మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం కాళ్లు పట్టుకున్నారా?
"పెద్ద రెడ్ల "మధ్య డైలాగ్ వార్‌కు తెర లేచింది. మొదటిసారి మంత్రి పెద్దిరెడ్డికి ధిక్కారం ఎదురైంది. మాజీ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: రాయలసీమ రాజకీయాలను శాసిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. " సీఎం పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి.. చిదంబరం కాళ్లు పట్టుకున్నారు" అని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్య దుమారం లేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ సీఎం, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదటిసారి ఘాటుగా స్పందించారు.
" చిత్తూరు డిసిసి అధ్యక్ష పదవి కోసం సగం రాత్రి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు’’ అని పీలేరులో జరిగిన బహిరంగ సభలో కౌంటర్ ఇచ్చారు. ‘‘సంస్కారం కాదు కాబట్టి.. ఇప్పటివరకు నేను ఎక్కడ ఈ మాట అనలేదు. చెప్పకూడదనే అనుకున్నా. నాపై అకారణంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదు’’ అని కిరణ్ కుమార్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘాటుగా బదులిచ్చారు.
" తెల్లవారుజామున నేను బస చేసిన తిరుపతి పద్మావతి అతిథి గృహానికి మళ్లీ వచ్చి నా కాళ్లు పట్టుకొని పెద్దిరెడ్డి వేడుకున్నారు" అని తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. " నేను రాత్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు మద్యం మత్తులో ఉన్నావని అనుకున్నావేమో.. అందుకే ఇప్పుడు వచ్చాను" అని పెద్దిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. " డిసిసి అధ్యక్ష పదవి కోసం నా కాళ్లు పట్టుకోలేదని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమా?" అని పెద్దిరెడ్డికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
దీంతో.. చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్ల మధ్య పేలుతున్న మాటల తూటాలు హాట్ టాపిక్‌గా మారాయి. జిల్లాలో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎం, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య సాగుతున్న డైలాగ్ వార్ చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్తూరు జిల్లాలో రాజకీయంగా బద్ధ శత్రుత్వం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అది సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య డైరెక్ట్ ఫైట్ ప్రారంభమైంది. మాటలతోనే కత్తులు దూసుకుంటున్నారు. నువ్వంటే నువ్వు కాళ్లు పట్టుకున్నావు అంటూ ఇద్దరు నేతలు మాటలతో మంటలు రేపారు. ఆ ఇద్దరు నేతల డైలాగ్ వార్ చిత్తూరు జిల్లా రాజకీయాన్ని కుదిపేస్తోంది.
స్వపక్షంలో.. విపక్షం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ బడిలో పాఠాలు నేర్చుకున్న వారే. 1989 నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యానికి బీజం పడింది. ప్రత్యక్షంగా ఎప్పుడూ కత్తులు దూసుకున్న సందర్భాలు లేవు. అజ్ఞాతంగానే ఎవరికివారు ఆధిపత్యం కోసం స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించారు. ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయంగా డైరెక్ట్ ఫైట్ జరిగిన దాఖలాలు లేవు. నాలుగు దశాబ్దాలుగా వాల్మీకిపురం నియోజకవర్గం నుంచి
నల్లారి కుటుంబం రాజకీయాలను నెరిపింది. ఆ నియోజకవర్గంలో తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసత్వంగా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేశారు. వారి పొరుగునే ఉన్న పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు. వారిద్దరూ ఎదురుపడిన సందర్భాలు లేవు. ఉన్నా ఎడముఖం-పెడముఖంగానే ఉండేవారు.
ఇప్పుడు.. డైరెక్ట్ వార్
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య ఇప్పుడే డైరెక్ట్ ఫైట్ ప్రారంభమైంది. నాలుగు దశాబ్దాలుగా ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. అయినా ప్రత్యక్షంగా ఎన్నికల్లో తలపడిన సందర్భాలు మాత్రం లేవు. కారణం, చాలాకాలం ఆ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉండడమే.
మొదటిసారి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాలు తలపడుతున్నాయి. అది కూడా.. అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి, బిజెపి నుంచి ఆ రెండు కుటుంబాల సభ్యులు పోటీకి దిగారు. దీంతో రాజకీయ వైరుధ్యం కాస్త యుద్ధంగా మారింది.
మంటలు రేపుతున్న మాటలు..
