ప్రజాగళం  దగ్గిర  ఎస్పీ వైసీపీ కార్యకర్తలా పనిచేశారా?
x
Source: Twitter

' ప్రజాగళం ' దగ్గిర ఎస్పీ వైసీపీ కార్యకర్తలా పనిచేశారా?

ప్రజాగళం సభలో తలెత్తిన భద్రత ఉల్లంఘనపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు కూటమి నేత వర్ల రామయ్య వెల్లడించారు. ఎస్పీ రవిశంకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


చిలకలూరి పేటలో ఎన్‌డీయే కూటమి ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ సభను భగ్నం చేయడానికి అనేక కుట్రలు జరిగాయని కూటమి నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతా వైఫల్యం కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తాము ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాకు ఫిర్యాదు చేశామని చెప్పారు నేతలు. వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బీ రామకృష్ణ తదితరులు కలిసి ఎన్నికల అధికారిని కలిసి తమ ఫిర్యాదును అందించారు. ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యముందని, ఈ విషయంపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ తనకు పట్టనట్లు వ్యవహరించారని ఆరోపించారు వర్ల రామయ్య. ‘ప్రజాగళం’లో తలెత్తిన భద్రతా వైఫల్యాలను పరిశీలించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరామని చెప్పారాయన.


వైసీపీ కార్యకర్తగా ఎస్‌పీ

A‘ప్రజాగళం’ సభ సమయంలో ఎస్పీ రవిశంకర్ ఒక వైసీపీ కార్యకర్త తరహాలో వ్యవహరించారని, తమ ఫిర్యాదులను పెడచెవిన పెట్టారని వర్ల రామయ్య మండిపడ్డారు. ‘‘సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. సరైన భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీనే డీజీపీకి లేఖ కూడా రాశాం. కానీ ఆదివారం జరిగిన సభలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించలేదు. సభను భగ్నం చేయడానికి ఎస్పీ రవిశంకర్.. వైసీపీ కార్యకర్త మాదిరిగా ప్రవర్తించారు. లేదంటే ప్రధాని పాల్గొన్న సభలో మైక్‌లు పలుసార్లు ఆగిపోవడమేంటి. ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ విషయంపై ఆధారాలతో సహా నలుగురు పోలీసుల అధికారులపై ఫిర్యాదు చేశాం. ఆ నలుగురు పోలీసులు విధుల్లో కొనసాగితే ఎన్నికలు సజావుగా సాగవని వివరించి వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరాం’’ అని వివరించారు. ఈ విషయంపై తాము దృష్టి సారిస్తామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారని తెలిపారాయన.

‘ప్రజాగళం’ పేరిట మరిన్ని సభలు

ఒకవైపు చిలకలూరి పేటలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభను భగ్నం చేయడానికి తీవ్ర స్థాయిలో కుట్రలు జరిగాయని టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతలు మండిపడుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆదివారం జరిగిన సభపై చంద్రబాబు సమీక్షించారు. ఇందులో భాగంగానే ‘‘ప్రజాగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలి. వాటిని కూడా విజయవంతం చేయాలి. ఇందులో టీడీపీ తీసుకొచ్చే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి’’అని నేతలకు వివరించారు చంద్రబాబు. అనంతరం ఆదివారం జరిగిన సభను విఫలం చేయడానికి జరిగిన కుట్రలపై నేతలు చంద్రబాబుకు వివరించారు. వాటిని ఆలకించిన చంద్రబాబు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన, పన్నాగాలు పన్నినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది ఎన్‌డీఏ కూటమే అని ధీమా వ్యక్తం చేశారు.


Read More
Next Story