ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని పడగొట్టింది గౌతు లచ్చన్నా?
x
నాటి ప్రధానితో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి

ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని పడగొట్టింది గౌతు లచ్చన్నా?

1953లో ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి విడిపోతే 1955లో మధ్యంతర ఎన్నికలు ఎందుకు జరగాల్సి వచ్చిందీ? కమ్యూనిస్టుల్నికసికొద్ది ఎందుకు ఓడించారు?


ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి. కమ్యూనిస్టులు, ఆచార్య ఎన్జీరంగా పెట్టిన కృషీకార్‌ లోక్‌పార్టీ (కేఎల్‌పీ), కాంగ్రెస్‌ పార్టీ, ప్రకాశం పంతులు పెట్టిన హైదరాబాద్‌ స్టేట్‌ ప్రజా పార్టీ (హైదరాబాద్‌ స్టేట్‌ పీపుల్స్‌ పార్టీ)ల వారు శాసనసభ్యులు. నెహ్రూ ప్రధానమంత్రి.


1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. కమ్యూనిస్టులు రెండో స్థానంలో సోషలిస్టులు మూడోస్థానంలో నిలిచారు. 1952 డిసెంబర్‌లో తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు పొడసూపాయి. పొట్టి శ్రీరాములు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయి. దీనికితోడు నెహ్రూ పాలనా పద్ధతులపైన, వ్యవసాయ రంగ విధానాలపైనా పార్టీల మధ్య సఖ్యత లేదు.

అలా కాంగ్రెస్‌ నుంచి బయటకువచ్చిన ప్రకాశం పంతులు 1952లో హైదరాబాద్‌ స్టేట్‌ ప్రజా పార్టీ (హైదరాబాద్‌ స్టేట్‌ పీపుల్స్‌ పార్టీ)ని స్థాపించారు. ఆచార్య ఎన్జీరంగా అప్పటికే కృషీకార్‌ లోక్‌పార్టీని పెట్టుకున్నారు. ప్రకాశం పంతులు పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ మంత్రులందర్నీ ఓడించారు. అయినా ప్రజాపార్టీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది. ఆచార్య ఎన్జీరంగా పార్టీ కృషీకార్‌ లోక్‌ పార్టీని, కొందరు కాంగ్రెస్‌ వాదుల్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రకాశం పంతులు.
1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సిఎంగా ఆయన 13 నెలల పరిపాలన చేశారు. 1954 నవంబర్‌ వచ్చింది. ప్రకాశం పంతులుపై అటు కమ్యూనిస్టులు ఇటు ఆచార్య ఎన్జీ రంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. కమ్యూనిస్టులు మంచి ఊపు మీదున్నారు. ప్రకాశం పంతులు విధానాలు నచ్చక కృషీకార్‌ లోక్‌పార్టీ నాయకుడైన గౌతు లచ్చన్న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటి మాదిరిగా వ్యక్తిగత తిట్లు, శాపనార్ధాలతో కాకుండా పూర్తి స్థాయిలో విధివిధానాలపై అర్థవంతమైన చర్చ సాగింది. ఆ తర్వాత జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్‌ మద్దతుతో నడుస్తున్న ప్రకాశం పంతులు ప్రభుత్వం ఓడిపోయింది. దాంతో టంగుటూరి రాజీనామా చేయకతప్పలేదు.
అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని– కర్నూలు నుంచి ఈ పాలన సాగింది. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్ట్‌– నాగార్జునసాగర్‌కు శంఖుస్థాపన, విజయవాడ వద్ద కృష్ణా నదిపై బ్యారేజీ–కం– రెగ్యులేటర్‌ను ప్రారంభం వంటివి అప్పుడే జరిగాయి. రాష్ట్రానికి హైకోర్టు, తిరుపతిలో కొత్త విశ్వవిద్యాలయం (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) అమరుతున్నాయి. కమ్యూనిస్టుల వ్యతిరేకత, సోషలిస్టుల మద్దతు ఉపసంహరణ కారణంగా టంగుటూరి ప్రభుత్వం ఒక ఏడాదికి మించి సాగలేదు.
1955లో మధ్యంతర ఎన్నికలు...

