వస్తారు, ఆ రోజు కార్యక్రమాలు ఏమిటి, అనే విషయాలను క్రమం తప్పకుండా విడుదల చేయడం.
ఎవరైనా వృద్దులు, పేదవారు వచ్చి సాయం చేయాలని కోరితే సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించడం.
ఒక్కో సారి వివిధ నియోజక వర్గాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు ఉచితంగానే దారి ఖర్చులు అందజేయడం.
ఒంగోలు వచ్చిన ప్రతి సారి మీడియాతో మమేకమవ్వడం. చేసిన, చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం.
నెలలో కనీసం ఒకటి రెండూ నియోజక వర్గాల్లో పర్యటించడం. అక్కడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం.
స్థానికులు ఇచ్చిన అర్జీలను రాష్ట్ర, దేశ స్థాయిలో అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ సమాచారాన్ని నేరుగా మాగుంట కార్యాలయం ద్వారా అర్జీదారులకు తెలియజేయడం. జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్పీల వద్దకు నేరుగా వెళ్లి నియోజక వర్గాల్లో ఉండే సమస్యలను వివరించి స్థానిక నాయకులను అధికారులకు పరిచయం చేసి ఎప్పుడైనా వీరు సమస్యల నిమిత్తం వస్తే సాయం చేయాలని చెప్పడం.
కార్యాలయంలో ఉన్నంత సేపు చిన్నా, పెద్దా తేడా లేMýంండా ప్రతి ఒక్కరు చెప్పేవి కూంకుశంగా విని పిఏను పిలచి నోట్ చేయించి, ఆ మేరకు తిరిగి వారికి సమాచారాన్ని తెలియజేసే వ్యవస్థను రూపొందించడం కూడా మాగుంట మార్కుగా చెప్పొచ్చు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బలం?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమే చెవిరెడ్డి బలం.
ప్రస్తుతం ఒక నియోజక వర్గం మినహా తక్కిన వాటిల్లోను వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఉండటం.
జగన్ ఫొటోతో ప్రచార రంగంలోకి దిగడం తప్ప వేరే మార్గం లేకపోవడం.
ఎన్నికల ఖర్చుల కింద ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడక పోవడం.
రాజకీయంగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ దగ్గర ఏ పనినైనా పట్టుబట్టి సాధించి చేయించుకోవడం.
తిరుపతిలో డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా పని చేయడం, టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పించడం.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ నాకు తప్పకుండా సహకరిస్తారనే నమ్మకాన్ని కలిగి ఉండటం.