రాయలసీమలో వైఎస్ఆర్సిపి రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎం, బిజెపి నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం రాజకీయంగా దుమారం లేపుతోంది. మొదటిసారి నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు నాంది పలికింది. రాజంపేట ఎంపీ స్థానం నుంచి మాజీ సీఎం, బిజెపి జాతీయ కార్యదర్శి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా, ఆయనపై సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తలపడుతున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోనే ఉన్న పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్న పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాల తర్వాత ప్రత్యక్ష పోరాటానికి 2024 ఎన్నికలు నాంది పలకడంతో పాటు హాట్ హాట్‌గా మారాయి. మాటల యుద్ధం కూడా ప్రారంభమైంది. " ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దెబ్బతినడానికి అప్పట్లో సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. సీఎం పదవి కోసం అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నారు. వైయస్ ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచాడు" అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో మొదటిసారి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో ధిక్కారస్వరమే కాదు.. కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా మాటలతో చిందులు తొక్కారు. " నేను నల్లారి అమర్నాథ్ రెడ్డి కొడుకుని. నాకు ఆత్మాభిమానం ఉంది. పదవుల కోసం నేను ఎవరి కాళ్లు పట్టుకోలేదు’’ అని కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్పారు.
అంతటితో ఆగక..
" నా నియోజకవర్గంలోని 50 మంది కార్యకర్తలతో తిరుపతి పద్మావతి అతిథి గృహంలో మాట్లాడుతుండగా.. నీవు( పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) సగం రాత్రి అప్పుడు నా గదికి వచ్చి డిసిసి అధ్యక్ష పదవి కోసం నా కాళ్లు పట్టుకున్నది వాస్తవం కాదా?" అని కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ‘‘పొద్దున్నే మళ్ళీ వచ్చావు. రాత్రి నేను తాగిన మైకంలో నీ దగ్గరికి రాలేదని చెప్పడానికే వచ్చానని వివరణ ఇచ్చింది వాస్తవం కాదా?’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సూటిగా ప్రశ్నించారు కిరణ్ కుమార్ రెడ్డి.
" నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా.. నీవు.. కాణిపాకం లేదా తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తావా? " అని సవాల్ విసిరారు. ఇందుకు... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దీటుగానే స్పందించారు.
రాళ్లతో కొట్టిస్తా..
"కిరణ్ కుమార్ రెడ్డి నాకు రాజకీయ వ్యతిరేకి. నేను ప్రజానాయకుడిని. నువ్వు కుట్రదారుడివి. మ్యానుప్లేటర్వి.. దొంగ చాటు రాజకీయాలు చేయడం నీకే అలవాటు" అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, రాళ్లతో కొట్టిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. తన ఆరోపణలను కొనసాగించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు.
" చనిపోయిన పుట్టపర్తి సాయిబాబా పార్థివ దేహాన్ని వారం రోజులు అట్టే ఉంచి. ప్రశాంతి నిలయం నుంచి బంగారం, డబ్బు దోచుకున్నది వాస్తవం కాదా? నీవు సీఎంగా ఉంటూ, ఆ సొమ్ము చిదంబరం. ఢిల్లీ పెద్దలకు పంపకాలు చేయలేదా" అని ఘాటు ఆరోపణ చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగినట్లు వ్యవహరించి, వైయస్సార్ కుటుంబానికి ద్రోహం చేశావు" అని చేసిన వ్యాఖ్యలతో.. కాక రేగింది.
" కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ చేసిన వారు ఎవరు విజయం సాధించలేదు. నీకు కూడా అదే పరిస్థితి తప్పదు’’ అని కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. మినహా.. కిరణ్ కుమార్ రెడ్డి సవాలను మాత్రం ఆయన స్వీకరించలేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇది డైరెక్ట్ ఫైట్
రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. నల్లారి కుటుంబం నుంచి అన్నదమ్ములు పోటీలో ఉన్నారు. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య మొదటి సారి ప్రత్యక్షంగా ఎన్నికల రణం జరుగుతోంది. దీంతో అన్నదమ్ములను దెబ్బ తీయడానికి పరస్పరం పోరాటం ప్రారంభం అయ్యింది. దీంతో అందరి చూపులు ఇటు మళ్ళాయి. వీరిద్దరి వ్యవహారం రాజకీయంగా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.