Vizag Drugs Case | విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి కుదేలైందా!
x

Vizag Drugs Case | విశాఖ డ్రగ్స్ కేసులో 'కూటమి' కుదేలైందా!

పట్టుబడ్డ డ్రై ఈస్ట్‌లో కొకైన్ ఉందన్న గుజరాత్ నిపుణులు. తాజాగా డ్రై ఈస్ట్‌గా తేల్చిన ఢిల్లీ ల్యాబ్. డ్రగ్స్ అంటూ గగ్గోలు పెట్టిన కూటమి.. సీబీఐ నివేదికతో గప్‌చుప్.


న్యాయస్థానాలిచ్చే తీర్పుల్లో వ్యత్యాసాలున్నట్టే లేబరేటరీలిచ్చే నివేదికల్లోనూ తేడాలుంటాయా? ఈ ల్యాబ్ లిచ్చే నివేదికలే కేసులను తారుమారు చేస్తాయా? దేశంలోనే పెను సంచలనం సృష్టించిన వైజాగ్ డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారంలో ఇప్పుడు పలువురిలో ఇలాంటి సందేహాలే వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు వాడి వేడిగా ప్రచారం చేసుకుంటున్న రోజులవి. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున బురద జల్లుకుంటున్న తరుణమది. సరిగ్గా అలాంటి సమయంలో విశాఖ కంటెయినర్ టెర్మినలు బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక ఓడ ఎన్నికల వేడిని మరింత రాజేసింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆ నౌకలోని కంటైనర్లో పదులు, వందలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల (25 టన్నుల డ్రై ఈస్ట్లో కూడిన మాదక ద్రవ్యాలున్నాయంటూ దుమారం రేగింది. వీటి విలువ రూ.వేలు కోట్లని కొందరు,

లక్ష కోట్లని మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు లెక్కలు కట్టారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమే ఎన్నికల్లో డబ్బు పంచడానికి ఈ డ్రగ్స్ను తీసుకొచ్చారని, రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు దుమ్మెత్తి పోశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ు నానా హంగామా చేశారు. వీరి ఆరోపణలను ఖండించిన వైసీపీ నాయకులు.. ఈ కంటెయినర్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్టు సంస్థ పేరుతో వచ్చిందని, ఈ సంస్థ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి సమీప బంధువులదేనంటూ తిప్పి కొట్టారు. ఇలా అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల్లో విపక్ష, అధికార పక్షాల నేతలు ఈ డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారాన్ని ప్రచార అస్త్రాలుగానూ మలచుకున్నారు. కొన్నాళ్లకు ఎన్నికలు జరిగాయి. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అప్పటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ గద్దె దిగిపోయింది. అనంతరం కూటమి నేతలు డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారంపై ఎందుకనో మాట్లాడడమే మానేశారు.

ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడేమైంది?

బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి ఎస్ఈకేయూ-4375380 నంబరు కలిగిన కంటెయినర్ ఒక నౌకలో మార్చి 16న విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేటు లిమిటెడ్ (వీసీటీపీఎల్)కు చేరుకుంది. ఈ కంటెయినర్లో డ్రై ఈస్ట్ మాటున నిషేధిత మాదక ద్రవ్యాలున్నాయంటూ ఇంటర్ పోల్.. ఢిల్లీలోని సీబీఐకి రహస్య సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటీన రంగంలోకి దిగిన సీబీఐ.. 'ఆపరేషన్ గరుడ' పేరిట తనిఖీలు చేపట్టింది. ఆ కంటెయినర్లో 25 వేల కిలోల బరువున్న వెయ్యి ఈస్ట్ (చేపల మేత తయారీలో వినియోగించే) ప్యాకెట్లను కనుగొన్నారు. మూడు రోజుల తర్వాత వాటిలో డ్రై ఈస్ట్లతో పాటు కొకైన్, హెరాయిన్, ఓపీఎం, కొడైన్, మెథాలాక్విన్ తదితర మాదక ద్రవ్యాల అవశేషాలున్నట్టు గుజరాత్ ల్యాబుకు చెందిన నిపుణులు గుర్తించారు. ఈ నిపుణులు 49 నమూనాలు సేకరించి 27 నమూనాల్లో వీటిని కనుగొన్నారు. మొత్తం వెయ్యి బ్యాగుల్లో 30 శాతం డ్రై ఈస్ట్, 70 శాతం బ్యాగుల్లో డ్రగ్స్ మూలాలున్నట్టు ప్రాథమికంగా అంచనాకొచ్చారు.

