అన్నా నిన్ను వెయ్యి కోట్లు అడిగానా?
జగన్‌పై షర్మిల ఫైటింగ్ పతాక స్థాయికి చేరింది. వెయ్యి కోట్లు అడిగినట్లు నిరూపిస్తే పాలిటిక్స్ వదిలేసి వెళ్లిపోతా అంటున్నారు.
కాంగ్రెస్ నేతగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డిల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. మరో సారి సీఎం జగన్‌పై షర్మిల ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలపైన మండిపడ్డారు. జగన్ విసిరేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా రూ. 1000 కోట్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సీఎం జగన్‌ను వైఎస్ షర్మిల రూ. 1000 కోట్లు అడిగినట్లు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టిపడేశారు. సీఎం జగన్‌ను తాను రూ. 1000 కోట్లు అడిగినట్లు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నిరూపిస్తే రాజకీయాలు మానేసి వెళ్లిపోతానని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. నేనింత వరకు జగన్‌ను పైసా సాయం తీసుకోలేదు. పనులు చేయమని అడగ లేదు. ఎప్పుడు ఏది అవసరం ఉంటే అలా మాట్లాడటం వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. వీరే ఊసరవిల్లులు. వీరికి అవసరమైతే తల్లీ పాదయాత్ర చేయమని అడుగుతారు. వీళ్లకు అవసరం లేకపోతే నువ్వసలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డవే కాదు అంటారు. వైఎస్ విజయమ్మను కూడా అవమానిస్తారు. వీరు ఏదిబడితే అది మాట్లాడుతారు. వీరి మాటలు ఎవరు లెక్కబెడుతారని ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ విషయంపై సోమవారం కపడలో ఆమె మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై నిప్పులు చెరిగారు. అవసరాన్ని బట్టి మనుషులను వాడుకుంటారని, అవసరం తీరాక అవమానిస్తారని, మీదొక పార్టీ, మీరొక మనుషులా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షర్మిల ప్రశ్నలకు నో ఆన్సర్
మరో వైపు షర్మిల సంధించిన నవ సందేహాలకు ఇంత వరకు సీఎం జగన్ సమాధానం చెప్ప లేదు. గత కొన్ని రోజులుగా సీఎం జగన్‌ను ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రతి రోజు 9 అంశాలతో కూడిన ప్రశ్నలను బహిరంగంగా లేవనెత్తుతూ వీటికి సమాధానం చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని, వారికి రాజ్యాంగం ప్రకారం అమలు కావలసిన పథకాలు అమలు చేయలేదని, గతంలో ఉన్న 28 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని, సబ్‌ప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్లించావని, విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశావని ప్రశ్నించిన షర్మిల తర్వాత నిరుద్యోగులు, ఉద్యోగ వర్గాల సమస్యలపైనా ప్రశ్నలు సంధించారు.
అయితే షర్మిల అడిగిన ప్రశ్నలకు ఇంత వరకు జగన్ సమాధానం చెప్పక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏముందిలే అనుకున్నారా, ఆ పార్టీకి నేనేంది సమాధానం చెప్పేది అనుకున్నారా. చెల్లెల ప్రశ్నలకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా ఇలా అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. మరో వైపు టీడీపీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల విమర్శలకు మాత్రం సమాధానం చెబుతున్న సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలపై స్పందించక పోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిని షర్మిల ఏ విధంగా కౌంటర్ ఇస్తారో అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.
Next Story