1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1955 ఫిబ్రవరి 11న 167 అసెంబ్లీ నియోజకవర్గాలకు 581 మంది పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కమ్యూనిస్టులు విశ్వప్రయత్నం చేశారు. వారిని నిలువరించేందుకు పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఏకమయ్యారు. అటు కాంగ్రెస్‌ ఇటు ఆచార్య ఎన్జీరంగా పార్టీ, మరోవైపు టంగుటూరి ప్రకాశం పంతులు.. ఇలా అందరూ కలిసి కమ్యూనిస్టు వ్యతిరేక కూటమిగా ఏర్పడి ప్రచారం చేశారు. కమ్యూనిస్టులకు అధికారం దక్కకుండా జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆచార్య ఎన్జీరంగా, టంగుటూరి ప్రకాశం పంతులు పార్టీ అన్నీ కలిసి ఐక్య కాంగ్రెస్‌గా ఏర్పడ్డారు. ఫలితంగా కమ్యూనిస్టులు ఘోరంగా ఓడిపోయారు. అంతుకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకన్నా ఎక్కువగా 55 సీట్లున్న కమ్యూనిస్టులు మధ్యంతర ఎన్నికల్లో మైనార్టీలో పడిపోయి కేవలం 16 సీట్లకే పరిమితం అయ్యారు. ఆత్మకూరు శాసనసభ్యుడు, ఆంధ్ర టాగోర్‌గా పిలిచే బెజవాడ గోపాలరెడ్డి సీఎం అయ్యారు. 1956 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
రంగులు మార్చే రంగా అన్నది నెహ్రూయే...
’ఆంధ్రాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గాలంటే నేను వాళ్లకు (కాంగ్రెస్‌) కావాలి. అందుకే నాకు రైతు సమస్యలపై స్వేచ్ఛనిచ్చారు’ అన్నారు రంగా. 1955 మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టుల్ని ఓడించిన తర్వాత ఏర్పడిన కాంగ్రెస్‌ పార్టీపైనా రంగా లాంటి వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమ్యూనిస్టుల్ని ఓడించేందుకు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న యునైటెడ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ పాత పాటే పాడిందని, రైతుల భూమి హక్కు విషయంలోనూ దొంగ నాటకం ఆడిందని రంగా లాంటి వాళ్లు విమర్శించినా అప్పటికే కాంగ్రెస్‌ బలపడింది. ఏ రంగా నుంచి మద్దతు పొందారో అదే రంగాను జవహర్‌ లాల్‌ నెహ్రూ సాక్షాత్తు పార్లమెంటులోనే ’రంగులు మార్చే రంగా’ అనడంతో ఆయన కంగుతిన్నారు. అది వేరే విషయం.
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ ఇలా...
గౌతు లచ్చన్న, కృషీకార్ లోక్ పార్టీ
అప్పటికే ప్రకాశం పంతులు క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు విరమించుకున్నారు. 1956 నవంబర్‌ 1న పూర్వపు హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటైంది. ప్రకాశం పంతులు అనుంగు శిష్యుడుగా భావించే నీలం సంజీవ రెడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. హరిజన సమస్యలపై (హరిజన అనే పదాన్ని ఇప్పుడు నిషేధించారు. దళిత అనాలి) రాష్ట్ర పర్యటన చేస్తూ తీవ్ర వడదెబ్బకు గురవుతాడు. హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 మే 1957 న మరణించారు ప్రకాశం పంతులు.
మద్రాసు ప్రెసిడెన్సీలోనూ ముఖ్యమంత్రే...
1946లో మద్రాసు ప్రెసిడెన్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత ప్రకాశం పంతులు 1946 ఏప్రిల్‌ 30న ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా అన్ని విదేశీ వస్త్ర కర్మాగారాలను రద్దు చేసి, ఖాదీ మిల్లులను మాత్రమే ఆపరేట్‌ చేయించారు. కాంగ్రెస్‌ పార్టీతో వచ్చిన విభేదాలతో 11 నెలల పాటు పదవిలో కొనసాగి 1947 మార్చి 23 మార్చిన పదవిని వదులుకున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూనే నెహ్రూ ఆర్ధిక విధానంపై విమర్శలు చేస్తుండడం నెహ్రూ అనుచరులకు ఇష్టం ఉండేది కాదు. మహాత్మా గాంధీ చెప్పిన గ్రామీణాభివృద్ధి పద్ధతులను టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్జీ రంగా లాంటి వాళ్లు సమర్ధించేవారు. నెహ్రూ సోవియెట్‌ యూనియన్‌ ప్రభావిత ప్రణాళికాభివృద్ధిని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించే వారు.
ప్రకాశం భారతీయ శ్రామిక వర్గం కోసం పోరాడారు. బ్రిటిష్‌ శ్రామిక–వర్గ ఉద్యమం తరహాలో కార్మికులకూ ఓ పార్టీ, సంఘాలు ఉండాలన్నారు. ప్రకాశం దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. కాంగ్రెస్‌ పార్టీలో గాంధేయవాదులు, సోషలిస్టుల మధ్య సయోధ్య కోసం ప్రయత్నించారు. ఐక్య కార్యాచరణ ఉండాలనే పదేపదే చెప్పే ప్రకాశం పంతులు అవసరమైనప్పుడు గాంధీజీని సైతం ఎదిరించడానికి వెనుకాడలేదు. విలువల కోసం పాటు పడిన ఆనాటితరం నాయకుల్ని ఈవేళ మనం ఎక్కడెక్కడా వెతికినా కనబడరంటే అతిశయోక్తి కాదు.
Read More
Next Story