దీంతో ఈ కంటెయినర్లో మాదక ద్రవ్యాలున్నాయని అంతా భావించారు. తదుపరి ఈ డ్రై ఈస్ట్ ఎంత పరిమాణంలో మాదక ద్రవ్యాలున్నాయో నిర్ధారించడానికి ఢిల్లీలోని సెంట్రల్ నార్కొటిక్ డ్రగ్స్ లేబరేటరీకి పంపారు. మరోవైపు సీబీఐ అధికారుల బృందం ఇంటర్పోల్ సాయంతో బ్రెజిల్ వెళ్లింది. శాంటోస్ పోర్టుకు డ్రై ఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గం, ఆ నౌక ఆగిన పోర్టుల్లో సీసీ ఫుటేజీలను ఈ బృందం పరిశీలించి కీలక ఆధారాలు సేకరించిందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు.. శాంటోస్ పోర్టులో విశాఖకు వచ్చిన కంటెయినర్ నంబరుతో ఉన్న మరో కంటెయినర్ ఉన్నట్టు,, తనిఖీల సమయంలో ఒకదానినే చూపించారని, లోడింగ్ సమయంలో డ్రగ్స్/డ్రై ఈస్ట్ ఉన్న కంటెయినర్న నౌకలోకి ఎక్కించారని గుర్తించారని తెలిసింది.

దీంతో ఈ డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టవుతుందని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. మరోవైపు సీజ్ చేసిన కంటెయినర్ను విశాఖ వీసీటీపీఎల్లో సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో ఉంచారు. తీరా ఎనిమిది నెలల అనంతరం ఇప్పుడు బ్రెజిల్ నుంచి కంటెయినర్లో వచ్చినవి డ్రగ్స్ కానేకాదని, డ్రై ఈస్ట్ మాత్రమేనని సెంట్రల్ నార్కొటిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చింది. ఆ నివేదికను సీబీఐ అధికారులు విశాఖోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్డు జడ్జికి నవంబరు 27న సమర్పించి ఈ కేసును మూసివేయాలని కోరారు. కోర్టు అందుకు ఆమోదం తెలపడంతో ఆ కంటెయినర్ను సంబంధిత సంధ్యా ఆక్వా సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్ అధికారులకు లేఖ రాశారు. అయితే ఇప్పటికే తొమ్మిది నెలలు అయిపోయినందున అందులో ఉన్న డ్రై ఈస్ట్ తమకు పనికిరాదంటూ దానిని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు.

ఆరంభం, ముగింపూ సంచలనమే..

ఈ డ్రగ్స్ కంటెయినర్ కేసు ఆరంభంలో ఎంత సంచలనమైందో, ముగింపు కూడా అంతే సంచలనం కలిగిస్తోంది. పట్టుబడ్డ ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని ఊదర గొట్టిన ఈ కేసు చివరకు అబ్బే.. అవి డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్టేనని నివేదిక రావడంతో విశాఖ వాసులే కాదు.. ఈ కేసు గురించి ఎరిగిన వారంతా విస్తుపోతున్నారు. గతంలో గుజరాత్ ల్యాబ్ నిపుణులు డ్రగ్స్ అవశేషాలున్నట్టు ఇచ్చిన నివేదిక సరైనదా? లేక తాజాగా ఇచ్చిన నివేదిక సరైనదా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చిలో కంటెయినర్ పట్టుబడినప్పుడు అందులో ఉన్నవి డ్రగ్స్ అంటూ నానా హంగామా, హడావుడి చేసిన టీడీపీ, జనసేన అధినేతలు, ఆ పార్టీల నాయకులు.. ఇప్పుడు గప్ చిప్ ఉండడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ లబ్ది పొందడానికే కూటమి నేతలు తమపై డ్రగ్స్ బురద జల్లారని, తీరా ఇప్పుడు డ్రై ఈస్ట్ తేల్చారంటూ వైసీపీ నేతలు వాపోతున్నారు.

Read More
Next Story